T20 World Cup Semifinal Schedule: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ షెడ్యూల్ ఇదే.. ఏ టీమ్ ఎవరితో ఆడనుందో చూడండి-t20 world cup 2024 semifinals schedule india to face england afghanistan to face south africa ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup Semifinal Schedule: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ షెడ్యూల్ ఇదే.. ఏ టీమ్ ఎవరితో ఆడనుందో చూడండి

T20 World Cup Semifinal Schedule: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ షెడ్యూల్ ఇదే.. ఏ టీమ్ ఎవరితో ఆడనుందో చూడండి

Hari Prasad S HT Telugu
Jun 25, 2024 12:12 PM IST

T20 World Cup Semifinal Schedule: టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్ కూడా ముగిసింది. సెమీఫైనల్స్ చేరిన నాలుగు టీమ్స్ ఏవో తేలిపోయింది. ఇక ఏ టీమ్ ఎవరితో, ఎప్పుడు సెమీఫైనల్స్ ఆడనున్నాయో చూడండి.

టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ షెడ్యూల్ ఇదే.. ఏ టీమ్ ఎవరితో ఆడనుందో చూడండి
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ షెడ్యూల్ ఇదే.. ఏ టీమ్ ఎవరితో ఆడనుందో చూడండి

T20 World Cup Semifinal Schedule: టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది. లీగ్, సూపర్ 8 కలిపి 52 మ్యాచ్ లు ముగిసిన తర్వాత 20 జట్లలో చివరికి సెమీఫైనల్స్ లో నాలుగు మిగిలాయి. చివరిగా మంగళవారం (జూన్ 25) బంగ్లాదేశ్ ను ఓడించి ఆఫ్ఘనిస్థాన్ సెమీస్ చేరింది. మరి ఈ నాలుగు టీమ్స్ లో ఎవరు ఎవరితో తలపడబోతున్నారో చూద్దాం.

సెమీఫైనల్స్ షెడ్యూల్ ఇదే

టీ20 వరల్డ్ కప్ 2024లో లీగ్, సూపర్ 8 స్టేజ్ లో కొన్ని అనూహ్య ఫలితాలు నమోదైన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్ టీమ్ మొదట లీగ్ స్టేజ్ లో న్యూజిలాండ్ కు, సూపర్ 8లో ఆస్ట్రేలియాకు షాకిచ్చి తొలిసారి ఓ వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరింది. ఇక యూఎస్ఏ చేతుల్లో పాకిస్థాన్ ఓడిపోవడం కూడా మరో సంచలనమే. ఆ ఓటమితో లీగ్ స్టేజ్ లోనే పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది.

ఇప్పుడు సెమీఫైనల్ కు ఇండియాతోపాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ చేరాయి. సూపర్ 8 గ్రూప్ 1 నుంచి ఇండియా, ఆఫ్ఘనిస్థాన్.. గ్రూప్ 2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఫైనల్ 4లో అడుగుపెట్టాయి. ఇక ఇప్పుడు తొలి సెమీఫైనల్లో గ్రూప్ 1లో రెండో స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్థాన్.. గ్రూప్ 2లో టాప్ లో నిలిచిన సౌతాఫ్రికాతో తలడపడనుంది.

ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం (జూన్ 27) ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో సెమీఫైనల్లో ఇండియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కూడా గురువారం (జూన్ 27) రాత్రి 8 గంటలకు గయానాలో జరుగుతుంది. నిజానికి ఇండియానే తొలి సెమీస్ ఆడాల్సి ఉన్నా.. భారత కాలమానాన్ని పరిగణనలోకి తీసుకొని ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే రెండో మ్యాచే ఆడేలా ఐసీసీ ముందే షెడ్యూల్ రిలీజ్ చేసింది.

సెమీస్ టీమ్స్ రికార్డులు ఇలా..

ఇప్పుడు సెమీఫైనల్స్ లో తలపడుతున్న నాలుగు టీమ్స్ రికార్డులు ఒకసారి చూద్దాం. తొలి సెమీఫైనల్లో తలపడనున్న సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటి వరకూ టీ20 వరల్డ్ కప్ లో రెండుసార్లు తలపడ్డాయి. 2010, 2016లలో ఆడగా.. రెండుసార్లూ సఫారీలే విజయం సాధించారు. ఇప్పుడు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలాంటి జట్లకు షాకిచ్చిన ఆఫ్ఘన్ జట్టును ఆ టీమ్ తేలిగ్గా తీసుకోదు అనడంలో సందేహం లేదు.

ఇక రెండో సెమీఫైనల్లో తలపడే ఇండియా, ఇంగ్లండ్ రికార్డులు చూస్తే.. గతంలో టీ20 వరల్డ్ కప్ లలో ఆరుసార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. వీటిలో నాలుగు మ్యాచ్ లలో ఇండియా, రెండింట్లో ఇంగ్లండ్ గెలిచింది. చివరిసారి 2022 వరల్డ్ కప్ సెమీఫైనల్లోనే ఆడగా.. ఇండియా ఓడిపోయింది. ఇది కచ్చితంగా ఇంగ్లండ్ కాన్ఫిడెన్స్ ను పెంచేదే. అయితే ఈసారి మరో విశేషం ఏంటంటే.. సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ రూపంలో ఇప్పటి వరకూ టీ20 వరల్డ్ కప్ గెలవని ఒక జట్టు కచ్చితంగా ఫైనల్లో అడుగుపెట్టబోతోంది.

Whats_app_banner