IND vs BAN: బంగ్లాదేశ్‍తో సిరీస్‍కు ముందు టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన గవాస్కర్-sunil gavaskar gives warning to team india ahead of test series with bangladesh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban: బంగ్లాదేశ్‍తో సిరీస్‍కు ముందు టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన గవాస్కర్

IND vs BAN: బంగ్లాదేశ్‍తో సిరీస్‍కు ముందు టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన గవాస్కర్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 16, 2024 05:56 PM IST

IND vs BAN Test Series: బంగ్లాదేశ్‍తో టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్ రెడీ అయింది. ఈ తరుణంలో టీమిండియాకు వార్నింగ్ ఇచ్చారు మాజీ స్టార్ సునీల్ గవాస్కర్. పాకిస్థాన్‍ను బంగ్లా చిత్తుచేయడం గురించి గుర్తు చేశారు. మరిన్ని విషయాలు ప్రస్తావించారు.

IND vs BAN: బంగ్లాదేశ్‍తో సిరీస్‍కు ముందు టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన గవాస్కర్
IND vs BAN: బంగ్లాదేశ్‍తో సిరీస్‍కు ముందు టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన గవాస్కర్ (PTI)

టెస్టు సమరానికి భారత్ సమాయత్తవుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‍తో టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. భారత్, బంగ్లా మధ్య సెప్టెంబర్ 19న తొలి టెస్టు షురూ కానుంది. పాకిస్థాన్‍పై ఇటీవలే 2-0తో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్. ఫుల్ జోష్‍లో ఉంది. దీంతో భారత్‍తో సిరీస్‍లోనూ మంచి ఫామ్‍లోకి బరిలోకి దిగనుంది. గతంలోనూ టీమిండియాకు బంగ్లా కొన్నిసార్లు షాక్ ఇచ్చింది. దీంతో బంగ్లాను భారత్ తేలికగా తీసుకోవడం లేదు. ఈ తరుణంలో టీమిండియాకు హెచ్చరిక చేశారు భారత మాజీ కెప్టెన్, దిగ్గజం సునీల్ గవాస్కర్.

పాకిస్థాన్‍ను చిత్తు చేయడంతో బంగ్లాదేశ్ తమ సత్తాను ప్రదర్శించిందని గవాస్కర్ అన్నారు. గతంలో బంగ్లాకు భారత్ వెళ్లినప్పుడు ఆ జట్టు వీరోచితంగా పోరాడిందని గుర్తు చేశారు. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ చేరాలంటే బంగ్లా సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమని, అందుకే జాగ్రత్తగా ఆడాలని హెచ్చరించారు.

భారత్‍తో ఆడేందుకు తహతహలాడుతున్నారు

పాకిస్థాన్‍పై గెలిచాక ఇండియాతో సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ ఆటగాళ్లు తహతహలాడుతున్నారని, ఇష్టంగా ఎదురుచూస్తున్నారని మిడ్-డేకు రాసిన కాలమ్‍లో సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. “పాకిస్థాన్‍లో ఆడిన రెండు మ్యాచ్‍ల్లో ఆ జట్టును బంగ్లాదేశ్ ఓడించింది. దీని ద్వారా వారి శక్తి ఏంటో చాటింది. రెండేళ్ల క్రితం కూడా బంగ్లాదేశ్‍లో భారత్ పర్యటించినప్పుడు.. బంగ్లాదేశీయులు బలమైన పోటీ ఇచ్చారు. పాకిస్థాన్‍తో సిరీస్‍ను కైవసం చేసుకున్నాక.. భారత్‍తో తలపడేందుకు మరింత ఇష్టంతో ఉన్నారు” అని గవాస్కర్ తెలిపారు.

బంగ్లాదేశ్ జట్టులో కొందరు కొత్త ప్లేయర్లు ప్రస్తుతం బాగా ఆడుతూ.. ప్రత్యర్థి జట్లను ఆశ్చర్యపరుస్తున్నారని గవాస్కర్ చెప్పారు. భారత్, బంగ్లాదేశ్ సిరీస్ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు.

ఫైనల్ చేరాలంటే ఐదైనా గెలువాలి!

టీమిండియా తదుపరి ఐదు నెలల్లో 10 టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్‍తో మూడు టెస్టుల్లో తలపడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడనుంది. 2025లో జరిగే టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్ చేరాలంటే భారత్ ఈ సిరీస్‍ల్లో రాణించాల్సిందే. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు భారత్ ఐదు టెస్టులైన గెలువాలని గవాస్కర్ అన్నారు.

టీమిండియా టెస్టు సిరీస్‍ల కోసం తాను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని గవాస్కర్ చెప్పారు. “తదుపరి నాలున్నర నెలల్లో భారత్‍కు 10 టెస్టులు ఉన్నాయి. ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ ఫైనల్‍కు అర్హత సాధించే అవకాశాలు పెంచుకోవాలంటే ఐదు టెస్టులైనా గెలువాలి. ఇందులో ఏదీ సులువైన సిరీస్ లేదు. అందుకే ఇది చాలా ఎగ్జైటింగ్‍గా ఉండనుంది” అని గవాస్కర్ అన్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య చెన్నై వేదికగా సెప్టెంబర్ 19న తొలి టెస్టు షురూ కానుంది. ఇప్పటికే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత ఆటగాళ్లు జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక, రెండో టెస్టు కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న మొదలుకానుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ ఉండనుంది. అక్టోబర్ 6న తొలి టీ20, 9న రెండో మ్యాచ్, అక్టోబర్ 12న మూడో టీ20 జరగనుంది.

Whats_app_banner