Shubman Gill: వరల్డ్ కప్ నుంచి శుభ్‌మన్‌ను తప్పించిన బీసీసీఐ - ప్లాన్‌లో భాగమేనా? పనిష్‌మెంటా?
Shubman Gill: టీ20 వరల్డ్ మధ్యలో నుంచే శుభ్‌మన్ గిల్ తప్పుకున్నాడు. గిల్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసిన బీసీసీఐ ఇండియాకు పంపించేస్తోంది. గిల్ తో పాటు పేసర్ ఆవేశ్‌ఖాన్ కూడా స్వదేశానికి రానున్నాడు. అందుకు కారణం ఏమిటంటే?
Shubman Gill: టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8లోకి టీమిండియా ఎంట్రీ ఇచ్చింది. నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో గ్రూప్‌లో ఏలో టాపర్‌గా నిలిచింది. టీమిండియా, కెనడా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్ధయింది. కాగా సూపర్ 8కు ముందు టీమిండియా తీసుకున్న ఓ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
టీమ్ నుంచి స్టార్ బ్యాట్స్‌మెన్స్ శుభ్‌మన్ గిల్‌తో పాటు పేసర్ ఆవేశ్ ఖాన్‌ను రిలీజ్ చేసిన బీసీసీఐ వారిని తిరిగి ఇండియా పంపించేస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో గిల్‌తో పాటు ఆవేశ్‌ఖాన్ ఇండియాకు తిరిగిరానున్నారు. మరో ఇద్దరు రిజర్వుడ్ ప్లేయర్స్ రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్‌లను మాత్రం జట్టుతోనే అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నది.
క్రమశిక్షణ చర్యలు...
అయితే శుభ్‌మన్ గిల్‌ను టీ20 వరల్డ్ నుంచి తప్పించడంపై క్రికెట్ వర్గాల్లో రకరకాల కథనాలు వినిపిస్తోన్నాయి. క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే గిల్‌ను జట్టు నుంచి తప్పించినట్లు వార్తలు వెలువడుతోన్నాయి. ఈ టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లి ఓపెనర్‌గా బరిలో దిగడంతో శుభ్‌మన్ గిల్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. మూడు మ్యాచుల్లో అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ఇప్పటివకు ఆడిన మూడు మ్యాచుల్లో టీమిండియా గెలవడంతో ఇదే టీమ్‌ను సూపర్ 8లో కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించుకున్నది. దాంతో శుభ్‌మన్‌కు ఛాన్స్ దక్కే అవకాశం లేదని తేలింది.
ప్రాక్టీస్ సెషన్స్‌కు దూరం...
ఈ విషయం అర్థం చేసుకున్న శుభ్‌మన్ గిల్ టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ సెషన్స్‌కు దూరంగా ఉంటున్నాడని క్రికెట్ వర్గాల్లో వార్తలు వినిపిస్తోన్నాయి. క్రికెట్‌పై ఫోకస్ తగ్గించి తన బ్రాండ్స్ ప్రమోషన్స్, యాడ్స్ షూటింగ్ కోసమే సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ వచ్చాడని వార్తలొచ్చాయి.
అంతే కాకుండా ప్రాక్టీస్ సెషన్స్‌తో పాటు టీమ్ మీటింగ్స్‌కు కూడా డుమ్మా కొట్టి అమెరికా టూర్‌ను ఎంజాయ్‌చేస్తూ కనిపించాడని ప్రచారం జరుగుతోంది. గిల్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన బీసీసీఐ అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నదని, అందులో భాగంగానే వరల్డ్ కప్ మధ్యలో నుంచి అతడిని ఇండియాకు పంపిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అసలు నిజంఇదే...
గిల్‌పై క్రమశిక్షణ చర్యల వార్తలను టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కొట్టిపడేశాడు. టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికాలో అడుగుపెట్టే సమయంలోనే నలుగురు రిజర్వ్‌డ్ ప్లేయర్స్‌లో ఇద్దరిని సూపర్ 8 రౌండ్‌కు ముందు ఇండియా పంపించాలని నిర్ణయించుకున్నాం. ఇద్దరిని మాత్రమే వెస్టిండీస్ తీసుకెళ్లాలని అనుకున్నాం. ఆ ప్లాన్‌లో భాగంగానే గిల్, ఆవేశ్‌ఖాన్ జట్టును వీడి ఇండియా వెళ్లనున్నట్లు విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు.
ఆఫ్ఘనిస్తాన్‌తో ఫస్ట్ మ్యాచ్
సూపర్ 8 రౌండ్ తొలి మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. జూన్ 20న ఈ మ్యాచ్ జరుగనుంది. జూన్ 24న ఆస్ట్రేలియాతో మరో మ్యాచ్ ఆడనుంది. మధ్యలో జూన్ 22న జరుగనున్న మ్యాచ్‌లో టీమిండియా ప్రత్యర్థి ఎవరన్నది నేడు తేలనుంది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా...
ఈ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్‌గా విఫలమైన బ్యాట్స్‌మెన్‌గా మాత్రం శుభ్‌మన్ రాణించాడు. 12 మ్యాచుల్లో 426 రన్స్ చేశాడు.