IND vs CAN T20 World Cup: భారత్, కెనడా మ్యాచ్ రద్దు.. టీమిండియా తర్వాతి మ్యాచ్ ఎప్పుడంటే..
IND vs CAN T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా ఆఖరి గ్రూప్ మ్యాచ్ రద్దయింది. కెనడాతో మ్యాచ్ క్యాన్సిల్ అయింది. ఇక తదుపరి సూపర్-8లో బరిలోకి దిగనుంది భారత్.
IND vs CAN T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో టీమిండియా ఆఖరి గ్రూప్ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దయింది. గ్రూప్-ఏలో భారత్, కెనడా మధ్య ఫ్లోరిడా వేదికగా నేడు (జూన్ 15) జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది. దీంతో గ్రూప్ దశలో టీమిండియా చివరి మ్యాచ్ క్యాన్సిల్ అయింది. గ్రూప్-ఏలో వరుసగా మూడు మ్యాచ్‍లు గెలిచిన భారత్.. ఇప్పటికే సూపర్-8కు చేరింది. గ్రూప్-ఏలో టాప్ ప్లేస్‍తో సూపర్-8కు దూసుకెళ్లింది.
వాన ఆగినా..
భారత్, కెనడా మ్యాచ్ జరగాల్సిన ఫ్లోరిడా స్టేడియం వద్ద నేడు కూడా వర్షం పడింది. అయితే, వాన ఆగినా ఔట్‍ఫీల్డ్ మాత్రం చిత్తడిగా మారింది. మైదానంలో చాలా చోట్ల నీరు నిలిచింది. నీటిని తొలగించేందుకు గ్రౌండ్ స్టాఫ్ చాలా సేపు శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆడేందుకు గ్రౌండ్ పరిస్థితి సరిగా లేదని నిర్ణయించిన అంపైర్లు ఈ మ్యాచ్‍ను రద్దు చేసేశారు.
ఫ్లోరిడా వేదికగానే అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ శుక్రవారం రద్దయింది. ఆ తర్వాత కూడా వాన పడింది. నేడు అదే స్టేడియంలో జరగాల్సిన భారత్, కెనడా మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయింది.
గ్రూప్-ఏ ఇలా..
టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో టాప్-2లో నిలిచిన భారత్, అమెరికా సూపర్-8 దశకు చేరుకున్నాయి. మిగిలిన మూడు జట్లు ఔటయ్యాయి. ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాపై భారత్ గెలువగా.. కెనడాతో మ్యాచ్ రద్దయింది. దీంతో ఏడు పాయింట్లతో గ్రూప్-ఏలో టాప్ ప్లేస్ దక్కించుకుంది టీమిండియా. అమెరికా మూడు మ్యాచ్‍ల్లో రెండు గెలువగా.. ఓ మ్యాచ్ రద్దయింది. దీంతో ఐదు పాయింట్లతో రెండో స్థానాన్ని ఖరారు చేసుకొని ఆ జట్టు కూడా సూపర్-8కు దూసుకెళ్లింది. ప్రపంచకప్ తొలిసారి ఆడుతున్న ఆ జట్టు పాకిస్థాన్‍ను ఓడించటంతో పాటు సూపర్-8 చేరి అద్బుతం చేసింది.
కెనడా మూడు మ్యాచ్‍ల్లో రెండు ఓడి.. ఒకటి గెలిచింది. భారత్‍తో మ్యాచ్ రద్దయింది. దీంతో కెనడా మూడు పాయింట్లతో మూడో ప్లేస్‍లో నిలిచినా.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్‍కు మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నా ఇప్పటికే టోర్నీ నుంచి ఔట్ అయింది. మూడు మ్యాచ్‍ల్లో ఇప్పటి వరకు ఒకటే గెలిచి.. నాలుగో ప్లేస్‍లో పాకిస్థాన్ ఉంది. ఐర్లాండ్ చివరి ప్లేస్‍లో ఉంది. గ్రూప్-ఏలో చివరి మ్యాచ్ పాకిస్థాన్, ఐర్లాండ్ మధ్య జూన్ 16న ఫ్లోరిడాలోనే జరగనుంది. ఈ మ్యాచ్‍లో ఏ జట్టు గెలిచినా.. రెండు టీమ్‍లు నిష్క్రమించనున్నాయి.
టీమిండియా తదుపరి మ్యాచ్‍లు
టీ20 ప్రపంచకప్‍లో తదుపరి సూపర్-8, సెమీఫైనల్స్, ఫైనల్స్ వెస్టిండీస్ వేదికగా జరగనున్నాయి. ప్రపంచకప్ గ్రూప్-1 సూపర్-8లో టీమిండియా జూన్ 20వ తేదీన అఫ్గానిస్థాన్‍తో తలపడనుంది. జూన్ 22వ తేదీన తదుపరి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-డీలో రెండో స్థానంలో నిలిచే జట్టుతో ఆ మ్యాచ్‍లో తలపడనుంది. ఇక, సూపర్-8లో జూన్ 24వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది.
సూపర్-8లో 8 జట్లు రెండు గ్రూప్‍లుగా ఆడతాయి. రెండు గ్రూప్‍ల్లో టాప్-2లో నిలిచే నాలుగు జట్లు సెమీఫైనళ్లలో తలపడతాయి. సూపర్-8లో ప్రతీ టీమ్ మూడు మ్యాచ్‍లు ఆడుతుంది.