India vs USA T20 World Cup: తుదిజట్టులో టీమిండియా ఆ ఒక్క మార్పు చేస్తుందా? వర్షం ఆటంకం కలిగిస్తుందా?
IND vs USA T20 World Cup 2024: ప్రపంచకప్‍లో జోష్ మీద ఉన్న భారత్.. అమెరికాతో పోరుకు రెడీ అయింది. అమెరికాతో మ్యాచ్‍లో తుదిజట్టులో టీమిండియా ఓ మార్పు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
IND vs USA T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో భారత్ దుమ్మురేపుతోంది. తొలి రెండు మ్యాచ్‍ల్లో విజయం సాధించి ఫుల్ జోష్‍లో ఉంది. తొలి మ్యాచ్‍లో ఐర్లాండ్‍ను అలవోకగా ఓడించిన భారత్.. పాకిస్థాన్‍పై ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ఇప్పుడు ఆతిథ్య అమెరికాతో పోరుకు రోహిత్ శర్మ సేన సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా ప్రపంచకప్ గ్రూప్-ఏలో రేపు (జూన్ 12) భారత్, అమెరికా తలపడనున్నాయి. అమెరికా కూడా పాకిస్థాన్‍కు షాకిచ్చి ఫామ్‍లో ఉంది. ఈ మ్యాచ్‍లో భారత్ గెలిస్తే సూపర్-8లో అడుగుపెట్టేస్తుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం భారత్ తుదిజట్టులో ఓ మార్పు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
దూబేను పక్కన పెడుతుందా?
ఎన్నో అంచనాలు పెటుకున్న భారత యంగ్ ఆల్‍రౌండర్ శివమ్ దూబే.. ఈ ప్రపంచకప్‍లో రెండు మ్యాచ్‍ల్లో విఫలమయ్యాడు. కీలక సమయాల్లో ఔటయ్యాడు. పాకిస్థాన్‍తో మ్యాచ్ 9 బంతుల్లో కేవలం 3 పరుగులే చేసి నిరాశ పరిచాడు. కీలకమైన టైమ్‍లో పెవిలియన్ చేరాడు. ఇబ్బందులు పడుతున్నట్టు కనిపించాడు. దీంతో, అమెరికాతో మ్యాచ్‍లో తుదిజట్టు నుంచి శివమ్ దూబేను తప్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శివమ్ దూబేను తప్పించి తుదిజట్టులోకి సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‍లో భారత్ ఒకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ బౌలింగ్‍ను పటిష్ఠంగా చేసుకోవాలనుకుంటే ఆ ఇద్దరినీ కాదని, తుదిజట్టులోకి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‍ను కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి, విఫలమవుతున్న దూబేను టీమిండియా మేనేజ్‍మెంట్ కొనసాగించి నమ్మకం చూపుతుందా లేకపోతే తుదిజట్టు నుంచి తప్పిందా అనేది చూడాలి.
అమెరికాతో మ్యాచ్‍లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ యశస్వి జైస్వాల్‍ను తుదిజట్టులోకి తీసుకుంటే కోహ్లీ మూడో స్థానంలో రావాల్సి వస్తుంది. అయితే, రెండు మ్యాచ్‍ల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‍కు వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. కఠినమైన న్యూయార్క్ పిచ్‍పై ఐర్లాండ్, పాకిస్థాన్‍పై మ్యాచ్‍ల్లో సూపర్ బ్యాటింగ్ చేశాడు. పాక్‍పై భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు పంత్. యశస్విని తీసుకొని బ్యాటింగ్ ఆర్డర్లో ఇంత స్థాయిలో మార్పులు చేసేందుకు మేనేజ్‍మెంట్ సిద్ధంగా ఉందా అనేదే ఉత్కంఠగా ఉంది. ఒకవేళ శాంసన్, కుల్దీప్‍ల్లో ఒకరిని తీసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మార్పులు చేయాల్సి ఉండదు. మరి మేనేజ్‍మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
కాగా, అమెరికా కూడా మంచి ఫామ్‍లో ఉంది. తొలి మ్యాచ్‍లో కెనడాపై గెలిచింది. పాకిస్థాన్‍పై సంచలన విజయం సాధించింది. సూపర్ ఓవర్ వరకు వెళ్లి పాక్‍ను అమెరికా ఓడించింది. కాగా, అమెరికా జట్టులో చాలా మంది భారత సంతతికి చెందిన ఆటగాళ్లే ఉన్నారు.
అమెరికాతో మ్యాచ్‍కు భారత తుదిజట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే/సంజూ శాంసన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జస్‍ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్
అమెరికా తుదిజట్టు (అంచనా): మోనాక్ పటేల్ (కెప్టెన్, వికెట్ కీపర్), స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, కోరీ ఆండర్సన్, హర్మత్ సింగ్, నితీశ్ కుమార్, అలీ ఖాన్, జష్‍దీప్ సింగ్, సౌరభ్ నేత్రవల్కర్, నోస్తుశ్ కెంజిగె
వర్షం ముప్పు ఉందా..
భారత్, అమెరికా మ్యాచ్ జరిగే రేపు (జూన్ 12) న్యూయార్క్ స్టేడియం వద్ద వాన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మ్యాచ్‍కు వాన ఆటంకం కలిగించకపోవచ్చు. ఒకవేళ వాన పడినా అది స్వల్పంగానే ఉంటుందని వాతావరణ రిపోర్టులు చెబుతున్నాయి.
టైమ్, లైవ్ స్ట్రీమింగ్
భారత్, అమెరికా మధ్య న్యూయార్క్ వేదికగా రేపు (జూన్ 12) రాత్రి 8 గంటలకు (భారత కాలమానం) మ్యాచ్ మొదలవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లు, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో లైవ్ చూడొచ్చు.