Shubman Gill: టీమిండియాకు షాక్.. శుభ్‌మన్ గిల్‌కు డెంగ్యూ.. ఆస్ట్రేలియాతో ఆడేది డౌటే
Shubman Gill: టీమిండియాకు పెద్ద షాకే తగిలేలా ఉంది. స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ కు అతడు ఆడేది అనుమానంగా మారింది.
Shubman Gill: క్రికెట్ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ కు ముందే ఆతిథ్య ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ కు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. అతడు డెంగ్యూతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో తొలి రెండు వన్డేలు ఆడిన తర్వాత మూడో వన్డేకు అతనికి రెస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.
వరల్డ్ కప్ కు ముందు జరగాల్సిన రెండు వామప్ మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా రద్దవడంతో శుభ్‌మన్ గిల్ మళ్లీ ఫీల్డ్ లో కనిపించలేదు. ఈ ఏడాది టాప్ ఫామ్ లో ఉన్న గిల్.. వన్డేల్లో 1230 పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లోనూ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో గిల్ లేకపోవడం ఇండియాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మెడికల్ టీమ్ అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. శుక్రవారం (అక్టోబర్ 6) అతనికి మరోసారి టెస్టులు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ తర్వాతే అతనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదివారమే (అక్టోబర్ 8) ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ కావడంతో గిల్ ఆడకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
గిల్ ఆడకపోతే అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేయొచ్చు. ఇండియన్ టీమ్ బుధవారం (అక్టోబర్ 4) ఈ మ్యాచ్ జరిగే చెన్నైకి చేరుకుంది. గురువారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వామప్ మ్యాచ్ లు ఆడే అవకాశం రాకపోవడంతో ఆస్ట్రేలియాతో నేరుగా బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 గురువారం (అక్టోబర్ 5) ఎలాంటి హంగామా లేకుండా సింపుల్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఓపెనింగ్ సెర్మనీ కూడా నిర్వహించలేదు. దీంతో నరేంద్ర మోదీ స్టేడియం చాలా వరకూ ఖాళీగానే కనిపించింది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను న్యూజిలాండ్ 9 వికెట్లతో చిత్తు చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.