Yashasvi Jaiswal: సెంచరీతో శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal: సెంచరీతో శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్ చేశాడు యశస్వి జైస్వాల్. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు.
Yashasvi Jaiswal: ఏషియన్ గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్ చేశాడు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఈ మ్యాచ్ లో అతడు కేవలం 48 బంతుల్లోనే సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు ఇండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు.
ప్రస్తుతం యశస్వి జైస్వాల్ వయసు 19 ఏళ్ల 8 నెలల 13 రోజులు. గతంలో శుభ్‌మన్ గిల్ 23 ఏళ్ల 146 రోజుల వయసులో ఇండియా తరఫున టీ20 క్రికెట్ లో సెంచరీ చేశాడు. ఇప్పుడా రికార్డును యశస్వి బ్రేక్ చేశాడు. జైస్వాల్ తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్స్ లు బాదడం విశేషం. అయితే సెంచరీ చేసిన మరుసటి బంతికే అతడు ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ లో మొదటి నుంచీ యశస్వి నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీల వర్షం కురిపించాడు. అతడు కేవలం ఫోర్లు, సిక్స్ ల రూపంలోనే 74 పరుగులు చేయడం విశేషం. యశస్వి సెంచరీతోపాటు చివర్లో రింకు సింగ్ కేవలం 15 బంతుల్లో 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఇండియా ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 రన్స్ చేసింది.
203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ కూడా చివరి దాకా పోరాడింది. దీపేంద్ర సింగ్ ఐరీ, సందీజ్ జోరాలాంటి బ్యాటర్లు వరుస సిక్స్ లతో భయపెట్టారు. అయితే కీలకమైన సమయంలో వీళ్ల వికెట్లు తీసిన ఇండియా.. చివరికి 23 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఇండియా తరఫున రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ చెరో 3 వికెట్లతో రాణించారు.
ఇండియా తరఫున యశస్వి జైస్వాల్ అరంగేట్రం అదిరిపోయింది. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో తొలిసారి ఇండియా తరఫున ఆడిన యశస్వి.. తొలి టెస్టులోనే సెంచరీ చేశాడు. ఇప్పుడు ఇండియా తరఫున టీ20ల్లోనూ తొలి సెంచరీ అందుకున్నాడు.