IND vs AFG 2nd T20: అఫ్గాన్ బౌలర్లను చితకొట్టిన జైస్వాల్, దూబే.. అలవోకగా గెలిచిన భారత్.. సిరీస్ మనదే
IND vs AFG 2nd T20: అఫ్గానిస్థాన్ బౌలింగ్‍ను చితకబాది మెరుపు అర్ధశతకాలు చేశారు భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే. దీంతో రెండో టీ20లో అలకవోకగా గెలిచింది టీమిండియా. ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
IND vs AFG 2nd T20: భారత యువ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68 పరుగులు), శివమ్ దూబే (32 బంతుల్లో 63 పరుగులు; నాటౌట్) మెరుపు అర్ధ శతకాలతో దుమ్మురేపారు. యశస్వి 6 సిక్సర్లు, 5 ఫోర్లతో రెచ్చిపోగా.. శివమ్ దూబే 4 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టి సత్తాచాటాడు. ఇద్దరూ హిట్టింగ్‍తో వీరంగం చేసి అఫ్గానిస్థాన్ బౌలింగ్‍ను చితకబాదారు. దీంతో ఇండోర్ వేదికగా నేడు (జనవరి 14) జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‍పై గెలిచింది. మూడు టీ20ల సిరీస్‍లో 2-0తో ఆధిక్యం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ పక్కా చేసుకుంది. వివరాలివే..
అఫ్గాన్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని 26 బంతులు మిగిల్చి మరీ సునాయాసంగా గెలిచింది భారత్. 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి విజయం సాధించింది. యశస్వి జైస్వాల్, శివమ్ దూబే అర్ధ శతకాలతో అదరగొట్టారు. వరుసగా రెండో మ్యాచ్‍లో అజేయ హాఫ్ సెంచరీ చేసి సత్తాచాటాడు దూబే. భారత్ జట్టు తరఫున సుమారు 14 నెలల తర్వాత టీ20లో బరిలోకి దిగిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చూడచక్కని షాట్లు ఆడాడు. 16 బంతుల్లోనే 29 పరుగులతో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయి వరుసగా రెండో మ్యాచ్‍లో నిరాశపరిచాడు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో కరీమ్ జన్నత్ రెండు, నవీనుల్ హక్, ఫజల్‍హక్ ఫరూకీ చెరో వికెట్ తీశారు. ముజీబుర్ రహ్మాన్, నవీనుల్ హక్, నూర్ అహ్మద్, మహమ్మద్ నబీ బౌలింగ్‍లో ధారాళంగా పరుగులు చేశారు భారత బ్యాటర్లు.
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. గుల్బాదిన్ నైబ్ (35 బంతుల్లో 57 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. భారత బౌలర్లలో అర్షదీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ కేవలం 17 పరుగులే ఇచ్చి రెండు వికెట్లతో రాణించాడు. రవి బిష్ణోయ్ రెండు, శివమ్ దూబే ఓ వికెట్ తీశారు.
అయ్యో రోహిత్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‍లో వరుసగా రెండో మ్యాచ్‍లో డకౌట్ అయ్యాడు. తొలి మ్యాచ్‍లో రనౌట్ అయిన రోహిత్.. ఈ రెండో టీ20లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. ఫజల్‍హక్ ఫరూకీ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి భారీ షాట్ కొట్టేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‍కు మిస్ అయింది. దీంతో రోహిత్ బౌల్డ్ అయ్యాడు. దీంతో నిరాశగా పెవిలియన్ చేరాడు రోహిత్.
యశస్వి, దూబే ధనాధన్
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ.. చాలా గ్యాప్ తర్వాత టీమిండియా తరఫున టీ20 ఆడాడు. అయితే, ఈ మ్యాచ్‍లో ఆరంభం నుంచే దూకుడు చూపాడు కోహ్లీ. 16 బంతుల్లో 5 ఫోర్లతో 29 రన్స్ చేశాడు. అయితే, ఆరో ఓవర్లో ఔటయ్యాడు. మరో ఎండ్‍లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దుమ్మురేపాడు. వీర హిట్టింగ్ చేశాడు. అతడికి శివమ్ దూబే జత కలిశాక పరుగుల వరద పారింది.
యశస్వి, శివమ్ దూబే బౌండరీలు, సిక్సర్లతో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో 9.2 ఓవర్లలోనే భారత్ స్కోరు 100 పరుగులు దాటేసింది. ఈ క్రమంలో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వి. అయితే, 13వ ఓవర్లో అతడు ఔటయ్యాడు. దూబే మాత్రం దంచుడు కొనసాగించాడు. నబీ వేసిన ఓకే ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దూబే 22 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు. చివరి వరకు అజేయంగా నిలిచి భారత్‍ను గెలుపు తీరాన్ని దాటించాడు. జితేశ్ శర్మ (0) డకౌట్ అయ్యాడు.
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడో టీ20 బుధవారం (జనవరి 17) జరగనుంది.