IND vs AFG 2nd T20: టీమిండియాకు దీటైన టార్గెట్ ఇచ్చిన అఫ్గాన్.. గుల్బాదిన్ సూపర్ హాఫ్ సెంచరీ-ind vs afg 2nd t20 gulbadin naib hit half century afghanistan sets good target to team india ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Afg 2nd T20: టీమిండియాకు దీటైన టార్గెట్ ఇచ్చిన అఫ్గాన్.. గుల్బాదిన్ సూపర్ హాఫ్ సెంచరీ

IND vs AFG 2nd T20: టీమిండియాకు దీటైన టార్గెట్ ఇచ్చిన అఫ్గాన్.. గుల్బాదిన్ సూపర్ హాఫ్ సెంచరీ

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 14, 2024 09:17 PM IST

IND vs AFG 2nd T20: రెండో టీ20లో భారత్‍కు దీటైన టార్గెట్ ఇచ్చింది అఫ్గానిస్థాన్. గుల్బాదిన్ నైబ్ అర్ధ శతకంతో దుమ్మురేపగా.. అఫ్గాన్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చివర్లో మెరిపించారు.

IND vs AFG 2nd T20: టీమిండియాకు దీటైన టార్గెట్ ఇచ్చిన అఫ్గాన్
IND vs AFG 2nd T20: టీమిండియాకు దీటైన టార్గెట్ ఇచ్చిన అఫ్గాన్ (AFP)

IND vs AFG 2nd T20: భారత్‍తో రెండో టీ20లో అఫ్గానిస్థాన్ టాపార్డర్ బ్యాటర్ గుల్బాదిన్ నైబ్ (35 బంతుల్లో 57 పరుగులు) దూకుడైన అర్ధ శతకంతో అదరగొట్టాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా కాసేపు మెరిపించారు. దీంతో టీమిండియాకు అఫ్గాన్ దీటైన టార్గెట్ నిర్దేశించింది. ఇండోర్ వేదికగా నేడు (జనవరి 12) జరుగున్న రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. చివరి బంతికి ఆలౌటైంది.

గుల్బాదిన్ హాఫ్ సెంచరీతో మెరవగా.. చివర్లో కరీమ్ జన్నత్ (10 బంతుల్లో 20 పరుగులు), ముజీబుర్ రహమాన్ (9 బంతుల్లో 21 పరుగులు) మెరిపించారు. దీంతో అఫ్గానిస్థాన్ మంచి స్కోరు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లతో రాణించాడు. చివరి ఓవర్లో కట్టడి చేశాడు. 4 ఓవర్లు వేసిన టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి 17 పరుగులే ఇచ్చి అదరగొట్టాడు. రవి బిష్ణోయ్ రెండు, శివమ్ దూబే ఓ వికెట్ తీశారు. టీమిండియా ముందు 173 పరుగుల టార్గెట్ ఉంది.

అదరగొట్టిన గుల్బాదిన్

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది అఫ్గానిస్థాన్. రహ్మతుల్లా గుర్బాజ్ (14), ఇబ్రహీం జర్దాన్ (8) త్వరగానే ఔటయ్యాడు. దూకుడుగా ఆడన గుర్బాజ్‍ను మూడో ఓవర్లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ పెవిలియన్‍కు పంపాడు. ఆరో ఓవర్లో అక్షర్ పటేల్ సూపర్ బాల్‍తో ఇబ్రహీం జర్దాన్‍ను బౌల్డ్ చేశాడు. అయితే, మరో ఎండ్‍లో గుల్బాదిన్ నైబ్ దీటుగా ఆడాడు. వికెట్లు పడుతున్నా దూకుడు కొనసాగించాడు. అజ్ముల్లా ఒమర్‌జాయ్ (2)ను దూబే ఔట్ చేశాడు. దీంతో 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది అఫ్గాన్.

అయితే, గుల్బాదిన్ నైబ్ హిట్టింగ్ చేశాడు. ఈ క్రమంలో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. దూకుడు మీద ఉన్న అతడిని 12వ ఓవర్లో ఔట్ చేసి టర్న్ తిప్పాడు భారత స్పిన్నర్ అక్షర్ పటేల్. మహమ్మద్ నబీ (14), నజీబుల్లా జర్దాన్ (21) నిదానంగా ఆడి ఔటవటంతో అఫ్గాన్ తక్కువ స్కోరే చేస్తుందని అనుకున్నారు. అయితే, చివర్లో కరీమ్ జన్నత్ మెరిపించాడు. 10 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 20 రన్స్ చేశాడు. ముజీబుర్ రహమాన్ కూడా 9 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది అదరగొట్టాడు. చివరి బంతికి రనౌట్ అయ్యాడు. భారత పేసర్ అర్షదీప్ సింగ్ చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసి కట్టడి చేశాడు.

ఈ రెండో టీ20లో భారత్ ముందు 173 పరుగుల టార్గెట్ ఉంది. ఈ మూడు టీ20ల సిరీస్‍లో ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది భారత్. ఇది కూడా గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను పక్కా చేసుకుంది. ఇండోర్ పిచ్ బ్యాటింగ్‍కు అనుకూలంగా ఉండడం, బౌండరీలు కూడా దగ్గరగానే ఉండడం లక్ష్యఛేదనలో టీమిండియాకు కలిసి వచ్చే అవకాశాలు. మరోవైపు సుమారు 14 నెలల తర్వాత భారత్ తరఫున టీ20లో బరికి దిగుతున్నాడు భారత స్టార్ విరాట్ కోహ్లీ. దీంతో అతడి అందరి దృష్టి ఉంది.

Whats_app_banner