Shahid Afridi on Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమిపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఇండియన్ టీమ్ ఓడిపోయిందని అతడు అనడం గమనార్హం. లీగ్ స్టేజ్ లో వరుసగా పది మ్యాచ్ లు గెలిచామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఫైనల్లో ఓడారని అతడు అన్నాడు.
పాకిస్థాన్ టీవీ ఛానెల్ సమా టీవీలో అఫ్రిది మాట్లాడాడు. ఫైనల్ సందర్భంగా ఇండియా ఇన్నింగ్స్ సమయంలోనే అతడు ఈ టీవీ లైవ్ షోలో మాట్లాడాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 240 రన్స్ కే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్ లో శ్రేయస్ అయ్యర్ ఔటైన తర్వాత అఫ్రిది ఈ షోలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు.
"వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ వెళ్లినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోతుంది. అదే మిమ్మల్ని ఓడిస్తుంది" అని అఫ్రిది అనడం విశేషం. ఇక ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అదే ఛానెల్లో అఫ్రిది మాట్లాడాడు. ఈసారి భారత అభిమానులపై అతడు మండిపడ్డాడు. ట్రావిస్ హెడ్ వీరోచిత సెంచరీ చేసినా అతన్ని ప్రేక్షకులు అభినందించకపోవడాన్ని అతడు ప్రశ్నించాడు.
"కెరీర్లో ఎప్పుడో ఒకసారి ఇలాంటివి అనుభవించాం. మేము ఎప్పుడు ఓ బౌండరీ కొట్టినా, సెంచరీ చేసినా, వికెట్ తీసినా.. భారత అభిమానుల నుంచి అసలు స్పందనే ఉండదు. హెడ్ సెంచరీ చేసినప్పుడు కూడా ప్రేక్షకులు మౌనంగా ఉన్నారు. ఎందుకు? స్పోర్ట్స్ ను ఇష్టపడే దేశం.. బాగా ఆడే ఎవరినైనా అభినందిస్తుంది.
కానీ ఇండియన్ ఫ్యాన్స్ మాత్రం అలా చేయరు. బాగా చదువుకున్న ప్రేక్షకుల నుంచి ఇలాంటివి ఆశ్చర్యపరుస్తాయి. అది చాలా పెద్ద సెంచరీ. కొందరైనా అభినందించాల్సింది. టీమ్ కాన్ఫిడెన్స్ ఎలా తగ్గుతూ వచ్చిందో అలాగే అభిమానులు కూడా తగ్గుతూ వచ్చారు" అని అఫ్రిది అన్నాడు.
వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన విషయం తెలిసిందే. మిగతా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఇండియా టోర్నీలో ఆడిన తీరును మెచ్చుకుంటే అఫ్రిది మాత్రం ఇలా నోరు పారేసుకోవడం గమనార్హం.