Akhtar on Team India: పిచ్ విషయంలో ఇండియా భయపడింది.. అతని వల్లే ఓడిపోయింది: ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు-former pakistan cricketers akthar and shoaib malik reacted to india loss in world cup 2023 final ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Akhtar On Team India: పిచ్ విషయంలో ఇండియా భయపడింది.. అతని వల్లే ఓడిపోయింది: ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు

Akhtar on Team India: పిచ్ విషయంలో ఇండియా భయపడింది.. అతని వల్లే ఓడిపోయింది: ఓటమిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు

Hari Prasad S HT Telugu
Nov 20, 2023 08:17 AM IST

Akhtar on Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమిపై పాక్ మాజీలు షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్ స్పందించారు. పిచ్ విషయంలో ఇండియా భయపడిందని అక్తర్ చెప్పగా.. రాహుల్ వల్లే ఓడిపోయిందని మాలిక్ అన్నాడు.

టీమిండియా ఓటమిపై పాకిస్థాన్ మాజీల స్పందన
టీమిండియా ఓటమిపై పాకిస్థాన్ మాజీల స్పందన (AFP)

Akhtar on Team India: వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణాలు వెతికే పనిలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాజీ క్రికెటర్లు. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్ ఈ ఓటమిపై స్పందించారు. పిచ్ విషయంలో హిందుస్థాన్ కాస్త పిరికిగా వ్యవహరించిందని అక్తర్ అనడం విశేషం. రాహుల్ కాస్త వేగంగా ఆడి ఉండాల్సిందని మరో మాజీ షోయబ్ మాలిక్ అన్నాడు.

పిచ్ విషయంలో అలా చేయాల్సింది కాదు: అక్తర్

వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత టీమిండియా ఓటమిపై స్పందిస్తూ షోయబ్ అక్తర్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఇండియా పిచ్ విషయంలో కాస్త పిరికిగా వ్యవహరించిందని అన్నాడు. "ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. వాళ్లు ఇంతవరకు కూడా ఏదో అదృష్టంతో రాలేదు. ఆడి వచ్చారు. పోరాడి వచ్చారు. పది మ్యాచ్ లలో పోరాడి గెలిచారు. కానీ ఫైనల్ కోసం తయారు చేసిన వికెట్ మాత్రం నాకు నచ్చలేదు. పిచ్ విషయంలో కాస్త పిరికిగా వ్యవహరించారు. మీ దగ్గర ఎర్ర మట్టి ఉంది. దాంతో కాస్త పేస్, బౌన్స్ వికెట్ చేయాల్సింది" అని అక్తర్ అన్నాడు.

ప్రతిసారీ వరల్డ్ కప్ అందుకునే వరకూ వచ్చి ట్రోఫీ గెలవలేకపోతున్నారని అక్తర్ చెప్పాడు. హిందుస్థాన్ చాలా మంది టీమ్ అని, అద్భుతంగా ఆడిందని, హ్యాట్సాఫ్ ఇండియా అని అక్తర్ అనడం విశేషం. ఇండియాలాంటి టీమ్ ను ఆపగలిగే శక్తి ఒక్క ఆస్ట్రేలియాకే ఉందని, అదే పని చేసి చూపిందని అన్నాడు. ఆస్ట్రేలియా ఆడే తీరే వాళ్లను ఇన్ని ట్రోఫీలు గెలిచేలా చేసిందని కూడా అక్తర్ చెప్పాడు.

రాహుల్ ఎదురు దాడి చేయాల్సింది: షోయబ్ మాలిక్

ఇక ఈ ఫైనల్లో ఇండియా ఓటమికి కారణాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశాడు మరో మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్. కేఎల్ రాహుల్ ఆడిన తీరును అతడు తప్పుబట్టాడు. రాహుల్ తనదైన స్టైల్లో ఆడుతూ ఎదురు దాడి చేయాల్సిందని చెప్పాడు. "కేఎల్ రాహుల్ 50 ఓవర్ల పాటు ఆడాలనే చూశాడు. అతడు అలా చేయాల్సింది కాదు. తనదైన ఆట ఆడటానికి ప్రయత్నించాల్సింది. కఠినమైన పరిస్థితుల్లో ఆడుతున్నారు. బౌండరీలు రావడం లేదు. అలాంటప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయాలి. అదే జరగలేదు. చాలా డాట్ బాల్స్ ఉన్నాయి" అని మ్యాచ్ తర్వాత ఎ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ మాలిక్ అన్నాడు.

ఆస్ట్రేలియా బౌలర్లకు కూడా క్రెడిట్ ఇచ్చాడు. "ఈ మ్యాచ్ జరిగిన స్టేడియంలో సైడ్ బౌండరీలు పెద్దగా ఉన్నాయి. ఈ బౌండరీలను ఆస్ట్రేలియన్లు బాగా ఉపయోగించుకున్నారు. నేరుగా షాట్లు ఆడనీయం. వికెట్ కు స్క్వేర్ గా ఆడేలా చేస్తామని అన్నారు. వాళ్ల బౌలర్లు వేరియేషన్లు బాగా ఉపయోగించారు. ఇండియన్ కండిషన్స్ ను వాళ్ల కంటే ఆస్ట్రేలియన్లు బాగా అంచనా వేశారు" అని మాలిక్ అన్నాడు.

Whats_app_banner