Shoaib Akhtar on Team India: క్రెడిట్ అంతా రోహిత్ శర్మదే.. ఫైనల్ చేరే అర్హత ఇండియాకు ఉంది: షోయబ్ అక్తర్
Shoaib Akhtar on Team India: వరల్డ్ కప్ 2023 ఫైనల్ చేరడానికి ఇండియాకు పూర్తి అర్హత ఉందని, సెమీ ఫైనల్లో విజయం క్రెడిట్ అంతా రోహిత్ శర్మదే అని పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు.
Shoaib Akhtar on Team India: వరల్డ్ కప్ 2023లో వరుసగా పదో విజయం సాధించిన టీమిండియాపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్. ఫైనల్ చేరడానికి ఇండియాకు పూర్తి అర్హత ఉందని, ఈ క్రెడిట్ అంతా రోహిత్ శర్మదే అని అక్తర్ అన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ఇండియా 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.
ఇండియా కాకపోతే మరే టీమ్ ఫైనల్ వెళ్తుంది?: అక్తర్
మరోసారి పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ సెమీఫైనల్లో విజయం సాధించిన ఇండియన్ టీమ్ ను ఆకాశానికెత్తాడు షోయబ్ అక్తర్. మ్యాచ్ తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
"ఇండియా మరోసారి న్యూజిలాండ్ ను నిర్దాక్షిణ్యంగా ఓడించింది. ఇండియాకు ఫైనల్ చేరడానికి పూర్తి అర్హత ఉంది. ఆ టీమ్ కాకపోతే మరే టీమ్ ఫైనల్ వెళ్తుంది? క్రెడిట్ అంతా రోహిత్ శర్మకే దక్కుతుంది. కెప్టెన్ గా, ప్లేయర్ గా, బ్యాట్స్‌మన్ గా క్రెడిట్ మొత్తం రోహిత్ కే వెళ్తుంది.
మొదట్లోనే అతడు బౌలర్లపై విరుచుకుపడి వాళ్లను కొట్టి కొట్టి గాలి తీసేస్తాడు. మీకు బౌల్ట్ తో ప్రాబ్లం అయితే అతని బౌలింగ్ లోనూ కొడతాను. సాంట్నర్ తో సమస్య అయితే అతన్నీ బాదుతాను అన్నట్లు ఆడాడు. అతడు కావాలనుకుంటే ఈ వరల్డ్ కప్ లో మూడు, నాలుగు సెంచరీలు సులువుగా చేసేవాడు. చేస్తాడు కూడా.
శుభ్‌మన్ గిల్ కూడా అంతే. డెంగ్యూ నుంచి కోలుకొని వచ్చాడు. కాలి తిమ్మిర్లు లేకపోతే అతడూ సెంచరీ చేసేవాడు. ఇక అందరి కంటే ముఖ్యంగా విరాట్ కోహ్లిని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. అతడు సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేశాడు. సచిన్ ముందే అతని రికార్డు బ్రేక్ చేయడం చాలా గొప్ప విషయం" అని అక్తర్ అన్నాడు.
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా ఆడుతున్న తీరుపై మొదటి నుంచీ అక్తర్ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా బుమ్రా, కోహ్లి, షమి, సిరాజ్ లాంటి ప్లేయర్స్ అద్భుతంగా ఆడుతున్నారని అతడు అన్నాడు.