Rohit Sharma Record: ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ.. గేల్‍ రికార్డును బద్దలుకొట్టి..-rohit sharma becomes first player to hit 50 sixes in odi world cup history at india vs new zealand world cup 2023 semis ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma Record: ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ.. గేల్‍ రికార్డును బద్దలుకొట్టి..

Rohit Sharma Record: ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ.. గేల్‍ రికార్డును బద్దలుకొట్టి..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 15, 2023 03:22 PM IST

Rohit Sharma Record: సెమీఫైనల్‍లో తన మార్క్ హిట్టింగ్‍తో సత్తాచాటిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. క్రిస్ గేల్‍ను దాటేశాడు. ఆ వివరాలివే..

రోహిత్ శర్మ
రోహిత్ శర్మ (AFP)

Rohit Sharma Record: భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి దుమ్మురేపాడు. తన మార్క్ హిట్టింగ్‍తో టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. వన్డే ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్‍లో నేడు (నవంబర్ 15) న్యూజిలాండ్‍తో భారత్ తలపడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సత్తాచాటాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదిన రోహిత్ 47 పరుగులు చేశాడు. భారత్‍కు మంచి ఆరంభాన్ని అందించి 9వ ఓవర్లో ఔటయ్యాడు. అయితే, ఈ క్రమంలో రోహిత్ శర్మ ఓ అద్భతమైన రికార్డును సాధించాడు.

ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‍గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (49 సిక్సర్లు) రికార్డును హిట్‍మ్యాన్ బద్దలుకొట్టాడు. ప్రపంచకప్‍ చరిత్రలో అత్యధిక సిక్సర్ల వీరుడిగా రోహిత్ నిలిచాడు. క్రిస్ గేల్ 34 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌ల్లో 49 సిక్సర్లు కొడితే.. రోహిత్ మాత్రం కేవలం 27 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌ల్లోనే 51 సిక్సర్లు బాదేశాడు. తన పేరిట అరుదైన రికార్డును లిఖించుకున్నాడు.

మరో రికార్డు కూడా..

ఒక వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును కూడా రోహిత్ శర్మ సాధించాడు. న్యూజిలాండ్‍తో ప్రస్తుత ప్రపంచకప్ సెమీస్‍లో ఈ చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు 28 సిక్సర్లు బాదాడు హిట్‍మ్యాన్. 2015 ప్రపంచకప్‍లో గ్రిస్ గేల్ 26 సిక్సర్లు కొట్టాడు. అతడిని ఇప్పుడు రోహిత్ శర్మ అధిగమించాడు.

అలాగే, ప్రపంచకప్ టోర్నీల్లో 1,500 పరుగులను కూడా ఈ మ్యాచ్‍తో రోహిత్ శర్మ పూర్తి చేసుకున్నాడు.

న్యూజిలాండ్‍తో ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‍లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. కీలకంగా ఉన్న టాస్ గెలువడం భారత్‍కు సానుకూలంగా మారింది.