IND vs NZ Semi Final Toss: సెమీస్ సమరం షురూ: టాస్ గెలిచిన భారత్.. మార్పుల్లేకుండా ఇరు జట్లు
India vs New Zealand World Cup 2023 Semi final: భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్ ఫైట్ మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. తుది జట్లు ఎలా ఉన్నాయంటే..
India vs New Zealand World Cup 2023 Semi final: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో సెమీస్ సమరం ఆరంభమైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు (నవంబర్ 15) తొలి సెమీఫైనల్ షురూ అయింది. ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ సెమీస్ మ్యాచ్‍లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు.
తుది జట్టులో భారత్ మార్పులు చేయలేదు. నెదర్లాండ్స్‌తో ఆడిన టీమ్‍నే ఈ సెమీస్ పోరుకు కూడా కొనసాగించింది. విన్నింగ్ కాంబినేషన్‍నే కంటిన్యూ చేసింది. న్యూజిలాండ్ కూడా తుది జట్టులో మార్పులు చేయలేదు. గత మ్యాచ్ జట్టునే కొనసాగించింది.
“మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. పిచ్ బాగా కనిపిస్తోంది. కాస్త స్లోగా ఉండేలా ఉంది. ఏం చేసినా.. మేం బాగా రాణించాలి. 2019 సెమీస్‍లోనూ మేం తలపడ్డాం. న్యూజిలాండ్ నిలకడగా రాణిస్తున్న జట్టు. ఇది మాకు చాలా ముఖ్యమైన రోజు” అని టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
“ముందుగా బౌలింగ్ బాగా చేయాలని అనుకుంటున్నాం. ఆ తర్వాత మంచు ఉండే ఛాన్స్ ఉంది. నాలుగేళ్ల క్రితం ఇదే పరిస్థితి.. అయితే, ఇది విభిన్నమైన లోకేషన్. ఇండియా అద్భుతమైన ఆట ఆడుతోంది. మేం గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం” అని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమన్స్ అన్నాడు.
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‍లో టీమిండియా, న్యూజిలాండ్ వరుసగా రెండోసారి తలపడుతున్నాయి. నాలుగేళ్ల క్రితం 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‍లోనూ ఇరు జట్లు పోటీ పడ్డాయి. అయితే, అప్పుడు కివీస్ గెలువగా.. భారత్‍కు నిరాశ ఎదురైంది. దీంతో ఇప్పుడు న్యూజిలాండ్‍ను చిత్తు చేసి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో టీమిండియా ఉంది. ప్రపంచకప్ ఫైనల్‍కు చేరుకోవాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ దశలో 9 మ్యాచ్‍ల్లో 9 గెలిచి అజేయ జోరుతో సెమీస్‍లోకి భారత్ అడుగుపెట్టింది. సెమీస్‍లోనూ ఆ హోరును కొనసాగించి గెలవాలని ప్రణాళికలు రచించుకుంది.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‍మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, కుల్‍దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్
న్యూజిలాండ్ తుది జట్టు: డెవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాంప్‍మన్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, లూకీ ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్