Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ కోసం బ్లాంక్ చెక్‍లను తిరస్కరించిన రాహుల్ ద్రవిడ్.. కారణమిదే!
Rahul Dravid - Rajasthan Royals: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్ కోచ్‍గా వ్యవహరించున్నారు దిగ్గజం రాహుల్ ద్రవిడ్. ఈ విషయంపై ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, రాజస్థాన్ జట్టు కోసం ఇతర ఫ్రాంచైజీల నుంచి వచ్చిన భారీ ఆఫర్లను కూడా ద్రవిడ్ వదులుకున్నారనే సమాచారం బయటికి వచ్చింది.
భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మూడు నెలల కిందటే టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. ద్రవిడ్ మార్గదర్శకత్వంలో ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది భారత జట్టు. ఐసీసీ ట్రోఫీతో హెడ్ కోచ్ బాధ్యతలకు గుడ్‍బై చెప్పారు ద్రవిడ్. అయితే, ఐపీఎల్ 2025 సీజన్‍కు గాను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్‍కోచ్‍గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. గతంలో తాను కెప్టెన్‍గా, మెంటార్‌గా చేసిన రాయల్స్ జట్టుకు ఇప్పుడు హెడ్‍కోచ్‍గా ఉండనున్నారు.
భారీ ఆఫర్లను వద్దనుకొని..
ఐపీఎల్ 2025 సీజన్‍లో తమ జట్టుకు హెడ్‍కోచ్‍గా ఉండాలని కొన్ని ఫ్రాంచైజీలు రాహుల్ ద్రవిడ్‍కు భారీ ఆఫర్లను ఇచ్చాయని క్రిక్‍బజ్ రిపోర్ట్ వెల్లడించింది. ఎంత మొత్తమైనా తీసుకోండనేలా బ్లాంక్ చెక్‍లు ఇచ్చినా ద్రవిడ్ తిరస్కరించారని పేర్కొంది. “ప్రముఖ ఫ్రాంచైజీలు ఇచ్చిన ఆఫర్లను ద్రవిడ్ వద్దన్నారు. బ్లాంక్ చెక్‍లను ఇచ్చేందుకు రెడీ అయినా ఆయన తిరస్కరించారు” అని ఆ రిపోర్ట్ వెల్లడించింది.
కారణమిదే..
ఐపీఎల్‍లో 2008 నుంచి 2010 వరకు మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున రాహుల్ ద్రవిడ్ మార్క్యూ ప్లేయర్‌గా ఆడారు. కెప్టెన్సీ కూడా చేశారు. మూడేళ్లు బ్యాటింగ్‍లో రాణించారు ద్రవిడ్. అయితే, 2011 సీజన్ కోసం జరిగిన వేలంలో ద్రవిడ్‍ను ఆర్సీబీ తీసుకోలేదు. వేలంలో ముందుగా ఏ ఫ్రాంచైజీ కూడా బిడ్ చేయకపోవటంతో ద్రవిడ్ అన్‍సోల్డ్ అయ్యారు. అయితే, వేలం చివర్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు.. రాహుల్ ద్రవిడ్‍ను తీసుకుంది. ఈ తర్వాత మూడు సీజన్లలో ఆ జట్టుకు ద్రవిడ్ కెప్టెన్సీ కూడా చేశారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ టీమ్‍తో ద్రవిడ్‍కు మంచి బంధం ఏర్పడింది.
ఆటగాడిగా రిటైర్ అయ్యాక కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుతోనే రాహుల్ ద్రవిడ్ కొనసాగారు. 2014, 2015 సీజన్లలో ఆ టీమ్‍కు మెంటార్‌గా చేశారు. దీంతో ఆ మేనేజ్‍మెంట్‍తో బాండ్ పెరిగింది. ఈ కారణంగానే ఇప్పుడు ఇతర ఫ్రాంచైజీలు హెడ్‍కోచ్‍గా ఉండాలంటూ భారీ ఆఫర్లు ఇచ్చినా.. రాజస్థాన్ రాయల్స్ టీమ్‍కు వెళ్లేందుకే ద్రవిడ్ మొగ్గుచూపారని తెలుస్తోంది.
భారత అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ అవడంతో 2014 తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడారు రాహుల్ ద్రవిడ్. ఎంతో మంది భారత యువ ఆటగాళ్లను ద్రవిడ్ తీర్చిదిద్దారు. యువ జట్టుకు కోచ్‍గా చాలా సక్సెస్ అయ్యారు. టీమిండియా భవిష్యత్తు మెరుగ్గా ఉండేలా చాలా మంది యంగ్ ప్లేయర్లను ద్రవిడ్ తీర్చిద్దిద్దారు. అలాగే, ఇండియా-ఏ టీమ్‍కు కూడా కోచ్‍గా వ్యవహరించారు.
2021 నుంచి ఈ ఏడాది 2024 జూన్ వరకు టీమిండియా హెడ్ కోచ్‍గా వ్యవహించారు. ఆయన సారథ్యంలో చాలా సిరీస్‍ల్లో భారత్ విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్‍లో ఫైనల్ వరకు చేరింది. ఈ ఏడాది జూన్‍లో టీ20 ప్రపంచకప్ టైటిల్‍తో ఆ పదవికి ద్రవిడ్ వీడ్కోలు పలికారు. ఆటగాడిగా సాధించలేకపోయిన ఐసీసీ ట్రోఫీని కోచ్‍గా అందుకున్నారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ అడిగినా హెడ్‍కోచ్‍గా కొనసాగేందుకు ఆయన నిరాకరించారు. ఇక ఐపీఎల్‍లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ హెడ్‍కోచ్‍గా ఉండనున్నారు రాహుల్ ద్రవిడ్.