Nitish Kumar Reddy: కోహ్లి నా పేరు గుర్తు పెట్టుకున్నాడు.. నాకదే చాలు: హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో నితీష్ రెడ్డి
Nitish Kumar Reddy: మన తెలుగు తేజం నితీష్ రెడ్డి ఐపీఎల్ 2024 ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడతడు హిందుస్థాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లి తనను గుర్తుపట్టడం, పేరు పెట్టి పిలవడం తాను ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు.
Nitish Kumar Reddy: నితీష్ రెడ్డి.. ఐపీఎల్ 2024కు ముందు అతని పేరు తెలిసిన వాళ్లు పెద్దగా ఉండరు. నిజానికి అంతకుముందు సీజన్లలోనూ అతడు ఆడినా.. పెద్దగా రాణించలేదు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ ఏడాది చెలరేగిపోయాడు. 303 రన్స్ చేయడంతోపాటు 3 వికెట్లు తీసుకున్నాడు.
ఈ సీజన్ తర్వాత తనను అందరూ గుర్తు పడుతున్నారని, కోహ్లి కూడా పేరు పెట్టి పిలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హిందుస్థాన్ టైమ్స్ తెలుగు ఇంటర్వ్యూలో చెప్పాడు.
నితీష్ రెడ్డి ఏమన్నాడంటే..
21 ఏళ్ల నితీష్ రెడ్డి ఐపీఎల్ ప్రదర్శన తర్వాత జింబాబ్వే పర్యటనకు కూడా ఎంపికైనా.. దురదృష్టవశాత్తూ గాయపడటంతో వెళ్లలేకపోయాడు. అయితే తాను చిన్నతనం నుంచి విరాట్ కోహ్లిని ఓ ఆదర్శప్రాయుడిగా భావిస్తూ ఎదిగానని చెప్పాడు. అలాంటి కోహ్లి ఐపీఎల్ 2024 సందర్భంగా సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ తర్వాత తనను పేరు పెట్టి పిలిచినట్లు నితీష్ తెలిపాడు.
"ఇప్పుడు ఎంతో మంది నన్ను గుర్తు పడుతున్నారు. నా ఆటలో ఎంతో పురోగతి రావడం ఆనందంగా ఉంది. నిజానికి టైటిల్ గెలిచి ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది. కానీ ఆట అంటే ఇదే కదా. ఒకప్పుడు నేను ఓ పర్ఫెక్ట్ ఆల్ రౌండర్ కాదు. కేవలం బ్యాట్స్‌మనే. విరాట్ భాయ్ ను చూస్తూ పెరిగాను. ఆల్ రౌండర్ గా ఎదగాలనుకున్న తర్వాత అసలుసిసలు ఆల్ రౌండర్లయిన బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యాల వైపు చూశాను" అని నితీష్ రెడ్డి చెప్పాడు.
కోహ్లి గుర్తు పట్టడం ఆశ్చర్యం కలిగించింది
ఇక విరాట్ కోహ్లి ఓ మ్యాచ్ సందర్భంగా తనను గుర్తు పట్టడం గురించి కూడా అతడు చెప్పాడు. "విరాట్ భాయ్ తో ఎక్కువగా మాట్లాడలేదు. ఐపీఎల్ తొలి ఏడాది అతనితో ఆడినప్పుడు బ్యాటింగ్ అవకాశం రాలేదు కానీ బౌలింగ్ చేశాను. ఈ ఏడాది నేను బాగా ఆడాను. ఆర్సీబీతో మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లి నా ఆట చూసి నేనో మంచి ప్లేయర్ అని గుర్తించాలని ఆశించాను.
కానీ ఆ మ్యాచ్ లో మేము 270 ప్లస్ స్కోరు చేసినా.. నాకు బ్యాటింగ్ అవకాశం రాలేదు. మ్యాచ్ తర్వాత రెండు టీమ్స్ ప్లేయర్స్ ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో కోహ్లి కూడా ఉన్నాడు. ఆ సమయంలో హాయ్ నితీష్.. ఎలా ఉన్నావ్ అని అడిగాడు. అతడు నా పేరు గుర్తు పెట్టుకుంటాడని అసలు ఊహించలేదు" అని నీతీష్ చెప్పాడు.
ఓ ఆల్ రౌండర్ కావడం అంత సులువు కాదని, ఎన్నో బాధ్యతలు ఉంటాయని, ఒత్తిడి దానికదే పెరిగిపోతుందని అన్నాడు. అంతేకాదు ఎన్నో త్యాగాలు కూడా చేయాల్సి వస్తుందని చెప్పాడు. ఇక సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నుంచి కూడా తాను ఎంతో నేర్చుకున్నానని, ఓ ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ కావడం వరల్డ్ కప్ గెలవడం అత్యంత అరుదుగా చూస్తుంటామని అన్నాడు. ఐపీఎల్ సక్సెస్ తర్వాత ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లోనూ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నితీష్ రెడ్డి రికార్డు క్రియేట్ చేశాడు.