New Zealand T20 World Cup Team: టీ20 వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్ చేసిన న్యూజిలాండ్.. విలియమ్సన్ కెప్టెన్సీలోనే..
New Zealand T20 World Cup Team: టీ20 వరల్డ్ కప్ 2024 కోసం తమ జట్టును ప్రకటించిన తొలి టీమ్ గా న్యూజిలాండ్ నిలిచింది. సోమవారం (ఏప్రిల్ 29) అక్కడి సెలెక్టర్లు జట్టును అనౌన్స్ చేశారు.
New Zealand T20 World Cup Team: టీ20 వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ టీమ్ రెడీ అయిపోయింది. అందరి కంటే ముందుగానే అక్కడి క్రికెట్ బోర్డు తమ జట్టును అనౌన్స్ చేయడం విశేషం. 15 మందితో కూడిన ఈ జట్టును కేన్ విలియమ్సన్ లీడ్ చేయనున్నాడు. గతంలో టీ20 వరల్డ్ కప్ ఆడని మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్రలు ఈ జట్టులో ఉన్నారు.
అనువజ్ఞులతో నిండిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ తమ జట్టులో మంచి అనుభజ్ఞులను ఎంపిక చేసింది. అత్యధికంగా తన ఏడో టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్న టిమ్ సౌథీ కూడా ఈ జట్టులో ఉన్నాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కంటే కూడా సీనియర్ అతడే. ఇక ప్రస్తుతం ఐపీఎల్లో రాణిస్తున్న మరో స్టార్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ను కూడా ఎంపిక చేశాడు. అతనికి ఇది ఐదో టీ20 వరల్డ్ కప్ కానుంది.
గాయంతో ఈ ఏడాది ఐపీఎల్ కు దూరమైన స్టార్ ఓపెనర్ డెవోన్ కాన్వే కూడా ఈ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇక ఊహించినట్లే గతేడాది వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచిన రచిన్ రవీంద్రకు ఈ టీ20 వరల్డ్ కప్ జట్టులోనూ చోటు దక్కింది. ఏడాది కాలంగా అతడు తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడని ఈ సందర్భంగా హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు. ప్రస్తుతం రచిన్ రవీంద్ర ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
ఒకటి, రెండు మెరుపులు తప్ప అతడు పెద్దగా రాణించలేకపోయాడు. వెస్టిండీస్, యూఎస్ఏ పరిస్థితులకు అనుగుణంగా తాము జట్టును ఎంపిక చేసినట్లు స్టెడ్ చెప్పాడు. గతేడాది ఐపీఎల్లో గాయపడి చాలా కాలం తర్వాత ఈ ఏడాది జనవరిలో జట్టులోకి తిరిగి వచ్చిన కేన్ విలియమ్సన్ కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. పాకిస్థాన్ తో సిరీస్ లోనూ అతడు కేవలం రెండు టీ20లో ఆడి మరోసారి గాయపడ్డాడు.
జూన్ 2 నుంచి జూన్ 29 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ ను జూన్ 7న ఆఫ్ఘనిస్థాన్ తో తలపడనుంది. గ్రూప్ సిలో ఈ రెండు టీమ్స్ తోపాటు వెస్టిండీస్, పపువా న్యూ గినియా, ఉగాండా టీమ్స్ ఉన్నాయి. ఐపీఎల్ మే 26న ముగియనుండగా.. వారంలోపే టీ20 వరల్డ్ కప్ రూపంలో మరో మెగా క్రికెట్ టోర్నీ అభిమానులను అలరించనుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా తమ జట్టును త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2024కు న్యూజిలాండ్ టీమ్
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మాన్, డెవోన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ