MS Dhoni: ధోనీ ఆడాలని అనుకున్నన్ని రోజులూ అతని కోసం రూల్స్ మారుతూనే ఉంటాయి: టీమిండియా మాజీ క్రికెటర్ బోల్డ్ కామెంట్స్-ms dhoni former team india cricketer mohammed kaif says as long as dhoni wants to play rules will change ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni: ధోనీ ఆడాలని అనుకున్నన్ని రోజులూ అతని కోసం రూల్స్ మారుతూనే ఉంటాయి: టీమిండియా మాజీ క్రికెటర్ బోల్డ్ కామెంట్స్

MS Dhoni: ధోనీ ఆడాలని అనుకున్నన్ని రోజులూ అతని కోసం రూల్స్ మారుతూనే ఉంటాయి: టీమిండియా మాజీ క్రికెటర్ బోల్డ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Oct 04, 2024 03:22 PM IST

MS Dhoni: ధోనీ ఐపీఎల్లో ఆడాలని అనుకున్నన్ని రోజులూ అతని కోసం రూల్స్ మారుతూనే ఉంటాయని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. వచ్చే ఏడాది టోర్నీలోకి మరోసారి అన్‌క్యాప్డ్ ప్లేయర్ నిబంధనకు మార్పులు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో అతడీ కామెంట్స్ చేయడం గమనార్హం.

ధోనీ ఆడాలని అనుకున్నన్ని రోజులూ అతని కోసం రూల్స్ మారుతూనే ఉంటాయి: టీమిండియా మాజీ క్రికెటర్ బోల్డ్ కామెంట్స్
ధోనీ ఆడాలని అనుకున్నన్ని రోజులూ అతని కోసం రూల్స్ మారుతూనే ఉంటాయి: టీమిండియా మాజీ క్రికెటర్ బోల్డ్ కామెంట్స్ (AFP)

MS Dhoni: ఎమ్మెస్ ధోనీ.. ఇండియన్ క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి పవర్ ను ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి. ఒకప్పుడు సచిన్ ఏం చెబితే బీసీసీఐ అది చేయాల్సిందే. ఇప్పుడు ధోనీ అలా చక్రం తిప్పగల స్థాయిలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఎప్పుడో రిటైరైనా ఐపీఎల్లో కొనసాగుతూనే ఉన్నాడు. అందుకే అతడు ఆడినన్ని రోజులూ రూల్స్ మారుతూనే ఉంటాయని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నాడు.

ధోనీ కోసం రూల్స్ మారతాయి

ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో ఓ కీలకమైన మార్పు చేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల కిందట తీసేసిన ఆ నిబంధనను మరోసారి ధోనీ కోసమే తీసుకొచ్చినట్లుగా ఉంది. అదేంటంటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనా లేదంటే టీమిండియాకు దూరమై కనీసం ఐదేళ్లు అయిన ప్లేయర్స్ ను అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా గుర్తించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది.

దీంతో 2020లో రిటైరైన ధోనీ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ లో అన్‌క్యాప్డ్ ప్లేయర్ గా వచ్చే ఏడాది కూడా కొనసాగనున్నాడు. కేవలం రూ.4 కోట్లకే ధోనీని ఆ టీమ్ రిటెయిన్ చేసుకోవచ్చు. దీనివల్ల మిగిలిన ప్లేయర్స్ పై ఎక్కువ మొత్తం ఖర్చు చేసే అవకాశం వాళ్లకు దక్కుతుంది. ఇదంతా చూస్తుంటే ధోనీ కోసమే ఈ నిబంధన మార్చినట్లు ఎవరికైనా అర్థమవుతుంది.

ధోనీ కోసం మార్చాల్సిందే: కైఫ్

దీనిపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ లో అతడు మాట్లాడాడు. "ఎమ్మెస్ ధోనీ మళ్లీ ఆడటం మనం చూడబోతున్నాం. అతడు ఫిట్ గా ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నాడు. వికెట్ల వెనుక కూడా బాగానే ఉన్నాడు.

అతడు ఆడాలని అనుకున్నన్ని రోజులూ రూల్స్ మారుతూనే ఉంటాయి. మీరు రూల్స్ మార్చాల్సిందే. లేదంటే ఏదో ఒకటి చేసి అతడు ఆడాలని అనుకుంటే ఆడించాల్సిందే. సీఎస్కేకు అతడు అంతటి పెద్ద ప్లేయర్, మ్యాచ్ విన్నర్" అని మహ్మద్ కైఫ్ ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.

ధోనీ కోసమే ఈ రూల్ మార్చారని అందరికీ తెలుసని కూడా కైఫ్ అనడం గమనార్హం. "ఫిట్ గా ఉండి బాగా ఆడుతుంటే తప్పేముంది? తనకు డబ్బు అవసరం లేదని ధోనీయే చెప్పాడు. టీమ్ మేనేజ్మెంట్ కు ఏది కావాలంటే తాను అది చేస్తానని స్పష్టంగా చెప్పాడు.

కేవలం రూ.4 కోట్లకు అతన్ని రిటెయిన్ చేసుకోవడం కాస్త వింతగానే అనిపించినా.. అతన్ని దక్కించుకునే ఛాన్స్ అయితే ఉంది కదా. అతని కోసమే రూల్ మార్చారని అందరికీ తెలుసు. తప్పేం లేదు. ధోనీ అలాంటి ప్లేయరే మరి" అని కైఫ్ అన్నాడు.

ఐపీఎల్ మెగా వేలానికి ముందు గరిష్ఠంగా ఒక్కో ఫ్రాంఛైజీ ఆరుగురు ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే అవకాశం ఐపీఎల్ కల్పించిన విషయం తెలిసిందే. దీనికోసం ఒక్కో ఫ్రాంఛైజీ సుమారు రూ.79 కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ధోనీ కోసం రూ.4 కోట్లు పక్కన పెట్టి.. మిగిలిన డబ్బుతో తమ టీమ్ లోని కీలక ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకునే ప్లాన్ లో సీఎస్కే ఉంది.

Whats_app_banner