Gary Kirsten: ఇక చాలు ఆపేయండి.. గ్యారీ కిర్‌స్టన్ వివాదంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి కెవిన్ పీటర్సన్ అక్షింతలు,
Pakistan Coach Gary Kirsten: భారత్ జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంలో కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్ క్రియాశీలక పాత్ర పోషించాడు. అలాంటి కోచ్‌ను అవమానకరరీతిలో పాకిస్థాన్ వదిలేసుకుంది.
పాకిస్థాన్ క్రికెట్‌లో రాజకీయాలకి బలైపోయిన ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌కి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మద్దతుగా నిలిచాడు. భారీ అంచనాల నడుమ పాకిస్థాన్ వన్డే, టీ20 టీమ్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిర్‌స్టన్ కేవలం 7 నెలల వ్యవధిలోనే ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించాడు. దాంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై పలు దేశాల మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. గ్యారీ కిర్‌స్టన్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడే భారత్ జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే.
గ్యారీకి స్వేచ్ఛ ఇవ్వని పాక్ బోర్డు
వివాదరహితుడిగా పేరొందిన దక్షిణాఫ్రికాకి చెందిన గ్యారీ కిర్‌స్టన్.. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్-2024 ముంగిట పాకిస్థాన్ జట్టుతో చేరాడు. కానీ.. అతనికి జట్టుని గాడిలో పెట్టే అవకాశమే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇవ్వలేదు.
పాక్ జట్టులో సంస్కరణలు తేవాలని గ్యారీ కిర్‌స్టన్ ప్రయత్నించినా ప్రతిసారీ.. ఏదో ఒక సాకు చెప్తూ వెళ్లింది. దాంతో పాకిస్థాన్ జట్టులో గ్రూప్ రాజకీయాలు పెరిగిపోగా.. టీమ్ రెండుగా విడిపోయింది. ఆ ప్రభావం జట్టు ప్రదర్శనపై పడి సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
గ్యారీ వద్దన్న ప్లేయర్‌కి కెప్టెన్సీ
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ ఓడిన తర్వాత పాక్ జట్టులో సంస్కరణలు మొదలవగా.. ఆ తర్వాత వరుసగా రెండు టెస్టులను గెలిచిన పాక్ టీమ్ 2-1తో సిరీస్‌ని గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, జింబాబ్వేతో పరిమిత ఓవర్ల సిరీస్‌కి జట్టు ఎంపిక గురించి చర్చ మొదలవగా.. ఎవరూ ఊహించనిరీతిలో పాక్ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గ్యారీ కిర్‌స్టన్ ప్రకటించాడు.
జట్టుకి అతను ఆశించిన విధంగా కోచింగ్ స్టాఫ్‌ను ఇప్పటికే ఇవ్వని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. టీమ్ ఎంపికలో తన అభిప్రాయానికి విలువ ఇవ్వకపోడంతోనే గ్యారీ కిర్‌స్టన్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ వన్డే, టీ20 జట్టుకి కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ని చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పట్టుబట్టింది. కానీ.. గ్యారీ కిర్‌స్టన్ మాత్రం ఫామ్‌లో లేని రిజ్వాన్ వద్దు అని నిలకడగా ఆడుతున్న మరో ప్లేయర్ పేరు చెప్పినట్లు సమాచారం.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్ల పాత్ర నామమాత్రం అనే విషయం గ్యారీకి అర్థమవడానికి ఎంతో సమయం పట్టలేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్‌లో అభిప్రాయపడ్డాడు.
ఒక అడుగు ముందు.. 2 అడుగులు వెనక్కి
‘‘కోచ్‌గా ఇంకా పదవీకాలం ఉండగానే ఎలా గ్యారీ కిర్‌స్టన్ సేవల్ని పాకిస్థాన్ క్రికెట్ కోల్పోయింది? ఇటీవల ఓ అడుగు ఆ జట్టు ముందుకు వేసింది.. ఈరోజు రెండు అడుగులు వెనక్కి వేసింది. ఇలాంటివి చేయడం ఇకనైనా ఆపండి. ఇలాంటివి చేయడానికి చాలా ప్రతిభ కావాలి’’ అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పెద్దలకి కెవిన్ పీటర్సన్ చురకలు అంటించాడు.
పాకిస్థాన్ టీమ్ త్వరలోనే ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను ఆడనుంది. అయితే.. గ్యారీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో టెస్టు టీమ్‌కి కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీకి బాధ్యతలు అప్పగించింది. అలానే ఆస్ట్రేలియా, జింబాబ్వేతో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జట్టుని ప్రకటించిన పాకిస్థాన్.. కెప్టెన్సీ బాధ్యతల్ని మహమ్మద్ రిజ్వాన్‌కి అప్పగించింది.