Petersen on Klassen: కోహ్లీ కంటే క్లాసెన్ సెంచరీనే బెటర్.. కెవిన్ పీటర్సన్ షాకింగ్ కామెంట్స్
Petersen on Klassen: గురువారం ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హెన్రిక్ క్లాసెన్‌తో పాటు, విరాట్ కోహ్లీ కూడా సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు శతకాల్లో క్లాసెన్‌దే బెటర్ అని కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.
Petersen on Klassen: ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. అనంతరం 19.2 ఓవర్లలో ఆర్సీబీ ఆ లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ తరఫున హెన్రిక్ క్లాసెన్ ఐపీఎల్ కెరీర్‌లో తన తొలి సెంచరీ నమోదు చేయగా.. ఆర్సీబీ వైపు విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో ఆరో శతకాన్ని అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. పలితంగా సర్వత్రా అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ మాత్రం విరుద్ధంగా స్పందించాడు. రెండు సెంచరీల్లో క్లాసెన్ ఇన్నింగ్సే తనకు నచ్చిందని తెలిపాడు.
"నేను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోని విషయాన్ని తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన మ్యాచ్‌ల్లో రెండు శతకాల్లో నాకు హెన్రిక్ క్లాసెన్ చేసిన సెంచరీ ఇన్నింగ్సే నచ్చింది. క్లాసెన్ సెంచరీ మెరుగైందిగా భావిస్తాను. జట్టులో సగం మంది ఔటైనప్పటికీ, లభించిన కొద్ది సపోర్టుతో అద్భుతంగా ఆడాడు. తన జట్టు కోసం ఆడాడు. అది బ్రిలియంట్ ఇన్నింగ్స్. క్లాసెన్ ఆడిన ఇన్నింగ్స్ నిజంగా అద్భుతం." అని కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు.
ఈ మ్యాచ్‌లో హెన్రిక్ క్లాసెన్ అద్భుత శతకంతో అదరగొట్టాడు. ఓ పక్క వికెట్లు పడుతున్నా.. క్రీజులో పాతుకుపోయి సెంచరీతో విజృంభించాడు 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు, 6సిక్సర్లు ఉన్నాయి. అయితే ధాటిగా ఆడే ప్రయత్నంలో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇది అతడి మొదటి ఐపీఎల్ సెంచరీ.
ఈ మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో విజృభించి ఐపీఎల్ ఆరో శతకాన్ని నమోదు చేశాడు. డుప్లెసిస్(71) సాయంతో అతడు ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరూ కలిసి 172 పరుగుల భాగస్వామమ్యాన్ని నమోదు చేశారు. ఈ విజయంతో ఆర్సీబీ తన ప్లేఆఫ్స్ ఆశలను మరింత బలపరుస్తుంది.