Rizwan on IPL: ఐపీఎల్ కంటే మా పాకిస్థాన్ సూపర్ లీగే చాలా కఠినమైనది.. ఎవరిని అడిగినా ఇదే చెబుతారు: రిజ్వాన్
Rizwan on IPL: ఐపీఎల్ కంటే మా పాకిస్థాన్ సూపర్ లీగే చాలా కఠినమైనది.. కావాలంటే ప్రపంచంలో ఏ ప్లేయర్‌ను అడిగినా ఇదే చెబుతారు అని అంటున్నాడు పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్.
Rizwan on IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్. ఇందులో ఆడటానికి ప్రపంచంలోని టాప్ ప్లేయర్స్ అందరూ పోటీ పడతారు. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ రోజురోజుకూ మరింత బలంగా ముందుకు వెళ్తోంది. అయితే పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం ఐపీఎల్ కంటే కూడా తమ పాకిస్థాన్ సూపర్ లీగే(పీఎస్‌ఎల్) ఎంతో కఠినమైనదని అంటున్నాడు.
ఐపీఎల్ పాక్ ఆటగాళ్లకు అవకాశం లేదన్న విషయం తెలిసిందే. 2008లో తొలి సీజన్‌లో ఆడిన తర్వాత ముంబై దాడులు జరగడం, ఆ తర్వాత పాక్ ఆటగాళ్లను అనుమతించకపోవడంతో వాళ్లు ఈ మెగా లీగ్‌లో మళ్లీ కనిపించలేదు. ఆ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ అంటూ వాళ్లే సొంతంగా ప్రారంభించుకున్నారు. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ తప్ప మిగతా టీమ్స్ ఆటగాళ్లు ఆడుతున్నారు.
ఈ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ టీమ్‌కు రిజ్వాన్ ఆడుతున్నాడు. ఆ టీమ్ కెప్టెన్‌గా 2021లో టైటిల్ కూడా సాధించి పెట్టాడు. ప్రస్తుతం ఈ లీగ్ డ్రాఫ్ట్ జరగబోతోంది. దీనికి ముందు రిజ్వాన్ మాట్లాడుతూ.. తమ లీగ్‌ను ఆకాశానికెత్తాడు. "పీఎస్‌ఎల్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ లీగ్ సక్సెస్ కాదని ఎంతో మంది అన్నారు. కానీ ఓ ప్లేయర్‌గా మేము కూడా ఇప్పుడు చెబుతున్నాం పీఎస్‌ఎల్ సక్సెస్ అయిందని. ఐపీఎల్ కూడా ఉంది. కానీ పీఎస్‌ఎల్‌లో ఆడిన ప్రపంచంలోని ఏ ప్లేయర్‌ను అయినా అడగండి.. పాకిస్థాన్ లీగే కఠినమైనదని చెబుతారు" అని రిజ్వాన్ అన్నాడు.
"పీఎస్‌ఎల్‌లో పాల్గొన్న ఓ రిజర్వ్ ప్లేయర్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయా టీమ్స్‌కు బెంచ్‌పై ఉండే ప్లేయరే అవుతాడు. పాకిస్థాన్ టీమ్‌కు ఈ స్థాయిలో బ్యాకప్ ప్లేయర్స్ అందుతున్నారంటే దాని క్రెడిట్ ఈ లీగ్‌కే దక్కుతుంది" అని రిజ్వాన్ స్పష్టం చేశాడు.
టాపిక్