Kamindu Mendis: బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన కమిందు మెండిస్.. ఈ శ్రీలంక బ్యాటర్ జోరుకు అడ్డే లేదా?
Kamindu Mendis: కమిందు మెండిస్.. శ్రీలంకలోనే కాదు ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడో పెద్ద సెన్సేషన్. తాజాగా మరో సెంచరీతో అతడు ఆల్ టైమ్ క్రికెట్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డును కూడా సమం చేయడం విశేషం.
Kamindu Mendis: కమిందు మెండిస్.. టెస్టు క్రికెట్‌లో ఈ శ్రీలంక బ్యాటర్ జోరుకు అసలు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. సరికొత్త రన్ మెషీన్ గా అవతరించిన కమిందు.. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో మరో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఉపఖండం బ్యాటర్ గా నిలవడంతోపాటు బ్రాడ్‌మన్ నూ సమం చేశాడు.
కమిందు మెండిస్ రికార్డు
శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 182 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతడు తన 13వ టెస్టు ఇన్నింగ్స్ లోనే 1000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఉపఖండంలో ఇన్నాళ్లూ 14 ఇన్నింగ్స్ తో వినోద్ కాంబ్లి పేరిట ఉన్న రికార్డును కమిందు అధిగమించాడు.
అంతేకాదు క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డు సమం చేశాడు. బ్రాడ్‌మన్ కూడా 13 ఇన్నింగ్స్ లోనే వెయ్యి రన్స్ చేశాడు. ఇప్పుడీ ఇద్దరూ రెండో స్థానంలో నిలిచారు. ఎవర్టన్ వీక్స్, హెర్బర్ట్ సట్‌క్లిఫ్ లు 12 ఇన్నింగ్స్ లోనే 1000 రన్స్ చేసి టాప్ లో కొనసాగుతున్నారు. 8వ టెస్టు ఆడుతున్న కమిందు తన ఐదో సెంచరీ చేయడం విశేషం.
రన్ మెషీన్ కమిందు
కమిందు మెండిస్ టెస్టు క్రికెట్ లో సరికొత్త రన్ మెషీన్ గా ఎదుగుతున్నాడు. ఇప్పటికే అతడు తొలి 7 టెస్టుల్లో 822 రన్స్ చేయగా.. ఇప్పుడు 8వ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో మరో 182 రన్స్ జోడించాడు. దీంతో టెస్టుల్లో అతని మొత్తం పరుగులు 1004కు చేరాయి. అందులో ఐదు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
గతంలో అత్యధిక స్కోరు 164 పరుగులుగా ఉండగా.. ఇప్పుడీ ఇన్నింగ్స్ తో దానిని కూడా మెరుగుపరచుకున్నాడు. టెస్టుల్లో ఇప్పటి వరకూ అతడు ఆడిన ఇన్నింగ్స్ చూస్తే వరుసగా.. 61, 102, 164, 92, 9, 12, 113, 74, 4, 64, 114, 13, 182 పరుగులు చేయడం విశేషం. అంటే మొత్తంగా 13 ఇన్నింగ్స్ లో 9సార్లు 50కిపైగా స్కోర్లు చేశాడు. మిగిలిన నాలుగు ఇన్నింగ్స్ లో మాత్రమే విఫలమయ్యాడు. సగటు ఏకంగా 91.27గా ఉంది.
కష్టాల్లో న్యూజిలాండ్
కమిందు మెండిస్ తోపాటు దినేష్ చండీమాల్ (116), కుశల్ మెండిస్ (106) కూడా సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ను శ్రీలంక 5 వికెట్లకు 602 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది.
ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 22 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఇప్పటికే సిరీస్ లో తొలి టెస్టు గెలిచిన శ్రీలంక.. ఈ మ్యాచ్ లోనూ భారీ విజయంపై కన్నేసింది.