Jos Buttler: సెంచరీతో కోహ్లిని మించిపోయి.. బాబర్ ఆజం రికార్డు సమం చేసిన జోస్ బట్లర్
Jos Buttler: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ ఐపీఎల్ 2024లో రెండో సెంచరీతో విరాట్ కోహ్లిని మించిపోయాడు. అదే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును సమం చేయడం విశేషం.
Jos Buttler: ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటిగా నిలిచిపోయే సెంచరీ బాదాడు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్. ఈ సెంచరీతో అతడు విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేయడంతోపాటు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును సమం చేశాడు. అంతేకాదు అతని సెంచరీతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక లక్ష్యాన్ని రాయల్స్ టీమ్ చేజ్ చేసింది.
కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో బట్లర్ కేవలం 60 బంతుల్లోనే 107 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. చివరి బంతికిగానీ ఆర్ఆర్ చేజ్ చేయలేకపోయింది. దీంతో అంతకు ముందు కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ చేసిన సెంచరీ వృథాగా మారిపోయింది. బట్లర్ సెంచరీతో నమోదైన అన్ని రికార్డులను ఒకసారి చూద్దాం.
ఐపీఎల్లో అత్యధిక ఛేజింగ్
224 - రాజస్థాన్ రాయల్స్ వెర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (ఐపీఎల్ 2024) - ఆర్ఆర్ విజయం
224 - రాజస్థాన్ రాయల్స్ వెర్సెస్ పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్ 2024) - ఆర్ఆర్ విజయం
219 - ముంబై ఇండియన్స్ వెర్సెస్ (చెన్నై సూపర్ కింగ్స్ (ఐపీఎల్ 2021) - ముంబై విజయం
విజయవంతమైన ఐపీఎల్ చేజింగ్‌లో 6వ వికెట్ పడిన తర్వాత ఎక్కువ పరుగులు జోడించిన రికార్డును కూడా రాజస్థాన్ రాయల్స్ క్రియేట్ చేసింది. ఆ టీమ్ ఈ మ్యాచ్ లో 6వ వికెట్ కోల్పోయిన తర్వాత కూడా ఏకంగా 103 పరుగులు జోడించింది. ఇంతకు ముందు ఈ రికార్డు 2016లో ఆర్సీబీ పేరిట ఉంది. ఆ టీమ్ గుజరాత్ లయన్స్ పై 91 రన్స్ జోడించింది.
గేల్ రికార్డు బ్రేక్
ఐపీఎల్లో అత్యధిక సెంచరీల జాబితాలో క్రిస్ గేల్ రికార్డును కూడా జోస్ బట్లర్ బ్రేక్ చేశాడు. అంతేకాదు విరాట్ కోహ్లికి మరింత చేరువయ్యాడు. ఐపీఎల్లో బట్లర్ కు ఇది 7వ సెంచరీ కావడం విశేషం. క్రిస్ గేల్ 6 సెంచరీలతో మూడో స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లి 8 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. కానీ సక్సెస్‌ఫుల్ చేజింగ్ లో మాత్రం కోహ్లి రికార్డును బట్లర్ బ్రేక్ చేశాడు.
ఐపీఎల్ చేజింగ్ లలో బట్లర్ ఇప్పుడు 3 సెంచరీలతో టాప్ లోకి వెళ్లాడు. ఈ సీజన్లోనే ఆర్సీబీపైనా బట్లర్ సెంచరీతో రాయల్స్ ను గెలిపించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, బెన్ స్టోక్స్ రెండేసి సెంచరీలు చేశారు. ఇక టీ20ల్లో గెలిపించిన సెంచరీల జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును బట్లర్ సమం చేశాడు. ఇప్పటి వరకూ క్రిస్ గేల్ 16 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో ఎనిమిదేసి సెంచరీలతో బాబర్ ఆజం, జోస్ బట్లర్ నిలిచారు.
కేకేఆర్ తో మ్యాచ్ లో బట్లర్ ఒంటి చేత్తో రాయల్స్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ తోపాటు యశస్వి, రియాన్ పరాగ్, హెట్‌మయర్ లాంటి వాళ్లు ఫెయిలైనా.. చివరి బంతి వరకూ క్రీజులో ఉండి అసాధ్యమనుకున్న విజయాన్ని సాధించి పెట్టాడు.