IPL Quiz: ఇప్పటి వరకు ధోనీ ఎన్ని ఐపీఎల్ ఫైనల్స్ ఆడాడో తెలుసా?
IPL Quiz - MS Dhoni: ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్‍గా మహేంద్ర సింగ్ ధోనీ నిలిపాడు. ఆ జట్టుకు కెప్టెన్‍గా ఐదు టైటిళ్లను అందించాడు. అయితే, ఇప్పటి వరకు ఐపీఎల్‍లో ధోనీ ఎన్నిసార్లు ఫైనల్స్ ఆడాడో మీకు తెలుసా?
IPL Quiz: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతాలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు కెప్టెన్‍గా ఐదు టైటిళ్లను అందించాడు. గతేడాది ఐపీఎల్ 2023 సీజన్‍లోనూ ధోనీ సారథ్యంలో చెన్నై టైటిల్ కొట్టింది. ఐపీఎల్‍లో ముంబై ఇండియన్స్‌కు సమానంగా మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్‍గా చెన్నైను నిలిపాడు మహీ. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్‍లో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని.. ఆటగాడిగా ఆడుతున్నాడు. చెన్నై జట్టుకు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‍ను కెప్టెన్ చేశాడు. అయితే, ఇప్పటి వరకు ఐపీఎల్‍లో ధోనీ ఎన్నిసార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడారో మీకు తెలుసా? ఇక్కడ సమాధానాన్ని చూడండి.
ఐపీఎల్ తొలి సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మహేంద్ర సింద్ ధోనీ సారథ్యం వహించాడు. 2015 వరకు ఆ జట్టును నడిపాడు. అయితే, ఆ తర్వాత చెన్నై ఫ్రాంచైజీపై రెండేళ్ల వేటు పడింది. దీంతో 2016, 2017 సీజన్లలో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ టీమ్ తరఫున ధోనీ ఆడాడు. అనంతరం 2017 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరఫునే ఆడుతున్నాడు. 2023 సీజన్ వరకు ధోనీ సారథ్యంలో సీఎస్‍కే ఐదు టైటిళ్లను సాధించింది.
ధోనీ ఎన్ని ఫైనల్స్ ఆడాడంటే..
ఐపీఎల్‍లో 2023 సీజన్ వరకు మహేంద్ర సింగ్ ధోనీ 11 ఫైనల్స్ ఆడాడు. ధోనీ కెప్టెన్సీలో 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019, 2021, 2023 ఐపీఎల్ సీజన్లలో చెన్నై ఫైనల్ చేరింది. ఇందులో 2010, 2011, 2018, 2021, 2023 ఫైనళ్లలో గెలిచి.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిళ్లు సాధించింది. అలాగే, 2017 సీజన్‍లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఫైనల్ చేరింది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేసిన ఆ జట్టులో అప్పుడు ధోనీ ఆడాడు. దీంతో.. మొత్తంగా ఐపీఎల్‍లో ఇప్పటి వరకు ధోనీ 11సార్లు ఫైనల్స్ ఆడాడు.
2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఇలా..
రుతురాడ్ గైక్వాడ్ సారథ్యంలో ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ ఒడిదొడుకుల మధ్య సాగుతోంది. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచి.. మూడింట్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇంకా.. ఆ జట్టు ఏడు లీగ్ మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. అయితే, చెన్నై మరోసారి ప్లే ఆఫ్స్ చేరుతుందనే అంచనాలు మెండుగా ఉన్నాయి. ఈ 2024 సీజన్‍లో కూడా చెన్నై ఫైనల్ చేరితే.. ధోనీకి 12వ ఫైనల్ అవుతుంది.
ఈ సీజన్‍లో కెప్టెన్సీ లేకుండా ఆటగాడిగా గైక్వాడ్‍కు దిశానిర్దేశం చేస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అలాగే, గాయం బాధిస్తున్నా బ్యాటింగ్‍లో మెరుపులు మెరిపిస్తున్నారు. వింటేజ్ హిట్టింగ్‍తో దుమ్మురేపుతున్నాడు. ముంబైతో మ్యాచ్‍లో హ్యాట్రిక్ సిక్సర్లతో అదరగొట్టాడు. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‍ల్లో బ్యాటింగ్‍కు దిగిన ధోనీ 255 స్ట్రైక్ రేట్‍తో 87 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‍ల్లో చివర్లో దూకుడుగా కీలకమైన రన్స్ చేశాడు.
ఈ సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి ఏప్రిల్ 23న లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడనుంది.