IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ముంగిట భారత్‌ జట్టుకి గాయాల దెబ్బ, 2 రోజుల్లో నలుగురు క్రికెటర్లకి గాయాలు-indian cricketer shubman gill suffers injury ahead of perth test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ముంగిట భారత్‌ జట్టుకి గాయాల దెబ్బ, 2 రోజుల్లో నలుగురు క్రికెటర్లకి గాయాలు

IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ముంగిట భారత్‌ జట్టుకి గాయాల దెబ్బ, 2 రోజుల్లో నలుగురు క్రికెటర్లకి గాయాలు

Galeti Rajendra HT Telugu
Nov 16, 2024 05:19 PM IST

India vs Australia 2024: పెర్త్ టెస్టు ముంగిట భారత్ జట్టుని వరుస గాయాలు వేధిస్తున్నాయి. తొలుత సర్ఫరాజ్ ఖాన్ గాయపడగా.. ఆ తర్వాత వరుసగా ముగ్గురు ఆటగాళ్లు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డారు.

భారత్ జట్టులో నలుగురికి గాయాలు
భారత్ జట్టులో నలుగురికి గాయాలు (PTI)

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ముంగిట భారత్ జట్టుకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా గడ్డపైకి వెళ్లిన టీమిండియాలో.. నలుగురు క్రికెటర్లు రెండు రోజుల వ్యవధిలో గాయపడ్డారు. నవంబరు 22న భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

తొలి టెస్టుకి ముందు భారత్ జట్టు వార్మప్ మ్యాచ్‌లను ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఒకరు గాయపడగా.. ఫీల్డింగ్ చేస్తూ ఇద్దరు గాయాలపాలయ్యారు. ఈ మ్యాచ్‌కి ముందు నెట్ సెషన్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ సర్ఫరాజ్ ఖాన్ గాయపడ్డాడు. గాయపడిన ఆటగాళ్ల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్ గిల్ కూడా ఉండటంతో టీమిండియాలో కంగారు పెరుగుతోంది.

గిల్ చేతి వేలికి గాయం

డబ్ల్యూఏసీఏ స్టేడియంలో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ రెండో రోజు ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ వేలికి గాయమైనట్లు రెవ్ స్పోర్ట్స్ తెలిపింది. దాంతో రెండు రోజుల పాటు అతని గాయాన్ని పర్యవేక్షించిన తర్వాత తొలి టెస్టులో అతను ఆడటంపై నిర్ణయం తీసుకుంటామని టీమిండియా మేనేజ్‌మెంట్ తెలిపింది.

ఇదే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ విసిరిన రైజింగ్ బాల్‌కి గాయపడ్డాడు. అనూహ్యంగా బౌన్స్ అయిన బంతి రాహుల్ మోచేయికి తగిలింది. దాంతో ఫిజియో వచ్చి గాయం పరిశీలించిన తర్వాత.. రాహుల్ మైదానం వీడాడు.

కోహ్లీ గాయానికి స్కానింగ్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేకపోతే అతని స్థానంలో రాహుల్ ఆడే అవకాశం ఉంది. అయితే.. రాహుల్ గాయంతో టీమిండియాలో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా గాయం కారణంగా గురువారం స్కానింగ్ చేయించుకున్నాడు.

భారత్‌లోనే హిట్ మ్యాన్

రోహిత్ శర్మ భార్య రితిక రెండో బిడ్డకి జన్మనివ్వడంతో కెప్టెన్ భారత్‌లోనే ఉండిపోయాడు. దాంతో తొలి టెస్టులో రోహిత్ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా టీమ్‌ను నడిపించబోతున్నాడు. ఇప్పుడు ఈ టూర్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీ వైపు ఉండగా.. భారత్ జట్టు ప్రాక్టీస్ సెషన్, వార్మప్ మ్యాచ్‌ల వీడియోలు బయటికి వెళ్లకుండా టీమిండియా జాగ్రత్తపడుతోంది.

Whats_app_banner