IND vs BAN 2nd Test: భారత్, బంగ్లా రెండో టెస్టు డ్రా ఖాయమే! మూడో రోజు రద్దు.. మిగిలిన రెండు రోజులు ఆట సాధ్యమవుతుందా?
IND vs BAN 2nd Test: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు డ్రా అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ మూడో రోజు కూడా రద్దయింది. వాన లేకున్నా ఆట సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్‍లో మరో రెండు రోజులు మిగిలి ఉన్నాయి.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు నిరాశే మిగులుస్తోంది. క్లీన్‍స్వీప్ చేయాలని కసిగా ఉన్న టీమిండియా ఆశలు ఇక నెరవేరనట్టే. ఈ రెండో టెస్టు డ్రా కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్టు మ్యాచ్‍లో నేడు (సెప్టెంబర్ 29) మూడో రోజు ఆట మొదలు కాకుండానే రద్దయింది. ఒక్క బంతి కూడా పడలేదు. వాన లేకున్నా ఆట జరగలేదు. ఇప్పటికే రెండో రోజు క్యాన్సిల్ అవగా.. మూడో రోజు కూడా రద్దయింది.
వాన లేకున్నా.. చిత్తడి అలానే..
ఈ మ్యాచ్ మూడో రోజున కాన్పూర్ గ్రీన్ పార్క్ మైదానం వద్ద వర్షం పడలేదు. అయినా, మ్యాచ్ సమయానికి ఆరంభం కాలేదు. మైదానం చిత్తడిగా ఉండటంతో సరి చేసేందుకు స్టేడియం సిబ్బంది శ్రమించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఈ రెండో టెస్టు రెండో రోజైన శనివారం (సెప్టెంబర్ 29) కాన్పూర్ స్టేడియం వద్ద భారీగా వాన పడింది. మైదానాన్ని కవర్లతో కప్పినా వాటిపై నీరు భారీగా నిలిచింది. మైదానం చిత్తడిగా మారింది. గ్రౌండ్‍లో చాలా చోట్ల బురద ఎక్కువగా ఉంది. నీరు అలాగే ఉంది. దీంతో గ్రౌండ్‍ను పొడిగా చేసేందుకు స్టేడియం సిబ్బంది నేడు ప్రయత్నించారు. అయినా, ఆడేందుకు వీలుగా గ్రౌండ్ సిద్ధమవలేదు. చిత్తడి అలాగే ఉంది. దీంతో వాన పడకపోయినా మూడో రోజు ఆట రద్దయింది.
ప్రేక్షకుల అసంతృప్తి
వర్షం లేకున్నా మూడో రోజు ఆట సాధ్యం కాకపోవడంపై స్టేడియానికి వచ్చిన కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్టేడియంలో ఉత్తర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) సరైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఆ కారణంగానే నీరు బయటికి పోలేక మైదానం చిత్తడిగా మారిందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి.
చివరి రెండు రోజులు ఇలా..
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య నాలుగు, ఐదో రోజుల్లో ఆట జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ రిపోర్టుల ప్రకారం, నాలుగో రోజు (సెప్టెంబర్ 30) వాన పడే ఛాన్స్ 20 శాతం, ఐదో రోజు (అక్టోబర్ 1) 10 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ రెండు రోజులు ఆట జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాన్పూర్ స్టేడియం వద్ద నేడు వాన పడకపోతే.. మైదానం రేపు నాలుగో రోజు ఆట కల్లా పొడిగా మారుతుంది. దీంతో ఆట సజావుగా జరిగే అవకాశాలు ఉన్నాయి.
డ్రా తథ్యం!
ఈ రెండో టెస్టులో ఇప్పటికే రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. తొలి రోజు 35 ఓవర్ల ఆట జరగగా.. రెండు, మూడు రోజుల్లో కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. దీంతో మూడో రోజుల్లో 35 ఓవర్లే జరిగాయి. ఈ టెస్టు మ్యాచ్‍లో ఇంకా రెండు రోజుల ఆట ఉంది. ఈ రెండు రోజులు పూర్తిగా జరిగినా మ్యాచ్‍లో ఫలితం తేలే అవకాశాలు అత్యల్పం. దీంతో ఈ రెండో టెస్టు డ్రా అవడం ఖాయంగానే కనిపిస్తోంది.
రెండో టెస్టు తొలిరోజు ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. 35 ఓవర్ల ఆట జరిగింది. బంగ్లా బ్యాటర్లు మోమినిల్ హక్ (40 నాటౌట్), ముష్పికర్ రహీం (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. నాలుగో రోజు ఆట జరిగితే వీరు బ్యాటింగ్ కొనసాగిస్తారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత యంగ్ పేసర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ పడగొట్టాడు.
రెండో టెస్టు డ్రా అయినా 1-0తో ఈ రెండు మ్యాచ్‍ల సిరీస్ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియాకే దక్కుతుంది. అయితే, క్లీన్‍స్వీప్ అవకాశం తప్పడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాయింట్లపై ప్రభావం పడుతుంది.