IND vs BAN 2nd Test: ఒక్క బంతి పడకుండానే రెండో రోజు ఆట రద్దు.. రేపటి పరిస్థితేంటి!
IND vs BAN 2nd Test Day 2: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టుకు వాన దెబ్బ మరోసారి పడింది. ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోడు ఆట రద్దయింది. మూడో రోజు ఆట జరగాల్సిన రేపు కాన్పూర్‌లో వాతావరణం ఎలా ఉండొచ్చో ఇక్కడ చూడండి.
బంగ్లాదేశ్‍ను క్లీన్‍స్వీప్ చేయాలని తహతహలాడుతున్న భారత్‍కు వాన అడ్డంకిగా మారింది. రెండో టెస్టుపై వర్షం దెబ్బకొడుతోంది. కాన్పూర్ గ్రీన్‍పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు 35 ఓవర్లు మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది. రెండో టెస్టు రెండో రోజైన నేడు (సెప్టెంబర్ 28) ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఆ వివరాలివే..
భారీ వర్షం.. చిత్తడిగా మైదానం
రెండో టెస్టు రెండో రోజైన నేడు ఉదయమే కాన్పూర్ స్టేడియం వద్ద వాన పడింది. దీంతో ఆట మొదలుకాలేదు. వర్షం చాలాసేపు అలాగే కొనసాగింది. దీంతో మైదానంలో కవర్లు అలాగే ఉన్నాయి. వాటిపై నీరు నిలిచింది. ఆరంభంలో తక్కువగా పడినా.. ఆ తర్వాత వాన జోరందుకుంది.
వాన భారీగా పడటంతో గ్రీన్ పార్క్ మైదానం చిత్తడిగా మారింది. అంపైర్లు పలుమార్లు ఇన్‍స్పెక్షన్ చేశారు. వాన కూడా ఆగింది. అయితే, అప్పటికే మైదానం బురదగా మారింది. సూపర్ సాపర్లతో స్టేడియం సిబ్బంది కష్టపడినా పరిస్థితి మెరుగుపడలేదు. చివరికి రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
రేపు వాతావరణం ఇలా..
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు మూడో రోజైన రేపు (సెప్టెంబర్ 29) కూడా వాన ఆటంకాలు తప్పేలా లేవు. అక్యువెదర్ రిపోర్ట్ ప్రకారం, కాన్పూర్‌లో రేపు వాన పడే అవకాశాలు 59 శాతంగా ఉన్నాయి. ఉదయం వాన పడే ఛాన్సులు ఉన్నాయి. గాలిలో తేమ శాతం కూడా 80 శాతం వరకు ఉండనుంది. మొత్తంగా మూడో రోజు వాన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే, రెండో రోజు కంటే పరిస్థితి మెరుగ్గానే ఉండొచ్చు. మధ్యాహ్నం వర్షం పడే అవకాశం 25 శాతం మాత్రమే ఉండొచ్చు. దీంతో మూడో రోజు ఆట రద్దయ్యే రేంజ్‍లో వాన ఉండకపోవచ్చు. అయితే, కాస్త ఆటంకాలు కలిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
స్కోర్ ఇలా..
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ రెండో టెస్టులో తొలి రోజు 35 ఓవర్ల ఆట సాధ్యమైంది. వాన, వెలుతురు సరిగా లేని కారణంగా అంతరాయాలతో తొలి రోజు ఆట సాగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 3 వికెట్లకు 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40 నాటౌట్) ముష్ఫికర్ రహీం (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ ఓ వికెట్ తీశారు. రెండో రోజు ఆట నేడు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. మూడో రోజు మోమినుల్, రహీం బ్యాటింగ్ కొనసాగించాల్సి ఉంది. మరి వరుణుడు ఈ మేరకు సహకరిస్తాడో చూడాలి.
ఈ రెండు టెస్టుల సిరీస్‍లో చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‍లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. బంగ్లాను చిత్తుచిత్తుగా ఓడించింది. దీంతో సిరీస్‍లో 1-0తో ముందడుగు వేసింది. కాన్పూర్ వేదికగా రెండో టెస్టు కూడా గెలిచి సిరీస్ క్లీన్‍స్వీప్ చేయాలనే కసితో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఉంది. అయితే, ఈ టెస్టులో రెండు రోజులు ముగియగా.. కేవలం 35 ఓవర్ల ఆట తొలి రోజు జరిగింది. మ్యాచ్ ఇంకా మూడో రోజులే జరగాల్సి ఉంది. దీంతో ఈ రెండో టెస్టు డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 1-0తో సిరీస్ కైవసం అయినా క్లీన్‍స్వీప్ ఛాన్స్ టీమిండియాకు మిస్ అవుతుంది. అలాగే, ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ పాయింట్ల పట్టికలోనూ భారత్‍కు ప్రతికూలంగా ఉంటుంది.