Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన లేడీ ఫ్యాన్, ఆటోగ్రాఫ్ ఇచ్చేశాక ఆఖర్లో అసలు నిజం బయటికి!
Virat Kohli Fan: పుణె టెస్టు ముంగిట భారత్ జట్టు ఆటగాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్‌కి వెళ్తున్న రోహిత్ శర్మని పిలిచిన లేడీ ఫ్యాన్ ఆటోగ్రాఫ్ అడిగింది. రోహిత్ శర్మ కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కానీ ఆఖర్లోనే అసలు ట్విస్ట్ ఇచ్చింది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మకి ఓ లేడీ ఫ్యాన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. న్యూజిలాండ్‌తో గురువారం (అక్టోబరు 24) నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుండగా.. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత్ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. గత ఆదివారం బెంగళూరులో ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోగా.. మూడు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనకబడి ఉంది. దాంతో సిరీస్‌పై ఆశలు నిలవాలంటే రెండో టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది.
లేడీ ఫ్యాన్ రిక్వెస్ట్‌కి రోహిత్ ఫిదా
బెంగళూరు టెస్టుకి పేస్ పిచ్‌ను సిద్ధం చేసి దెబ్బతిన్న టీమిండియా మేనేజ్‌మెంట్.. పుణెలో స్పిన్ పిచ్‌తో కివీస్‌ను దెబ్బతీయాలని యోచిస్తోంది. దాంతో ఆటగాళ్లు ఎక్కువగా స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చిన సమయంలో.. స్టేడియానికి వచ్చిన ఓ మహిళా అభిమాని ఆటోగ్రాఫ్ అడిగింది. ఆమె రిక్వెస్ట్ చేసిన తీరుకి ముచ్చటపడిన రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. కానీ.. ఆ తర్వాతే ఆ లేడీ ఫ్యాన్ అసలు ట్విస్ట్‌ను బయటపెట్టింది.
లాస్ట్‌లో ట్విస్ట్
లేడీ ఫ్యాన్: రోహిత్ భాయ్, దయచేసి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వండి. చాలా రోజుల నుంచి మీ ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూస్తున్నాను.
రోహిత్ శర్మ: హా.. వస్తున్నాను
(రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్ ఇస్తుండగా..)
లేడీ ఫ్యాన్: థాంక్యూ సో మచ్. నేను విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానిని.. కోహ్లీ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పండి
రోహిత్ శర్మ: (నవ్వుతూ) సరే... చెబుతాను
వాస్తవానికి లేడీ ఫ్యాన్ ఆటోగ్రాఫ్ అడగ్గానే తనకి అభిమాని అని భావించి అందంగా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కానీ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అని ఆటోగ్రాఫ్ ఇచ్చే వరకు ఆ అభిమాని దాచిపెట్టింది. అయినప్పటికీ రోహిత్ శర్మ నవ్వుతూ ఆమెకి ఆటోగ్రాఫ్ ఇచ్చిన నోట్స్ ఇచ్చి వెళ్లిపోయాడు.
తప్పుల్ని ఒప్పుకున్న రోహిత్ శర్మ
బెంగళూరు టెస్టులో భారత్ జట్టుకి గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌటవడంతో సొంతగడ్డపై భారత్ జట్టు పరువు పోయినంత పని అయిపోయింది. దాంతో రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ ఏడాది ఆరంభంలోనూ ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ భారత్ జట్టు ఓటమి తర్వాత పుంజుకుని సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
బెంగళూరు టెస్టులో టీమిండియా ఓటమికి కారణం తాను తీసుకున్న నిర్ణయాలేనని కెప్టెన్ రోహిత్ శర్మ నిజాయతీగా ఇప్పటికే అంగీకరించాడు. మ్యాచ్‌కి ముందు మబ్బులు పట్టిన వాతావరణం కనిపించినా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తన తప్పేనని ఒప్పుకున్నాడు.
బ్యాటింగ్‌లో నిరాశపరిచిన హిట్‌మ్యాన్
ఆ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ బౌలర్లు నిప్పులు చెరిగి భారత్ జట్టుని 32.1 ఓవర్లలోనే కూప్పకూల్చిన విషయం తెలిసిందే. ఎంతలా అంటే.. టీమ్‌లోని ఐదుగురు బ్యాటర్లు డకౌటవగా.. ఏకంగా 9 మంది కనీసం డబుల్ డిజిట్ స్కోరుని కూడా టచ్ చేయలేకపోయారు.
బెంగళూరు టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేశాడు. కానీ.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పేలవరీతిలో హిట్ మ్యాన్ వికెట్ చేజార్చుకున్నాడు. ఈ ఏడాదిలోనే ఆస్ట్రేలియా పర్యటన ఉండటంతో భారత్ జట్టు పుంజుకుని మళ్లీ లయని అందుకోవడం చాలా ముఖ్యం.