IND vs SA: రింకూ మెరుపులు: కోహ్లీని సమం చేసిన సూర్యకుమార్
IND vs SA 2nd T20: దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో భారత్ మంచి స్కోరు చేసింది. అయితే, వాన వల్ల కాసేపు అంతరాయం ఏర్పడటంతో మ్యాచ్ కుదింపు జరిగింది. ఆ వివరాలివే..
IND vs SA 2nd T20: దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా మంచి స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రాణించింది. భారత యంగ్ స్టార్ రింకూ సింగ్ (39 బంతుల్లోనే 68 పరుగులు; నాటౌట్) అజేయ మెరుపు అర్ధ శకతంతో మెరిపించాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56 పరుగులు) కూడా అర్ధ శతకంతో రాణించాడు. దీంతో, కుబెర్హాలో నేడు (డిసెంబర్ 12) దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లకు 180 రన్స్ చేసింది. అయితే, ఆ తర్వాత వాన పడటంతో కాస్త సమయం వృథా కావడంతో అంపైర్లు ఓవర్లను కుదించారు. 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా టార్గెట్‍ను 152 పరుగులుగా నిర్ణయించారు. వివరాలివే..
సూర్య, రింకూ అదుర్స్
ఈ మ్యాచ్‍లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‍కు దిగింది భారత్. అయితే, ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (0), శుభ్‍మన్ గిల్ (0) డకౌట్ అవడంతో టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత తిలక్ వర్మ (29) కాసేపు నిలకడగా ఆడాడు. అయితే అతడు ఆరో ఓవర్లో ఔటయ్యాడు.
అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, యంగ్ స్టార్ రింకూ సింగ్ అదరగొట్టారు. సూర్య ఆరంభంలో ఆచితూచి ఆడగా.. రింకూ మాత్రం దూకుడు చూపాడు. కాసేపటి తర్వాత సూర్య కూడా గేర్లు మార్చాడు. హిట్టింగ్ చేశాడు. ఈ క్రమంలో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు సూర్య కుమార్. దీంతో 11 ఓవర్లలోనే 100 పరుగులకు చేరింది భారత్ స్కోరు. సూర్య ఔటైనా.. రింకూ మాత్రం అదరగొట్టాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు. జితేశ్ శర్మ (1) విఫలమైనా చివర్లో రవీంద్ర జడేజా (19) కాసేపు నిలిచాడు. రింకూ అజేయంగా నిలిచాడు. 19.3 ఓవర్లో భారత్ 7 వికెట్లకు 180 రన్స్ చేసిన సమయంలో వాన వచ్చింది. సమయం వృథా అయింది. కుదించిన ఓవర్ల ప్రకారం.. దక్షిణాఫ్రికా ముందు 15 ఓవర్లలో 152 రన్స్ టార్గెట్ ఉంది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, లిజాడ్ విలియమ్స్, తబ్రైజ్ షంషి, ఐడెన్ మార్క్ రమ్ చెరో వికెట్ తీశారు.
కోహ్లీని సమం చేసిన సూర్య
ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ టీ20ల్లో 2,000 పరుగుల మార్కును భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ దాటాడు. 56 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఈ మార్కును చేరాడు. భారత స్టార్ విరాట్ కోహ్లీ కూడా అంతర్జాతీయ టీ20ల్లో 56వ ఇన్నింగ్స్‌లోనే 2,000 రన్స్ మార్క్ చేరాడు. దీంతో ఈ విషయంలో కోహ్లీని సూర్య సమం చేశాడు.
ఇక, అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్‌ల పరంగా వేగంగా 2,000 రన్స్ చేసిన బ్యాటర్లుగా తొలి స్థానంలో పాకిస్థాన్ ప్లేయర్లు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ఉన్నారు. వారిద్దరూ 52 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ చేరారు. ఈ 2వేల పరుగుల రికార్డు విషయంలో వారి తర్వాత కోహ్లీ, సూర్య నిలిచారు.
అలాగే, అంతర్జాతీయ టీ20ల్లో తక్కువ బంతుల్లో (1164) 2,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా సూర్య చరిత్ర సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో ఈ రెండో టీ20లోనే ఈ రికార్డు నెలకొల్పాడు.