IND vs BAN 2nd T20: రెండో టీ20లో భారత్ ఈ మార్పులు చేస్తుందా? తుదిజట్టు ఎలా ఉండొచ్చంటే.. లైవ్ వివరాలు-ind vs ban 2nd t20 team india predicted final playing xi tilak varma may get chance match live streaming details ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban 2nd T20: రెండో టీ20లో భారత్ ఈ మార్పులు చేస్తుందా? తుదిజట్టు ఎలా ఉండొచ్చంటే.. లైవ్ వివరాలు

IND vs BAN 2nd T20: రెండో టీ20లో భారత్ ఈ మార్పులు చేస్తుందా? తుదిజట్టు ఎలా ఉండొచ్చంటే.. లైవ్ వివరాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 08, 2024 09:46 PM IST

IND vs BAN 2nd T20: బంగ్లాదేశ్‍తో రెండో టీ20కి భారత్ రెడీ అయింది. సిరీస్‍ను కైవసం చేసుకునేందుకు ఉత్సాహంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో భారత్ ఏమైనా మార్పులు చేస్తుందా అనే విషయం ఆసక్తికరంగా ఉంది.

IND vs BAN 2nd T20: రెండో టీ20లో భారత్ ఈ మార్పులు చేస్తుందా? తుదిజట్టు ఎలా ఉండొచ్చంటే.. లైవ్ వివరాలు
IND vs BAN 2nd T20: రెండో టీ20లో భారత్ ఈ మార్పులు చేస్తుందా? తుదిజట్టు ఎలా ఉండొచ్చంటే.. లైవ్ వివరాలు (AP)

బంగ్లాదేశ్‍తో తొలి టీ20లో భారత్ దుమ్మురేపేలా గెలిచింది. బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్‍లో సత్తాచాటి బంగ్లాను చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో 49 బంతులు మిగిల్చి విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‍లో తొలి మ్యాచ్ గెలిచి టీమిండియా ఆధిపత్యం సాధించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య రేపు (అక్టోబర్ 9) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టీ20 జరగనుంది. ఈ పోరులోనూ గెలిచి ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను పక్కా చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా తహతహలాడుతోంది.

తిలక్ వర్మకు ప్లేస్ దక్కుతుందా?

రెండో టీ20 కోసం తుదిజట్టులో భారత్ ఏమైనా మార్పులు చేస్తుందా.. లేకపోతే తొలి మ్యాచ్ గెలిచిన విన్నింగ్ కాంబినేషన్‍నే కొనసాగిస్తుందా అనేది ఉత్కంఠగా ఉంది. అయితే, రెండో టీ20లో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మను తుదిజట్టులో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం వల్ల తొలి మ్యాచ్‍కు ముందే శివం దూబే సిరీస్‍కు దూరమవడంతో తిలక్‍కు ఛాన్స్ వచ్చింది.

తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో రెండో టీ20లో తిలక్ వర్మను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుది జట్టులో టీమిండియా ఈ మార్పు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. గత మ్యాచ్‍తోనే టీమిండియాలో నితీశ్ అరంగేట్రం చేశాడు. అయితే, ఈ సిరీస్‍లో ఎక్కువ మందిని ప్రయోగించాలని చూస్తున్న టీమిండియా మేనేజ్‍మెంట్ తిలక్‍కు తుది జట్టులో చోటు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. తిలక్‍కు తుది జట్టులో ప్లేస్ దక్కుతుందా.. నితీశ్‍కే ఛాన్స్ దొరుకుతుందా చూడాలి.

హర్షిత్ రాణా కూడా..

యంగ్ పేసర్ హర్షిత్ రాణా కూడా బంగ్లాతో టీ20 సిరీస్‍కు ఎంపికయ్యాడు. అయితే, తొలి మ్యాచ్‍లో తుది జట్టులో ప్లేస్ దొరకలేదు. దీంతో అరంగేట్రం కోసం అతడు ఎదురుచూస్తున్నాడు. రెండో టీ20లో హర్షిత్‍కు చోటు ఇచ్చేందుకు కూడా మేనేజ్‍మెంట్ ఆలోచించే అవకాశం ఉంది. ఇందుకోసం వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టు నుంచి తప్పించే ఛాన్స్ ఉంది. పిచ్ పరిస్థితిని బట్టి ఈ మార్పు ఉండొచ్చు. తొలి టీ20 ద్వారా అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ మంచి వేగంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఓ వికెట్ దక్కించుకున్నాడు.

బంగ్లాతో రెండో టీ20లో భారత తుదిజట్టు (అంచనా): సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి/ తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , వరుణ్ చక్రవర్తి

రెండో టీ20 టైమ్

టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 రేపు (అక్టోబర్ 9) సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. అందుకు అరగంట ముందు టాస్ పడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‍కు అనుకూలించే అవకాశం ఉంది.

లైవ్ వివరాలు

భారత్, బంగ్లాదేశ్ మధ్య ఈ రెండో టీ20 స్పోర్ట్స్18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‍ను వీక్షించొచ్చు.

Whats_app_banner