T20 World Cup Prize Money: వరల్డ్ కప్ విన్నర్‌గా టీమిండియాకు దక్కిన ప్రైజ్‌మనీ ఎంతంటే? - 2007తో పోలిస్తే డబుల్
T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచిన టీమ్ ఇండియాకు20.42 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్ సౌతాఫ్రికా 10.67 కోట్ల ప్రైజ్‌మనీ అందుకున్నది.
T20 World Cup Prize Money: టీ20 వరల్డ్ కప్ విన్నర్‌గా టీమిండియా నిలిచింది. 2007లో టీ20 కప్ గెలిచిన టీమిండియా మళ్లీ 17 ఏళ్ల తర్వాత టీ20 ఫార్మాట్‌లో విశ్వ విజేతగా నిలిచింది. శనివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో ఏడు పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకున్నది. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగింది.
30 బాల్స్...30 రన్స్...
సౌతాఫ్రికా విజయానికి చివరి ఐదు ఓవర్లలో 30 పరుగులు అవసరం కావడంతో సఫారీలే ఫైనల్‌లో గెలుస్తారని క్రికెట్ అభిమానులు భావించారు. చివరలో బుమ్రా, హార్దిక్ పాండ్య అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్ టీమిండియా సొంతమైంది. 16వ ఓవర్లో బుమ్రా కేవలం 4 పరుగులే ఇవ్వగా... 17వ ఓవర్లో జోరు మీద ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (52)ను ఔట్ చేసి సౌతాఫ్రికాకు షాకిచ్చాడు హార్దిక్ పాండ్య.
18వ ఓవర్లో జస్‍ప్రీత్ బుమ్రా కూడా ఓ వికెట్ తీయడమే కాకుండా రెండు పరుగులు మాత్రమే ఇవ్వడంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది. చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయానికి పదహారు పరుగులు అవసరం కాగా.. పాండ్య కేవలం ఎనిమిది రన్స్ మాత్రమే ఇచ్చాడు. పాండ్య వేసిన ఫస్ట్ బాల్‌ను సిక్సర్ కొట్టేందుకు మిల్లర్ ప్రయత్నించాడు. బౌండరీ లైన్‌లో సూర్యకుమార్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైంది. చివరి ఐదు ఓవర్లలో సౌతాఫ్రికా కేవలం 22 పరుగులు మాత్రమే చేసింది.
20 కోట్ల ప్రైజ్‌మనీ...
కాగా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు భారీ ప్రైజ్‌మనీ దక్కింది. 20.42 కోట్ల ప్రైజ్‌మనీని భారత జట్టు సొంతం చేసుకున్నది. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ విన్నర్‌గా నిలిచిన ఇండియాకు 9.84 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా...2024లో డబుల్ ప్రైజ్‌మనీ అందుకోవడం గమనార్హం.
సౌతాఫ్రికా ప్రైజ్‌మనీ...
2024 టీ20 వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా 10.67 కోట్ల ప్రైజ్‌మనీని అందుకున్నది. సెమీస్‌లో వెనుదిరిగిన ఇంగ్లండ్, ఆప్గానిస్థాన్‌లకు తలో 6.56 కోట్ల ప్రైమ్‌మనీ దక్కింది. సూపర్ 8 చేరుకున్న టీమ్‌లకు 3.18 కోట్ల ప్రైజ్‌మనీని ఐసీసీ అందజేసింది.
విన్నర్ ప్రైజ్‌మనీతోపాటు అదనంగా టీమిండియా లీగ్, సూపర్ 8 రౌండ్‌లో విజయాలకు గాను ఒక్కో మ్యాచ్‌కు 26 లక్షల వరకు ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నది.
బుమ్రాకు పన్నెండు లక్షలు...
టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొట్టిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు దక్కింది. ఈ వరల్డ్ కప్‌లో 4.17 ఎకానమీ రేటుతో 15 వికెట్లు తీశాడు బుమ్రా. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుకుగాను బుమ్రాకు పన్నెండు లక్షల ముప్పై వేల ప్రైజ్‌మనీ దక్కింది.
ఫైనల్‌లో హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డుకు గాను కోహ్లి నాలుగు లక్షల పదివేల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. చివరి ఓవర్‌లో అద్భుత క్యాచ్‌తో మెరిసిన సూర్యకుమార్ యాదవ్ స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డుకు గాను అతడికి రెండు లక్షల పదివేల ప్రైజ్‌మనీ అందింది.