Hardik Pandya on Rohit Sharma: అందులో ఇబ్బందేమీ లేదు: తన కెప్టెన్సీలో రోహిత్ ఆడనుండటంపై హార్దిక్ పాండ్యా రియాక్షన్
Hardik Pandya on Rohit Sharma: ఐపీఎల్లో తొలిసారి రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ఆడనుండటంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. అందులో వింతేమీ లేదని అతడు అనడం గమనార్హం.
Hardik Pandya on Rohit Sharma: ఐపీఎల్ 2024లో ఇప్పుడు అందరి కళ్లూ ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫ్రాంఛైజీ ఇప్పటికీ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడమే. దీనిపై అభిమానుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రాగా.. తొలిసారి హార్దిక్ పాండ్యా కూడా స్పందించాడు.
అందులో ఉన్న ఇబ్బంది ఏంటన్న పాండ్యా
ముంబై ఇండియన్స్ తోపాటు టీమిండియాలోనూ రోహిత్ శర్మ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా ఆడాడు. ఇప్పుడదే హార్దిక్ కెప్టెన్సీలో రోహిత్ ఆడాల్సి వస్తోంది. గతేడాది గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ ను తీసుకొచ్చి అతనికి కెప్టెన్సీ అప్పగించడంపై చాలా మంది అభిమానులు విమర్శలు గుప్పించారు. ముంబై ఇండియన్స్ ఫాలోవర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో హార్దిక్ ఈ కీలకమైన అంశంపై స్పందించాడు.
"ముందుగా ఇందులో తేడా ఏమీ లేదు. ఒకవేళ నాకు ఏదైనా సాయం అవసరం అయితే చేయడానికి అతడు సిద్ధంగా ఉంటాడు. అతను ఇండియన్ టీమ్ కెప్టెన్. అది కూడా నాకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే అతని కెప్టెన్సీలోనే ఈ టీమ్ ఈ స్థాయికి వచ్చింది. ఇప్పుడా ఘనతను నేను ముందుకు తీసుకెళ్తున్నాను. ఇందులో ఇబ్బందికరమైనది ఏదీ లేదు. ఇది చాలా మంది అనుభవం అవుతుంది. నా కెరీర్ అంతా అనతి కెప్టెన్సీలోనే ఆడాను. అతడు ఈ సీజన్ మొత్తం నాకు అండగా ఉంటాడన్న నమ్మకం నాకుంది" అని హార్దిక్ అన్నాడు.
ఫ్యాన్స్ ఆగ్రహంపై హార్దిక్ ఏమన్నాడంటే..
కెప్టెన్సీ మార్పుపై ముంబై ఇండియన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా హార్దిక్ స్పందించాడు. "కాస్త వ్యతిరేకత వచ్చింది. నిజాయతీగా చెప్పాలంటే అభిమానులను మేము గౌరవిస్తాం. అదే సమయంలో మేము ఆటపైనే దృష్టి సారిస్తాం. నా నియంత్రణలో ఉన్నవాటినే నియంత్రిస్తాను. నా కంట్రోల్లో లేని వాటిని పట్టించుకోను. అదే సమయంలో అభిమానులకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. వాళ్లకు వ్యతిరేకించడానికి పూర్తి హక్కు ఉంది. వాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తాను" అని హార్దిక్ అన్నాడు.
ఇక కెప్టెన్సీ మార్పు తర్వాత తాను ఇంత వరకూ రోహిత్ శర్మతో మాట్లాడలేదని కూడా హార్దిక్ పాండ్యా చెప్పాడు. సోమవారం (మార్చి 18) నుంచి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024 కోసం ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడనుంది. ఇప్పుడు టీమ్ తో రోహిత్ చేరిన తర్వాత మాట్లాడతానని హార్దిక్ తెలిపాడు.
"రోహిత్ తో మాట్లాడలేదు. అతడు ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. ఆడుతూనే ఉన్నాడు. రెండు నెలలుగా మేము కలవలేదు. ఐపీఎల్ ప్రారంభం కాగానే అతడు వస్తే మాట్లాడతా" అని హార్దిక్ చెప్పాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా హార్దిక్ కూడా ఒకసారి ట్రోఫీ గెలిచాడు. గతేడాది ఫైనల్లో ఓడి రన్నరప్ గా నిలిచాడు.