Hardik Pandya: ఐదు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పా.. కానీ: హార్దిక్ పాండ్యా
Hardik Pandya - Team India: వన్డే ప్రపంచకప్ సమయంలో తన గాయం, అప్పటి పరిస్థితుల గురించి హార్దిక్ పాండ్యా తాజగా మాట్లాడాడు. తన చీలమండకు మూడు ఇంజక్షన్లు చేయించుకోవడంతో పాటు రక్తాన్ని కూడా తొలగించాల్సి వచ్చిందని అన్నారు. మరిన్ని విషయాలు వెల్లడించాడు.
Hardik Pandya: ఐపీఎల్ 2024లో బరిలోకి దిగేందుకు భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రెడీ అయ్యాడు. గతేడాది అక్టోబర్ వన్డే ప్రపంచకప్‍లో బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో గాయపడిన పాండ్యా.. అప్పటి నుంచి టీమిండియాకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్ జట్టుకు పాండ్యా కెప్టెన్సీ చేయనున్నాడు. ఈ తరుణంలో వన్డే ప్రపంచకప్ సమయంలో గాయం సమయం జరిగిన పరిణామాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు హార్దిక్. ఆ వివరాలివే..
వన్డే ప్రపంచకప్‍లో బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో తన బౌలింగ్‍లోనే ఫీల్డింగ్ చేసే సమయంలో హార్దిక్ పాండ్యా కాలికి గాయమైంది. తన చీలమండ(యాంకిల్)పై ఒత్తిడి పడి.. విలవిల్లాడాడు. ఆ తర్వాత టోర్నీకి దూరమయ్యాడు. తాను గాయపడిన సమయంలో ఐదు రోజుల్లో తిరిగి వస్తానని టీమ్ సభ్యులతో చెప్పానని, కానీ అలా జరగలేదని స్టార్ స్పోర్ట్స్‌తో ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఏడాది నుంచి సన్నద్ధమయ్యా
తాను వన్డే ప్రపంచకప్ కోసం సంవత్సరం క్రితం నుంచే సన్నద్ధమయ్యాయని, కానీ గాయమైందని పాండ్యా చెప్పాడు. “టోర్నీకి 2,3 నెలల ముందు నుంచి నేను సన్నద్దమవలేదు. ప్రపంచకప్ కోసం సంవత్సరం కింది నుంచే ప్రిపేర్ అయ్యా. చాలా విషయాలను ప్లాన్ చేసుకున్నా. కానీ ఊహించని విధంగా గాయపడ్డా. నేను గాయపడినప్పుడు అది 25 రోజులే ఉంటుందనుకున్నా.. కానీ అది చాలా కాలం కొనసాగింది. కానీ నేను చాలా కష్టపడ్డా. నేను జట్టు నుంచి బయటికి వచ్చే సమయంలో 5 రోజుల్లోనే తిరిగి వస్తానని చెప్పా” అని పాండ్యా అన్నాడు.
రక్తాన్ని తొలగించాల్సి వచ్చింది
“నా యాంకిల్‍పై మూడు చోట్ల ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది. ఎక్కువగా వణుకు వస్తుండటంతో చీలమండ నుంచి రక్తాన్ని తొలగించాల్సి వచ్చింది. ఏ దశలోనూ నేను పట్టు విడువకూడదని అనుకున్నా. అయితే, అలాగే తీవ్ర ఒత్తిడితో కోలుకునేందుకు ప్రయత్నిస్తే.. ఎక్కువ కాలం ఆటకు దూరమయ్యే ప్రమాదం కూడా రావొచ్చని అనిపించింది” అని పాండ్యా చెప్పాడు. అయితే, ప్రపంచకప్ ఆడేలా గాయం నుంచి కోలుకునే అవకాశం ఉందేమోననే తాను తీవ్రంగా కోలుకునే ప్రయత్నాలు చేశానని పాండ్యా తెలిపాడు.
బంగ్లాదేశ్‍తో మ్యాచ్ తర్వాత వన్డే ప్రపంచకప్ మొత్తానికి హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికా పర్యటన, ఆఫ్గానిస్థాన్‍తో టీ20 సిరీస్‍లు కూడా మిస్ అయ్యాడు. నాలుగు నెలలు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే డీవై పాటిల్ టోర్నమెంట్ ద్వారా మళ్లీ మైదానంలోకి దిగాడు. ఇప్పుడు పూర్తి ఫిట్‍నెస్ సాధించాడు. అయితే, తాను కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన సమయంలో తాను కనీసం నడవలేకపోయానని తెలిపాడు.
“నేను కోలుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో.. గాయం తిరగబెట్టి మూడు నెలలు కొనసాగంది. నేను నడవలేకపోయాను. అయినా పరుగెత్తేందుకు ప్రయత్నించా. కమ్‍బ్యాక్ ఇవ్వాలని తీవ్రంగా శ్రమించా. దేశం కోసం ఆడడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. స్వదేశంలో ప్రపంచకప్‍ను నేను మిస్ అయ్యా. ఇది నా హృదయాన్ని చాలా బాధించింది” అని పాండ్యా చెప్పాడు.
2023 వన్డే ప్రపంచకప్‍లో ఫైనల్ వరకు వెళ్లింది టీమిండియా. అయితే, తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ చేజార్చుకుంది.
ముంబై కెప్టెన్‍గా పాండ్యా
ఐపీఎల్ 2024 సీజన్ కోసం జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‍గా నియమించింది ముంబై ఇండియన్స్. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకొని మరీ కెప్టెన్‍ను చేసింది ఫ్రాంచైజీ. దీంతో ముంబై జట్టుకు మళ్లీ తిరిగి వచ్చేశాడు పాండ్యా. రోహిత్ శర్మను తప్పించి మరీ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చింది ముంబై మేనేజ్‍మెంట్. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. మార్చి 24న ఈ సీజన్‍లో ముంబై తొలి మ్యాచ్ ఆడనుంది.