IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య వామప్ మ్యాచ్ వర్షార్పణం.. టాస్ పడినా..
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య నేడు వామప్ మ్యాచ్ రద్దయింది. టాస్ తర్వాత విపరీతంగా వర్షం పడటంతో ఆట సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా, నెదర్లాండ్ మ్యాచ్‍కు కూడా వాన ఆటంకంగా మారింది.
IND vs ENG: భారత్ వేదికగా మరో ఐదు రోజుల్లో వన్డే ప్రపంచకప్ (అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19) మొదలుకానుండగా.. వర్షం భయపెడుతోంది. టోర్నీకి ముందు వామప్ మ్యాచ్‍లకు వాన ఇబ్బందిగా మారింది. గువహాటి వేదికగా నేడు (సెప్టెంబర్ 30) భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వామప్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. టాస్ పడే వరకు పరిస్థితి బాగానే ఉండగా.. ఆ తర్వాత హోరు వాన పడింది. భారీ వర్షం కురవడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో ఈ వామప్ మ్యాచ్‍ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అంపైర్లు. దీంతో.. టాస్ గెలిచి భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నా.. వాన వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే ఈ మ్యాచ్ రద్దయింది.
వన్డే ప్రపంచకప్ కోసం టీమ్ కాంబినేషన్‍ను సెట్ చేసుకునేందుకు, మ్యాచ్ ప్రాక్టీస్ ఉండేందుకు ఈ వామప్ మ్యాచ్ ఉపయోగపడుతుందని భారత్, ఇంగ్లండ్ ఆశించాయి. అయితే, వాన వల్ల మ్యాచ్ రద్దయింది. అయితే, ఇటీవల టీమిండియా చాలా మ్యాచ్‍లు ఆడటంతో బాగానే సన్నద్ధతగా ఉంది. మరోవైపు, ఆటగాళ్లంతా పూర్తి ఫిట్‍నెస్‍తోనే ఉన్నారని ఈ మ్యాచ్ టాస్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
వరల్డ్ కప్ డిఫెండింగ్ చాంపియన్ టీమ్ ఇంగ్లండ్.. 38 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత భారత్‍కు శుక్రవారం చేరుకుంది. ఈ ప్రయాణం చాలా ఇబ్బందికరంగా సాగిందని ఇంగ్లండ్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో ఇన్‍స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాడు. అక్టోబర్ 2న బంగ్లాదేశ్‍తో గువహటిలోనే మరో వామప్ మ్యాచ్ ఆడనుంది ఇంగ్లండ్.
భారత్, నెదర్లాండ్ మధ్య అక్టోబర్ 3న తిరువనంతపురంలో వామప్ మ్యాచ్ జరగనుంది. దీంతో అక్కడికి బయలుదేరనుంది భారత జట్టు. తిరువనంతపురంలోనూ వాన ముప్పు ఉండే ఛాన్స్ ఉంది.
ఆస్ట్రేలియా మ్యాచ్‍కు కూడా..
ఆస్ట్రేలియా, నెదర్లాండ్ మధ్య నేడు (సెప్టెంబర్ 30) తిరువనంతపురం వేదికగా ప్రపంచకప్ వామప్ మ్యాచ్ జరగాల్సింది. అయితే, టాస్ పడకుండానే ఈ మ్యాచ్‍కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో ఆట ఇంకా మొదలుకాలేదు. శుక్రవారం ఇదే వేదికలో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ మధ్య వామప్ మ్యాచ్ కూడా వాన కారణంగానే రద్దయింది.