IND vs SA 2nd T20: టీమిండియాకు నిరాశ.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి
IND vs SA 2nd T20: దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియాకు ఆదిలోనే నిరాశ ఎదురైంది. రెండో టీ20లో భారత్‍పై ఆతిథ్య సఫారీ జట్టు విజయం సాధించింది.
IND vs SA 2nd T20: దక్షిణాఫ్రికా పర్యటనను నిరాశాజనకంగా ఆరంభించింది భారత జట్టు. మూడు టీ20ల సిరీస్‍లో వాన వల్ల మొదటి మ్యాచ్ రద్దు కాగా.. నేడు (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఈ టూర్‌ను పరాజయంతో భారత్ మొదలుపెట్టినట్టయింది. క్యెబెర్హా వేదికగా నేడు జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో (డీఎల్ఎస్ పద్ధతి) భారత్‍పై విజయం సాధించింది.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 180 పరుగులు సాధించింది. భారత యంగ్ స్టార్ హిట్టర్ రింకూ సింగ్ (39 బంతుల్లో 68 పరుగులు; నాటౌట్) అద్భుత అర్ధ శకతం చేయగా.. సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 56 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోట్జీ మూడు వికెట్లతో రాణించగా.. జాన్సెన్, విలియమ్స్, షంషి, మార్క్‌రమ్ చెరో వికెట్ తీసుకున్నారు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసేందుకు 3 బంతులు మిగిలి ఉండగానే వర్షం జోరున కురిసింది. దీంతో కాసేపు అంతరాయం ఏర్పడింది.
వాన వల్ల ఓవర్లను కుదించటంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి (డీఎల్ఎస్) ప్రకారం దక్షిణాఫ్రికా ముందు 15 ఓవర్లలో 152 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ లక్ష్యాన్ని 7 బంతులు మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా ఛేదించింది. సఫారీ బ్యాటర్లలో ఓపెనర్ రెజా హెన్‍డ్రిక్స్ (49), కెప్టెన్ ఐడెన్ మార్క్ రమ్ (30) సత్తాచాటారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (17), టిస్టన్ స్టబ్స్ (14 నాటౌట్) రాణించారు. దీంతో 13.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 రన్స్ చేసిన దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
కొంప ముంచిన వాన!
భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‍కు చెరో వికెట్ దక్కింది. భారత బ్యాటింగ్ తర్వాత వర్షం పడడం పెద్ద ప్రతికూలతగా మారింది. ఔట్ ఫీల్డ్ తడిగా మారటంతో టీమిండియా బౌలర్లు, ఫీల్డర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. స్పిన్నర్లకు బాల్ గ్రిప్ కాలేదు. అలాగే, దక్షిణాఫ్రికా ముందు 15 ఓవర్లే ఉండటంతో ఆ జట్టు బ్యాటర్లు ఆది నుంచి దూకుడుగా ఆడే ఛాన్స్ దక్కింది. మొత్తంగా భారత్ ఓడిపోవటంతో.. రింకూ సింగ్ మెరుపు అర్ధ శతకం వృథా అయింది.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈ సిరీస్‍లో చివరిదైన మూడో టీ20 గురువారం (డిసెంబర్ 14) జరగనుంది. సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా ఈ మ్యాచ్ గెలిస్తే.. సిరీస్ సమం అవుతుంది. లేకపోతే సఫారీలకే వెళుతుంది.
టీ20 సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, రెండు టెస్టు సిరీస్‍లను భారత్ ఆడనుంది. వన్డే సిరీస్‍కు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయనున్నారు.