Ashwin in World Cup Team: వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్ వచ్చేశాడు.. అక్షర్ పటేల్ ఔట్
Ashwin in World Cup Team: ఇండియా వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్ వచ్చేశాడు. గాయంతో అక్షర్ పటేల్ ఔటవడంతో అతని స్థానంలో సెలక్టర్లు 15 మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నారు.
Ashwin in World Cup Team: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మూడో వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. చివరి నిమిషంలో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్ ను సెలక్టర్లు ఎంపిక చేయడం విశేషం. వరల్డ్ కప్ లో ఆడబోయే తుది 15 మంది సభ్యుల జట్టును అనౌన్స్ చేయడానికి గురువారం (సెప్టెంబర్ 28) చివరి తేదీ కావడంతో ఈ ఒక్క మార్పుతో ఇండియా మరోసారి టీమ్ అనౌన్స్ చేసింది.
ఆసియా కప్ లో అక్షర్ పటేల్ గాయపడటం, ఆ తర్వాత అశ్విన్ ను ఆస్ట్రేలియాతో మూడో వన్డేల సిరీస్ కు ఎంపిక చేయడంతోనే అతడు వరల్డ్ కప్ జట్టులోకి రావడం ఖాయమన్న అంచనాలు ఏర్పడ్డాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలు ఆడిన అశ్విన్.. మొత్తంగా నాలుగు వికెట్లు తీసుకొని సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకోవడానికి మరో మూడు వారాలు పట్టనుండటంతో అతన్ని తప్పించాల్సి వచ్చింది.
అయితే ఈ 15 మంది సభ్యుల తుది జట్టును ఎంపిక చేయకముందే టీమ్ తో కలిసి అశ్విన్ తొలి వామప్ మ్యాచ్ జరిగే గువాహటికి వెళ్లాడు. అప్పుడే అతడు వరల్డ్ కప్ జట్టులోకి రావడం ఖాయమని తేలిపోయింది. ఇంగ్లండ్ తో ఇండియా తొలి వామప్ మ్యాచ్ ను శనివారం (సెప్టెంబర్ 30) ఆడనుంది. టీమిండియాలో జరిగిన ఈ మార్పుకు సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
"వరల్డ్ కప్ సమయానికి అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకోలేకపోయాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అతని స్థానంలో జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో రెండు మ్యాచ్ లలో నాలుగు వికెట్లు తీసి అతడు ఆకట్టుకున్నాడు" అని ఐసీసీ తెలిపింది. నిజానికి ఆసియా కప్ ఫైనల్ కోసమే అశ్విన్ కు రావాలని పిలుపు అందినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ సమయానికి అతడు మ్యాచ్ ఫిట్ గా లేకపోవడంతో శ్రీలంక రాలేనని తేల్చి చెప్పాడు. అప్పుడే తాను కూడా అశ్విన్ తో ఫోన్లో మాట్లాడినట్లు కెప్టెన్ రోహిత్ చెప్పడం, ఆ వెంటనే ఆస్ట్రేలియా సిరీస్ కు అశ్విన్ ను ఎంపిక చేయడంతో అతడు వరల్డ్ కప్ టీమ్ లోకి వచ్చేసినట్లేనని క్రికెట్ పండితులు తేల్చేశారు. ఇండియా వరల్డ్ కప్ లో తన తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న ఆడనుంది.
అశ్విన్ 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆ తర్వాత 2015 వరల్డ్ కప్ లోనూ ఆడాడు. ఆ టోర్నీలో అతడు 13 వికెట్లు తీసుకున్నాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ వరకూ ఆడినా.. తర్వాత వన్డేల్లోకి ఎంపిక కాలేదు. 2022లో సౌతాఫ్రికాతో ఓ వన్డే ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఈ మధ్యే ఆస్ట్రేలియాతో రెండు వన్డేలకు తుది జట్టులో ఉన్నాడు. 2019 వరల్డ్ కప్ కూడా అశ్విన్ ఆడలేదు.
ఇండియా వరల్డ్ కప్ టీమ్ ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్