India vs Australia 3rd ODI: వరల్డ్ కప్‌కు ముందు చివరి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. చేతులెత్తేసిన బ్యాటర్లు-india lost to australia in 3rd odi batters failed to impres cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia 3rd Odi: వరల్డ్ కప్‌కు ముందు చివరి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. చేతులెత్తేసిన బ్యాటర్లు

India vs Australia 3rd ODI: వరల్డ్ కప్‌కు ముందు చివరి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. చేతులెత్తేసిన బ్యాటర్లు

Hari Prasad S HT Telugu
Sep 27, 2023 09:37 PM IST

India vs Australia 3rd ODI: వరల్డ్ కప్‌కు ముందు చివరి మ్యాచ్‌లో ఓడింది టీమిండియా. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పరాజయం పాలైంది.

ఔటై వెళ్తున్న రోహిత్ శర్మ వెన్ను తడుతున్న విరాట్ కోహ్లి
ఔటై వెళ్తున్న రోహిత్ శర్మ వెన్ను తడుతున్న విరాట్ కోహ్లి (ANI)

India vs Australia 3rd ODI: ఆస్ట్రేలియాపై ఇప్పటికే సిరీస్ గెలిచిన టీమిండియా చివరి వన్డేలో ఓటమి పాలైంది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి చెలరేగినా.. భారీ లక్ష్య ఛేదనలో మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా స్పిన్నర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్ తో విఫలమైనా.. నాలుగు వికెట్లు తీసి ఇండియా ఓటమిలో కీలకపాత్ర పోషించాడు.

353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్.. చివరికి 286 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 66 పరుగులతో గెలిచింది. అయితే మూడు వన్డేల సిరీస్ మాత్రం 2-1తో ఇండియా వశమైంది. రోహిత్ శర్మ 57 బంతుల్లోనే 6 సిక్స్ లు, 5 ఫోర్లతో 81 రన్స్ చేశాడు. ఇక విరాట్ కోహ్లి 56 రన్స్ చేసి కీలకమైన సమయంలో ఔటయ్యాడు. రోహిత్, వాషింగ్టన్ సుందర్ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించినా.. తర్వాత రోహిత్, విరాట్ మంచి భాగస్వామ్యంతో ఆశలు రేపినా.. రెగ్యులర్ గా వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు.

రెండో వన్డేలో సెంచరీతో గాడిలో పడిన శ్రేయస్ అయ్యర్ కూడా 48 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ (26), సూర్యకుమార్ (8) నిరాశ పరిచారు. చివర్లో కాస్త బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన రవీంద్ర జడేజా 35 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మ్యాక్స్‌వెల్ 4, హేజిల్‌వుడ్ 2, స్టార్క్, కమిన్స్, గ్రీన్, సంఘా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

దంచికొట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు

అంతకుముందు ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగిపోయారు. రెండో వన్డేలో ఇండియా బ్యాటర్లు కొట్టిన భారీ స్కోరుకు ప్రతీకారం తీర్చుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. 7 వికెట్లకు 352 రన్స్ చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లతోపాటు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్ల దెబ్బకు టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 10 ఓవర్లలో ఏకంగా 81 పరుగులు సమర్పించుకున్నాడు.

అయితే అతడు మూడు వికెట్లు కూడా తీయడం విశేషం. ఓపెనర్ మిచెల్ మార్ష్ 84 బంతుల్లోనే 96 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక స్మిత్ 73, లబుషేన్ 72, వార్నర్ 56 పరుగులు చేశారు. మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా బ్యాటర్లు ఇండియా బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచారు. 8 ఓవర్లలోనే తొలి వికెట్లకు 78 పరుగులు జోడించిన తర్వాత వార్నర్ ఔటయ్యాడు.

అయితే ఆ తర్వాత వచ్చిన స్మిత్ కూడా ఎదురుదాడికి దిగడంతో ఆస్ట్రేలియా సులువుగా పరుగులు చేస్తూ వెళ్లింది. రెండో వికెట్ కు మార్ష్, స్మిత్.. 137 రన్స్ జోడించారు. వాషింగ్టన్ సుందర్ మినహాయించి.. టీమిండియాలోని ప్రతి బౌలర్ ఓవర్ కు ఆరుకుపైగా రన్స్ ఇచ్చారు. కుల్దీప్ యాదవ్ 6 ఓవర్లలో 48 రన్స్ ఇవ్వగా.. సిరాజ్ 9 ఓవర్లలో 68 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాజ్‌కోట్ లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. రెండో వన్డేలో ఇండియా 399 రన్స్ చేయగా.. ఆస్ట్రేలియా ఇప్పుడు 352 రన్స్ చేసింది.

Whats_app_banner