EPFO Money withdraw: ఈపీఎఫ్ఓ అకౌంట్ నుంచి డబ్బు విత్ డ్రా చేయాలా?.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
EPFO Money withdrawal: ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం ఉపయోగపడాలన్న లక్ష్యంతో ఉద్యోగుల భవిష్య నిథి (employee provident fund) పథకాన్ని ప్రారంభించారు. అయితే, కొన్ని అత్యవసర పరిస్థితుల్లో రిటైర్మెంట్ కన్నా ముందే ఈపీఎఫ్ఓ ఖాతా నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
EPFO Money withdrawal: ఈపీఎఫ్ఓ ఖాతాలోని నగదును విత్ డ్రా (EPFO withdraw) చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి. సాధారణంగా, ఎవరైనా, EPF ఖాతాలో మొత్తాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. అయితే, ఈ క్రింది రెండు పరిస్థితులలో మాత్రమే EPF లో నగదును పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.
అవి 1) ఈపీఎఫ్ఓ (EPFO) లో చందాదారుడిగా ఉన్న ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు, ఆ ఉద్యోగి తన ఈపీఎఫ్ఓ లోని మొత్తం నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.
2) ఒక వ్యక్తి ఒక నెల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నప్పుడు, అతను/ఆమె తన ఈపీఎఫ్ఓ అకౌంట్ లో ఉన్న డబ్బులో 75% విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ వ్యక్తి రెండు నెలలకు మించి నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25% కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. నెల లోపే ఉద్యోగం మారితే, కొత్త యజమాని వద్ద చేరితే ఈపీఎఫ్ఓ (EPFO) లోని మొత్తాన్ని విత్ డ్రా చేసుకోలేరు.
EPF పాక్షిక ఉపసంహరణకు షరతులు
EPF బ్యాలెన్స్ పాక్షిక ఉపసంహరణ కొన్ని పరిస్థితులలో మాత్రమే సాధ్యమవుతుంది. వీటిలో-వైద్య అవసరాలు, వివాహం, విద్య, భూమి కొనుగోలు, ఇంటి కొనుగోలు/నిర్మాణం, గృహ రుణం చెల్లింపు, ఇంటి పునర్నిర్మాణం, పదవీ విరమణకు ముందు పాక్షిక ఉపసంహరణ మొదలైనవి ఉన్నాయి.
యూనివర్సల్ అకౌంట్ నంబర్
ఈపీఎఫ్ఓలో చేరిన ప్రతీ వ్యక్తికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ప్రత్యేక నంబర్ ను కేటాయిస్తుంది. ఆ నంబర్ ను UAN (Universal Account Number) అంటారు. అంటే PF చట్టం కింద ఉన్న ఉద్యోగులందరికీ ఈ యూనివర్సల్ అకౌంట్ నంబర్ తప్పనిసరి. ఉద్యోగి EPF ఖాతాకు ఈ UAN ను లింక్ చేస్తారు . UAN ఉద్యోగి జీవితకాలం మొత్తం పోర్టబుల్‌గా ఉంటుంది. అంటే, ఆ ఉద్యోగి జాబ్ మారినప్పటికీ.. యూఏఎన్ అదే ఉంటుంది.
ఆన్ లైన్ లో ఈపీఎఫ్ విత్ డ్రా చేయడం ఎలా?
EPF పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో EPF అకౌంట్ నుంచి డబ్బును విత్ డ్రా చేయడానికి దరఖాస్తు చేయడానికి, ఈ క్రింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా, ఆ ఉద్యోగి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేసి ఉండాలి. UAN తో లింక్ చేసి ఉన్నమొబైల్ నంబర్ వర్కింగ్ కండిషన్‌లో ఉండాలి.
- UAN తో మీ KYC, అంటే ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, IFSC కోడ్‌తో లింక్ చేసి ఉండాలి.
- అవి సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత, ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- EPF UAN పోర్టల్‌ని సందర్శించండి.
- మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. క్యాప్చాను నమోదు చేసి, 'సైన్ ఇన్' బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు వంటి మీ KYC వివరాలు అప్ డేటెడ్ గా ఉన్నాయో, లేదో చెక్ చేయడానికి 'మేనేజ్' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'KYC'ని ఎంచుకోండి.
- ఆ తర్వాత, 'ఆన్‌లైన్ సేవలు' ట్యాబ్‌కు వెళ్లి, డ్రాప్-డౌన్ మెను నుండి 'క్లెయిమ్ (ఫారం-31, 19 10C & 10D)' ఆప్షన్ ను ఎంచుకోండి.
- స్క్రీన్ పై సభ్యుల వివరాలు, KYC వివరాలు మొదలైనవి కనిపిస్తాయి.
- మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి, ‘వెరిఫై’పై క్లిక్ చేయండి.
- అండర్‌టేకింగ్ సర్టిఫికేట్‌పై సంతకం చేయడానికి ‘అవును’పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు, ‘ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్’పై క్లిక్ చేయండి.
- క్లెయిమ్ ఫారమ్‌లో, మీకు అవసరమైన క్లెయిమ్‌ను ఎంచుకోండి. అంటే ఫుల్ EPF సెటిల్‌మెంట్, లేదా పార్షియల్ EPF సెటిల్ మెంట్ వంటివి.
- ఆపై, మీ ఫండ్‌ను ఉపసంహరించుకోవడానికి ‘PF అడ్వాన్స్ (ఫారం 31)’ ఎంచుకోండి. అవసరమైన వివరాలను ఫిల్ చేయండి.
- సర్టిఫికెట్‌పై క్లిక్ చేసి, మీ దరఖాస్తును సమర్పించండి. మీరు ఫారమ్‌ను పూరించిన ప్రయోజనం కోసం స్కాన్ చేసిన పత్రాలను సమర్పించమని మిమ్మల్ని అడగవచ్చు.
EPF ఉపసంహరణకు అవసరమైన పత్రాలు
- PF మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి క్రింది పత్రాలు అవసరం అవుతాయి.
- యూనివర్సల్ ఖాతా సంఖ్య (UAN).
- గుర్తింపు రుజువు, చిరునామా రుజువు
- IFSC కోడ్, ఖాతా నంబర్ ఉన్న రద్దు చేసిన చెక్
- EPF చందాదారుల బ్యాంక్ ఖాతా సమాచారం.