Linking EPF UAN with mobile number: మీ ఈపీఎఫ్ యూఏఎన్ ను మొబైల్ నంబర్ తో లింక్ చేశారా?.. ఇలా ఈజీగా చేసేయండి..
ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్ లో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF). ఈ ఫండ్ ద్వారా ఉద్యోగులు రిస్క్ లేని రిటర్న్స్ ను పొందుతారు. అదే సమయంలో, ఈపీఎఫ్ మొత్తంపై ఆకర్షణీయమైన వడ్డీ కూడా లభిస్తుంది.
భవిష్యత్ అవసరాలకు ఈపీఎఫ్ (employee provident fund EPF) లో పెట్టుబడులు సురక్షితం. సాధారణంగా ఉద్యోగి తాను ఉద్యోగం చేసిన కంపెనీ ద్వారా ఒక ఈపీఎఫ్ ఖాతా లభిస్తుంది. అలా, ఆ ఉద్యోగి ఎన్ని కంపెనీల్లో ఉద్యోగం చేస్తే, అన్ని ఈపీఎఫ్ ఖాతాలు ఉంటాయి. వాటికి వేర్వేరు ఈపీఎఫ్ నంబర్లు ఉంటాయి. వేర్వేరుగా వీటి నిర్వహణ కొంత కష్టం. అందువల్ల ప్రభుత్వం యూఏఎన్ (Universal Account Number UAN) సిస్టమ్ ను తీసుకువచ్చింది.
యూనివర్సల్ అకౌంట్ నంబర్
ఒక ఉద్యోగికి చెందిన వేర్వేరు ఈపీఎఫ్ (EPF) ఖాతాల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం యూఏఎన్ (Universal Account Number UAN) సిస్టమ్ ను తీసుకువచ్చింది. పీఎఫ్ ఖాతా ఉన్న ఒక్కో ఉద్యోగికి ఒక యూఏఎన్ ను కేటాయిస్తారు. యూఏఎన్ అనేది ఒక 12 అంకెల సంఖ్య. ఆ ఉద్యోగి ఎన్ని కంపెనీల్లో జాబ్ చేసినా, ఎన్ని ఈపీఎఫ్ ఖాతాలు ఉన్నా.. అవన్నీ కూడా ఆ ఉద్యోగికి కేటాయించిన యూఏఎన్ కు (Universal Account Number UAN) అనుసంధానిస్తారు. దాంతో, ఆ ఒక్క యూఏఎన్ సహాయంతో ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాను నిర్వహించుకోవచ్చు. ఈ యూఏఎన్ సహాయంతో ఈ పీఎఫ్ ఖాతా వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. మీ అకౌంట్ లో ఉన్న బాలెన్స్ ను, లావాదేవీల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఆన్ లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు.
మొబైల్ నంబర్ తో అనుసంధానం
అయితే, ఎప్పటికప్పుడు ఈ పీఎఫ్ ఖాతాల వివరాలను తెలుసుకోవడం కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ను మీ యూఏఎన్ తో అనుసంధానించుకోవడం అవసరం . మీ యూఏఎన్ నంబర్ ను మీ మొబైల్ నంబర్ తో అనుసంధానించుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకోండి..
- ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ను ఓపెన్ చేయాలి.
- యూఏఎన్ నంబర్ ను, పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
- ఒకవేళ ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకోనట్లయితే,ముందుగా మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
- “Manage” సెక్షన్ లోకి వెళ్లాలి.
- “Contact Details” ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
- “Change Mobile Number” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. రీ కన్ఫర్మేషన్ కోసం మరోసారి ఆ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
- “Get Authorisation PIN” బటన్ పై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. దాంతో, మీ మొబైల్ నంబర్, మీ యూఏఎన్ నంబర్ అనుసంధానం పూర్తవుతుంది.