EPFO claim: మూడో వంతు క్లెయిమ్ లను తిరస్కరిస్తున్న ఈపీఎఫ్ఓ..
తమకు అందే క్లెయిమ్ దరఖాస్తుల్లో మూడో వంతు క్లెయిమ్ లను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తిరస్కరిస్తోంది. గత ఐదేళ్లలో ఈ తిరస్కరణ శాతం 13 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారుల నుంచి తమకు వచ్చిన ప్రతి మూడో క్లెయిమ్ ను తిరస్కరించిందని తేలింది. ఈపీఎఫ్ఓ లో 27.7 కోట్ల ఖాతాలున్నాయి. ఈ సంస్థకు దాదాపు రూ.20 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉంది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థ. క్లెయిమ్ సెటిల్మెంట్లలో జరుగుతున్న జాప్యంపై పలువురు చందాదారులు తమ ఫిర్యాదులను ఈపీఎఫ్ఓ అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో లేవనెత్తారు.
కనీసం 20 రోజులు..
క్లెయిమ్ సెటిల్మెంట్ లలో జరుగుతున్న జాప్యంపై చందాదారులకు వివరణ ఇచ్చే ప్రయత్నాన్ని ఈపీఎఫ్ఓ చేసింది. పూర్తిగా నింపిన చందాదారుల క్లెయిమ్ దరఖాస్తు సంబంధిత ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వచ్చిన తరువాత, ఆ క్లెయిమ్ ను పరిష్కరించడానికి లేదా పీఎఫ్ మొత్తాన్ని విడుదల చేయడానికి సాధారణంగా 20 రోజులు పడుతుందని ఈపీఎఫ్ఓ వివరించింది.
73.87 లక్షల క్లెయిమ్స్..
2022-23 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం మొత్తం 73.87 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 33.8 శాతం (24.93 లక్షలు) క్లెయిమ్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. అదే సమయంలో 46.66 లక్షల క్లెయిమ్స్ ను సెటిల్ చేయగా, 2.18 లక్షల ఖాతాలు క్లోజింగ్ బ్యాలెన్స్ గా మిగిలిపోయాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈపీఎఫ్ఓ (EPFO) క్లెయిమ్ తిరస్కరణ రేటు 2017-18, 2018-19లో వరుసగా 13 శాతం, 18.2 శాతంగా ఉంది. అలాగే, 2019-20 లో అది 24.1 శాతానికి, 2020-21లో 30.8 శాతానికి పెరిగింది. 2021-22 నాటికి ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్ ల తిరస్కరణ రేటు 35.2 శాతానికి పెరిగింది. అంటే పెన్షన్ సంస్థకు వచ్చిన మొత్తం క్లెయిమ్ ల సంఖ్యలో తిరస్కరణకు గురైన క్లెయిమ్ ల సంఖ్య మూడింట ఒక వంతు కంటే ఎక్కువ.
ఒత్తిడిలో పనిచేయడం
ఇదిలావుండగా, తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అధికారులు గత అక్టోబర్ లో ఆందోళన వ్యక్తం చేశారు. క్లెయిమ్ సెటిల్మెంట్ గడువు నిర్దేశిత 20 రోజుల కాలపరిమితికి మించితే, ఆ జాప్యానికి సంబంధిత అధికారి బాధ్యత వహించాలన్న ఈపీఎఫ్ఓ నిబంధన వల్ల ఈ ఒత్తిడి ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యకు ప్రధాన కారణం సంస్థ కాలం చెల్లిన ఐటీ వ్యవస్థ అని ఈపీఎఫ్ఓ సిబ్బంది విమర్శిస్తున్నారు.
వడ్డీ ప్రకటన
ఈపీఎఫ్ బాలెన్స్ పై 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వార్షిక వడ్డీ రేటుతో వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేయాలని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ట్రస్టీలు ఫిబ్రవరి 10న సిఫారసు చేశారు.