BSNL 4G, 5G SIM: త్వరలో బీఎస్ఎన్ఎల్ నుంచి యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్; ఎక్కడైనా యూజ్ చేయొచ్చు..-bsnl to launch universal 4g and 5g sim with no geographical restriction ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl 4g, 5g Sim: త్వరలో బీఎస్ఎన్ఎల్ నుంచి యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్; ఎక్కడైనా యూజ్ చేయొచ్చు..

BSNL 4G, 5G SIM: త్వరలో బీఎస్ఎన్ఎల్ నుంచి యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్; ఎక్కడైనా యూజ్ చేయొచ్చు..

HT Telugu Desk HT Telugu
Aug 10, 2024 03:05 PM IST

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) త్వరలో 4జీ, 5జీ రెడీ సిమ్ ప్లాట్ఫామ్ ను ప్రవేశపెట్టనున్నట్లు టెలికమ్యూనికేషన్ల శాఖ శనివారం వెల్లడించింది. ఈ సిమ్ ను భౌగోళిక పరిమితులు లేకుండా, ఎక్కడైనా ఉపయోగించవచ్చని తెలిపింది.

త్వరలో బీఎస్ఎన్ఎల్ నుంచి యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్
త్వరలో బీఎస్ఎన్ఎల్ నుంచి యూనివర్సల్ 4జీ, 5జీ సిమ్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో 4జీ, 5జీ రెడీ సిమ్ ప్లాట్ఫామ్ ను అందుబాటులోకి తీసుకురానుందని టెలికమ్యూనికేషన్ల శాఖ తెలిపింది. 4జీ, 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల వినియోగదారులు తమ మొబైల్స్ లో భౌగోళిక పరిమితులు లేకుండా, ఎక్కడైనా సిమ్ లను రీప్లేస్ చేసుకోవడానికి వీలవుతుందని సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది.

ఎక్కడైనా.. ఎప్పుడైనా..

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 4జీ, 5జీ కంపాటబుల్ ఓవర్ ది ఎయిర్ (OTA), యూనివర్సల్ సిమ్ (U SIM) ప్లాట్ఫామ్ లను అందుబాటులోకి తీసుకురానుందని, ఇది బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారులు తమ మొబైల్ నంబర్లను ఎంచుకోవడానికి, భౌగోళిక పరిమితులు లేకుండా సిమ్ లను రిప్లేస్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'ఎక్స్' లో టెలికమ్యూనికేషన్ విభాగం పోస్ట్ చేసింది.

బీఎస్ఎన్ఎల్ కు పునరుద్ధరణ ప్యాకేజీ

గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బీఎస్ఎన్ఎల్ కు రూ.89,047 కోట్లతో మూడో పునరుద్ధరణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం పునరుద్ధరించే ప్యాకేజీలో ఈక్విటీ ఇన్ఫ్యూషన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కోసం 4 జీ / 5 జీ స్పెక్ట్రమ్ కేటాయింపు కూడా ఉంది. బీఎస్ఎన్ఎల్ (BSNL) అధీకృత మూలధనాన్ని రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు ప్రభుత్వం పెంచింది.

కొంతకాలంగా రుణ సంక్షోభం

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ కొంతకాలంగా రుణ సంక్షోభంతో పోరాడుతోంది. కేంద్రం ఇప్పటివరకు బిఎస్ఎన్ఎల్ కు మూడు పునరుద్ధరణ ప్యాకేజీలను అందించింది. బీఎస్ఎన్ఎల్ / ఎంటిఎన్ఎల్ కోసం మొదటి పునరుద్ధరణ ప్యాకేజీని ప్రభుత్వం 2019 లో ఆమోదించింది. ఇది రూ.69,000 కోట్లుగా ఉండి బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ కు స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. మళ్లీ, 2022లో బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ కు రూ.1.64 లక్షల కోట్ల రెండో పునరుద్ధరణ ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాపెక్స్ కు ఆర్థిక సహకారం, గ్రామీణ ల్యాండ్ లైన్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, బ్యాలెన్స్ షీట్ పై ఒత్తిడి తగ్గించేందుకు ఆర్థిక సహకారం, ఏజీఆర్ బకాయిల పరిష్కారం, బీఎస్ఎన్ఎల్ లో బీబీఎన్ఎల్ విలీనం తదితర అంశాల కోసం ఈ నిధులను ఉపయోగించారు. ఈ రెండు ప్యాకేజీల ఫలితంగా, బీఎస్ఎన్ఎల్ 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. బీఎస్ఎన్ఎల్ మొత్తం రుణభారం రూ.32,944 కోట్ల నుంచి రూ.22,289 కోట్లకు తగ్గింది.