Sunkishala Incident : ప్రభుత్వం తప్పు లేకపోతే వారంపాటు ఎందుకు దాచారు..? జ్యూడిషియల్ ఎంక్వైరీకి కేటీఆర్ డిమాండ్-ktr alleged that the sunkishala projects retaining wall collapsed due to the governments negligence ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sunkishala Incident : ప్రభుత్వం తప్పు లేకపోతే వారంపాటు ఎందుకు దాచారు..? జ్యూడిషియల్ ఎంక్వైరీకి కేటీఆర్ డిమాండ్

Sunkishala Incident : ప్రభుత్వం తప్పు లేకపోతే వారంపాటు ఎందుకు దాచారు..? జ్యూడిషియల్ ఎంక్వైరీకి కేటీఆర్ డిమాండ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 09, 2024 02:23 PM IST

Sunkishala Wall Collapsed : సుంకిశాల ప్రమాదం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంతోనే జరిగిందని కేటీఆర్ విమర్శించారు. పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డినే ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం గురించి తెలిసినప్పటికీ బయటికి చెప్పకుండా గోప్యత పాటించారని ఆరోపించారు.

తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్
తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్

సుంకిశాల ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

అసమర్థతతోనే సుంకిశాల ప్రమాదం….

సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతోనే వల్లనే సుంకిశాల ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం తప్పు లేకుంటే ఎందుకు వారం రోజులపాటు దాచి ఉంచిందని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆగస్ట్ 2న ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సమావేశాల్లో స్టేట్ మెంట్ చేయాలి కానీ చెప్పకుండా దాచిపెట్టిందన్నారు. ఈ ప్రభుత్వానికి ఈ ప్రమాదం జరిగిన విషయం తెలియాదా? తెలిసి పట్టించుకోలేదా అని కేటీఆర్ నిలదీశారు. ఒక వేళ ప్రభుత్వానికి ఈ విషయమే తెలియదంటే మాత్రం ఇది సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.

“సుంకిశాల ప్రమాదం గురించి పక్కా మీకు తెలుసు. వారం రోజులు గోప్యంగా ఉంచారు. మీరు ఆగమాగం పనులు ప్రారంభిచంటంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులే చెబుతున్నారు. అధికారులు చెప్పినా కూడా వినకుండా గేట్లు అమర్చటంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్ మారినప్పుడు ప్రమాదం జరిగింది. లేకుంటే చాలా ప్రాణనష్టం జరిగేది. మంచి జరిగితే మాది. చెడు జరిగితే బీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేసే చిల్లర ప్రయత్నాలు వద్దు. పురపాలక శాఖను పర్యవేక్షించకుండా ఉన్నా ముఖ్యమంత్రిదే దీనికి బాధ్యత. మళ్లీ మాపైనే చిల్లర దాడి. చిల్లర ప్రయత్నం . బాధ్యతల నుంచి తప్పించుకొని గత ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేయటం సిగ్గుచేటు” అని కేటీఆర్ విమర్శించారు.

ఎన్నికల్లో ప్రయోజనం కోసం కాలేశ్వరం పైన చేసిన అడ్డగోలు వాదనలు తేలిపోయిందన్నారు కేటీఆర్. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైతే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రిజర్వాయర్లను పంపింగ్ చేసి నీళ్లను నింపుతుందని ప్రశ్నించారు. కాళేశ్వరంలో జరిగితే ఎన్డీఎస్ఏ వచ్చి… ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇచ్చిందని… మరి సుంకిశాలకు ఎందుకు కేంద్ర సంస్థ వస్తలేదని నిలదీశారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అని అనుకోవాలా అని కామెంట్స్ చేశారు.

జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయండి - కేటీఆర్

“ఈ అంశంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయండి. సంఘటన స్థలంలోనే డిప్యూటీ సీఎం భట్టి ఈ ప్రకటన చేయాలి. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం… పరిపాలన మీద పట్టులేని విషయం తెలిసిపోతోంది.ఈ విషయంలో తప్పించుకుంటామంటే ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సుంకేశాల ప్రాజెక్టు ఇంజనీరింగ్ లోపం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలో లోపం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు విధానం తప్ప… ఇప్పటిదాకా తీసుకొచ్చిన విధానాలు ఏంటిదో చెప్పాలి. మేడిగడ్డలో జరిగిన సంఘటనను మేము దాచిపెట్టలేదు. ఎన్నికల కోడ్ ఉన్న సరే ప్రమాదం జరిగిన విషయాన్ని చెప్పాం. ఘటన జరిగిన గంటల్లోనే మేము లోపాలు సర్దుతామని ఎల్ అండ్ టీ చెప్పింది. మాకు సీక్రెసీ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేకుండే. కానీ ముఖ్యమంత్రి ఎందుకు ఈ విషయాన్ని దాచారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్ లోనే సీఎం ఉన్నారు. ఆ మరునాడే దాని మీద పర్యవేక్షణ లేకుండా అమెరికా వెళ్లారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టి…బాధ్యులపై చర్యలు తీసుకోవాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సుంకిశాలకు వెళ్తాం….

సుంకిశాలలో మాత్రం 462 అడుగులు ఉన్నా సరే నీళ్లు తీసుకోవచ్చని కేటీఆర్ అన్నారు. రాబోయే 50 ఏళ్లలో హైదరాబాద్ నీటి అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ను కేసీఆర్ చేపట్టారని గుర్తు చేశారు. “ శరవేగంగా ప్రాజెక్ట్ కు ముందుకు తీసుకెళ్లాం. మూడు పైప్ లైన్ల ద్వారా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. కృష్ణానది కి మూడు, నాలుగేళ్లు వరద రాకపోయిన డెడ్ స్టోరేజ్ నుంచి సుంకిశాల ద్వారా నీళ్లు తేవచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏమీ తెలియవు. సుంకిశాలను చాలా వేగంగా పనులు పూర్తి చేశాం. ఒక్క మోటార్ ఫిట్టింగ్ పనులు మాత్రమే ఉండే. 2024 సమ్మర్ నాటికి పూర్తి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం మొత్తం పనులను పెండింగ్ పెట్టారు. మేము కూడా సుంకిశాలకు వెళ్లి మొత్తం వివరాలను అక్కడ నుంచి వివరిస్తాం” అని కేటీఆర్ ప్రకటించారు.

 

 

సంబంధిత కథనం