Duvvada episode: దువ్వాడకు ఝలక్ ఇచ్చిన జగన్.. టెక్కలి ఇంఛార్జ్‌గా మరో నేతకు బాధ్యతలు-ys jagan removed duvvada srinivas from the post of tekkali ysrcp incharge ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Duvvada Episode: దువ్వాడకు ఝలక్ ఇచ్చిన జగన్.. టెక్కలి ఇంఛార్జ్‌గా మరో నేతకు బాధ్యతలు

Duvvada episode: దువ్వాడకు ఝలక్ ఇచ్చిన జగన్.. టెక్కలి ఇంఛార్జ్‌గా మరో నేతకు బాధ్యతలు

Basani Shiva Kumar HT Telugu
Aug 23, 2024 10:07 AM IST

Duvvada episode: దువ్వాడ ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. కుటుంబ వివాదాలతో రొడ్డెక్కిన దువ్వాడకు వైఎస్ జగన్ ఝలక్ ఇచ్చారు. టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్సీపీ బాధ్యతలను వేరే నేతకు అప్పగించారు. ఇటీవల జరుగుతున్న గొడవల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జగన్‌తో దువ్వాడ శ్రీనివాస్
జగన్‌తో దువ్వాడ శ్రీనివాస్ (X)

టెక్కలి వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ పదవి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగిస్తూ.. ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. గత 15 రోజులుగా దువ్వాడ భార్య వాణి.. దివ్వెల మాధురి మధ్య వివాదం నడుస్తోంది. కుటుంబ వివాదంతో దువ్వాడ ఫ్యామిలీ రోడ్డెక్కింది. ఈ గొడవల కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తుందనే కారణంతో దువ్వాడపై వేటు వేసినట్టు తెలుస్తోంది. అటు ప్రత్యర్థి పార్టీలు కూడా వైసీపీపై విమర్శలు చేశాయి.

పొలిటికల్ టర్న్..

వాణీ, మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. వీరి వ్యవహారంలో గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై వైసీపీ సీరియస్ అయ్యింది. భార్యాభర్తల గొడవను రాజకీయం చేస్తున్నారని టీడీపీపై ఆరోపణలు చేసింది. మరోవైపు వీరి సమస్యను పరిష్కరించేందుకు లాయర్లు చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అటు కుటుంబ సభ్యులు కూడా వివాదం సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది.

వివాదం ఏంటంటే..

దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో నివాసముంటున్న ఇంటి ముందు ఆయన కుమార్తెలు, భార్య వాణి ఈనెల 8న నిరసనకు దిగారు. దాదాపు 10 రోజులు వారి నిరసన కొనసాగింది. ఇటీవల నిర్మించిన ఆ ఇంట్లో దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి అనే మరో మహిళతో ఉంటున్నారని వాణి, దువ్వాడ కుమార్తెలు ఆరోపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తమ ఇంటికి రావాలని వారు కోరుతున్నారు. చాలా రోజులుగా వాణీ, శ్రీనివాస్ మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఒక దశలో దువ్వాడపై ఎన్నికల్లో పోటీ చేసేందుకు వాణి సిద్ధపడ్డారు.

దువ్వాడ నాకు ఫ్రెండ్..

దువ్వాడ శ్రీనివాస్ తనకు ఫ్రెండ్ అని దివ్వెల మాధురి చెబుతున్నారు. తాను సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో దువ్వాడ అండగా ఉన్నారని మాధురి చెప్పారు. 2022లో తనను వైసీపీలోకి ఆహ్వానించింది దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణీనే అని మాధురి స్పష్టం చేస్తున్నారు. తాను తన సొంత డబ్బుతో మూడంతస్తుల భవనం కొన్నానని.. అందులో దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్నారనేది అవాస్తవం అని స్పష్టం చేశారు. అయితే.. ఈ ఎపిసోడ్‌లోకి మాధురి భర్త ఎంట్రీ ఇచ్చారు. ఎవరెన్ని చెప్పినా.. తాను ఆమెకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.

ఎన్నికలకు ముందే..

2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి దువ్వాడ కుటుంబంలో వివాదం నడుస్తోంది. ఆ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్‌పై ఆయన భార్య వాణీ పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఆ సమయంలో జగన్ వారిద్దరిని పిలిపించి మాట్లాడారు. ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. కానీ.. ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చాక మళ్లీ కలహాలు ప్రారంభమయ్యాయి. అవి కాస్త ఇప్పుడు పదవి నుంచి తప్పించే వరకు వచ్చాయి. అయితే.. తన భార్య వాణిపై దువ్వాడ కూడా ఆరోపణలు చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలని వాణి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.