Duvvada Srinivas : సంపాదించిందంతా ఆమెకే ఇచ్చా, నాపైకి పిల్లలను ఉసుగొల్పింది-దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
Duvvada Srinivas : గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఘటనలపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తుందని, తనపైకి పిల్లలను ఉసుగొల్పుతోందని ఆరోపించారు. తన భార్య, కుమార్తెతో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
Duvvada Srinivas : తానేమీ తప్పు చేశానని, తనకెందుకు ఈ శిక్ష అని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సంపాదించిన మొత్తం తన భార్య వాణికే ఇచ్చానని, తనపైకి పిల్లలను ఉసుగొల్పుతోందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే దువ్వాడ వాణి, ఆమె కుమార్తె హైందవిని వెంటనే అరెస్టు చేయాలని, దువ్వాడ వాణి అనుచరుడు గుజ్జు మోహన్ రెడ్డి, కోరాడ కామేష్, మొర్రి శంకరరావు, పొందారు శ్రీనివాసరావు, ఆట్ల రాహుల్ కుమార్ లను కూడా అరెస్టు చేయాలని, పోలీసులకు దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
గత రెండు రోజులుగా జరుగుతోన్న పరిణామాలపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దువ్వాడ శ్రీనివాస్ అన్ని వివరాలను వెల్లడించారు. ఆయన తల్లి కూడా అక్కడకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయమే గెలుస్తుందని అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు.. ఆయన కొత్తగా నిర్మించుకొని ఉంటున్న నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన వారిని లోపలికి అనుమతించలేదు. గేట్లు వేసి ఉండటంతో కుమార్తెలిద్దరూ ఇంటి బయటే బైఠాయించారు. అర్ధరాత్రి వరకు తమ తండ్రి తమకు కావాలంటూ అక్కడే ఉన్నారు. తమ తండ్రి వేరొక మహిళతో ఉంటున్నారని పేర్కొన్నారు. మా నాన్న వేరొక మహిళతో సహజీవనం చేస్తున్నారని, ఆయన ఇంటికి రావడం లేదని, మా నాన్న కోసమే తాము వెళ్లామని అన్నారు. తన భర్తను దివ్వల మాధురి ట్రాప్ చేసిందని దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు.
దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. మీడియా దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె, భార్యా వాణితో ఇంటర్వ్యూలతో హడావుడి చేయడం, దువ్వాడ శ్రీనివాస్ మరొక మహిళతో అక్రమంగా ఉంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దువ్వాడ శ్రీనివాస్, మరొక మహిళ దివ్వల మాధురి ఫొటో షాప్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే దివ్వల మాధురి రీల్స్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో రంగంలో దిగిన దివ్వల మాధురి మీడియాతో మాట్లాడారు. తనను బజార్లోకి లాగొద్దని, తనకు పిల్లలు ఉన్నారని పేర్కొంది. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఒక మంచి స్నేహితుడని, ఒక మార్గదర్శి అని పేర్కొంది. తాను ఇబ్బందులతో సూసైడ్ చేసుకోవాలనుకున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా నిలిచారని చెప్పారు. అంతేతప్ప తమ మధ్య ఉన్న సంబంధం అక్రమం కాదని స్పష్టం చేశారు.
దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణిపై కూడా ఆరోపణలు చేశారు. ఆమె తనకు భర్త వద్దు, ఎమ్మెల్యే టిక్కెట్టు చాలు అనుకున్నారని ఆరోపణలు గుప్పించారు. తనపై ఎలాగూ తప్పుడు ప్రచారం చేశారు కదా, తాను ఇకపై దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానని వెల్లడించారు. ఒక స్నేహితురాలిగా ఉంటానని, స్నేహితులు కలిసి ఉండ కూడదా? అని ఆమె ప్రశ్నించారు.
దువ్వాడ శ్రీనివాస్‌ను ట్రాప్ చేయడానికి ఆయన వద్దేమీ ఆస్తులు లేవని, ఉన్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యులకే రాసిచ్చేశారని పేర్కొన్నారు. ఆయన దగ్గర ఏముందని ఆశించి ట్రాప్ చేస్తానని మాధురి ఎదురు ప్రశ్నలు వేశారు. ఇంకా తానే దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశానని, అది వైసీపీ కార్యకర్తలందరికీ తెలుసని పేర్కొన్నారు. తమది అక్రమ సంబంధం కాదని, ఎవరితో ఎవరైనా కలిసి ఉండే హక్కు ఉందని దివ్వల మాధురి పేర్కొన్నారు. దువ్వాడ వాణి తనపై ఆరోపణలు చేయకుండా, తన కుటుంబంలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలని హితువు పలికారు. వారి సమస్యల్లోకి తనను లాగొద్దని, తనపై ఆరోపణలు చేయకూడదని అన్నారు.
అయితే శుక్రవారం రాత్రి కుమార్తెతో కలిసి వాణి భర్త ఉన్న ఇంటికి వెళ్లింది. అప్పుడు వాళ్లను లోపలికి రానివ్వలేదు దువ్వాడ శ్రీనివాస్. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తలుపులను నెట్టేందుకు వాణి, కుమార్తె ప్రయత్నించారు. వెంటనే ఆగ్రహం వ్యక్తం చేసిన దువ్వాడ శ్రీనివాస్ వారిని నెట్టేశారు. శ్రీనివాస్, భార్య, కుమార్తెలు పరస్పరం తిట్టుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, వాణి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి మెట్లపైనే ఆయన భార్య బైఠాయించింది. సీఐ వారిని పంపకపోతే తానే ఈడ్చేస్తానని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సమయంలో ఇరుపక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శ్రీనివాస్ ఏకంగా అక్కడుండే వస్తువు తీసి, భార్య, ఆమె కుటుంబీకులపైకి దూసుకెళ్లాడు. ఇంతలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇలా రెండు రోజులుగా కుటుంబ వివాదం రోడ్డెక్కి ఒక ఎపిసోడ్‌గా సాగుతోంది.
దీంతో శనివారం దువ్వాడ శ్రీనివాస్ ఈ ఎపిసోడ్ మొత్తంపై మీడియా సమావేశంలో స్పందించారు. తన భార్య వాణి అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తనపై కుమార్తెలకు ద్వేషం నూరిపోసిందని, నాపై ఈర్ష్యా ద్వేషాలు పెంచి, తనను ప్రశ్నించేందుకు పిల్లలను ఉసిగొల్పిందని ధ్వజమెత్తారు. తన తల్లిని సైతం తిడుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోనూ గొడవలు వస్తాయని, వాటిని నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలని అన్నారు. రాజకీయ, వ్యాపార రంగాల్లోనూ తానే ఉండాలని అహంకారం వాణికి తుందని, నా రాజకీయం, వ్యాపార పరిస్థితులు బాగున్నప్పుడు అందులో ఆమె ఆధిపత్యమే ఉండాలని కోరుకునేదని అన్నారు. తనకు వైసీపీ అధినేత ఎమ్మెల్యే టిక్కెట్టు ప్రకటించిన తరువాత, తనకు టిక్కెట్టు కావాలని అధిష్ఠానం వద్దకు వాణి వెళ్లిందని వివరించారు. టికెట్టు తనకు ప్రకటించాలని, దువ్వాడ శ్రీనివాస్‌తో విడాకులు కావాలని పట్టుపట్టిందని అన్నారు. లేకపోతే విషం తాగుతానని బెదిరించిందని పేర్కొన్నారు.
చర్చల తరువాత, కుటుంబం కోసం జగన్‌కు నచ్చజెప్పి నా టికెట్టును వాణికే ప్రకటించానని, అయితే క్షేత్రస్థాయిలో వాణికి అనుకూలంగా లేదని తేలడంతోనే మళ్లీ టికెట్లు తనకు ఇచ్చారని తెలిపారు. తనకే స్వార్థం ఉంటే ఆమెకు టికెట్టు ఎందుకు ప్రకటిస్తానని ప్రశ్నించారు. వాణికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని, గ్రానైట్ వ్యాపారంలో ఎంత డబ్బు వస్తే అంత వాణి చేతిలోనే పెట్టానని తెలిపారు. ఏనాడూ లెక్క కూడా అడగలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే టికెట్టు ప్రకటించిన మూడో రోజు నుంచి తనను ఇంటికి రానివ్వలేదని, తాళాలు వేసిందని వివరించారు. పాతికేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అవహేళనలు, అవమానాలు పడ్డానని పేర్కొన్నారు. నా టికెట్టు , సంపాదన వదులుకున్నానని, తానేం తప్పు చేశానని, తనకెందుకు ఈ శిక్ష? తనకెందుకు ఈ హింస? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నా తల్లిని అనరాని మాటలతో వాణి వేధించిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఆ సమయంలో తన తల్లిని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన తల్లి తన పక్కనే ఉంటుందని అన్నారు. తన కుమారుడికి కష్టం వచ్చిపడిందని, న్యాయమే గెలుస్తుందని అని దువ్వాడ శ్రీనివాస్ తల్లి పేర్కొన్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు శుభం కార్డు పడుతుందో తెలియడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం