MLC Duvvada Srinivas : దువ్వాడ ఇంటివద్ద అర్ధరాత్రి హైడ్రామా..! తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు యత్నం
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఆయన భార్య, పెద్ద కుమార్తె ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. గేట్లు తెరుచుకోక పోవడంతో డోర్లను కట్టర్లతో కట్ చేశారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఈ క్రమంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
MLC Duvvada Srinivas : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం హాట్ టాపిక్ మారింది. ప్రస్తుతం కుటుంబంతో కాకుండా… దువ్వాడ కొత్తగా నిర్మించిన ఇంటి ముందు ఆయన కుమార్తెలు దువ్వాడ హైందవి, మరో కుమార్తె నిరీక్షించడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
శుక్రవారం పెద్ద కుమార్తె హైందవితో పాటు ఆయన భార్య దువ్వాడ వాణి కూడా శ్రీనివాస్ నివాసం వద్దకు వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచే ప్రయత్నం చేశారు. గేట్లు ఓపెన్ కాకపోవడంతో డోర్లను కట్టర్లతో కట్ చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్లారు.
ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య వాణి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఓ దశలో శ్రీనివాస్… ఆయన భార్యపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాస్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు.
పోలీసులు దువ్వాడను అడ్డుకొని వాణికి రక్షణగా నిలిచారు. ఈ క్రమంలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్ తో పాటు…భార్య దువ్వాడ వాణి, హైందవిల మధ్య తీవ్రస్థాయి వాదోపవాదనలు కొనసాగాయి. క్యాంపు కార్యాలయం ఖాళీచేసి వెళ్లిపోవాలని దువ్వాడ వాణి పట్టుబట్టింది. ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలతో మీడియాతో దువ్వాడ శ్రీనివాస్…. వాణిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రెండేళ్లుగా తనను తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తనను చంపించే ప్రయత్నం కూడా జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే నామీద ఉన్న ఆస్తులన్నీ వారికి రాసిచ్చని చెప్పుకొచ్చారు. మొత్తం వ్యవహారంపై దువ్వాడ శ్రీనివాస్.. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని అక్కవరం గ్రామంలో జాతీయ రహదారిపై దువ్వాడ ఇటీవల కొత్తగా ఇంటిని నిర్మించుకున్నారు. దువ్వాడ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో కొత్త ఇంట్లోకి వెళ్లేందుకు ఆయన కుమార్తెలు ప్రయత్నించారు.
గురువారం సాయంత్రం 3.30 గంటలకు దువ్వాడ కుమార్తెలు అక్కడకు చేరుకున్నా వారిని లోనికి రానివ్వలేదు. దీంతో వారు ఇంటి బయటే నిరీక్షించారు. దువ్వాడతో కొంత కాలంగా ఆయన సతీమణికి విభేదాలు కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా దువ్వాడ సతీమణి చివరి నిమిషం వరకు పోటీలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధం కావడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు.
వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో కొంత కాలంగా విభేదాలు నెలకొన్నాయి. మరో మహిళతో సంబంధం నేపథ్యంలో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని విభేదాలు తలెత్తాయి. దీంతో భార్యా కుమార్తెలు విడిగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో ఇవి మరింత ముదిరాయి. దువ్వాడకు టిక్కెట్ ఇవ్వడాన్ని ఆయన సతీమణి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యే టిక్కెట్ తనకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఇది తీవ్ర దుమారం రేపింది. ఎన్నికల సమయంలో కూడా వారు అంటిముట్టనట్టే వ్యహరించారు.
మరోవైపు దువ్వాడ వాణి… ప్రస్తావించిన మహిళ దివ్వల మాధురి కూడా శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తనది అక్రమ సంబంధమేమీ కాదని మాధురి క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఒక మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. దయచేసి తనను బజారులోకి లాగొద్దని కోరారు. మీడియాతో మాట్లాడిన మాధురి.. శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.
ఎలాగూ తప్పుడు ప్రచారం చేశారు కదా… తాను ఇకపై దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానని వెల్లడించారు. ఒక స్నేహితురాలిగా ఉంటానని, స్నేహితులు కలిసి ఉండకూడదా? అని ఆమె ప్రశ్నించారు. తనకు ఇంకా విడాకులు అవ్వలేదని మాధురి వివరించారు.
దువ్వాడ ఇంటి వ్యవహరం ప్రస్తుతం శ్రీకాకుళంలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతోన్నాయి. దివ్వల మాధురి కూడా వైసీపీలోనే ఉన్నారు.