MLC Duvvada Family Controversy : దువ్వాడతోనే ఉంటా, మా బంధం ఇల్లీగల్ కాదు - దివ్వల మాధురి కామెంట్స్
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తనది అక్రమ సంబంధమేమీ కాదని దివ్వల మాధురి క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఒక మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. దయచేసి తనను బజారులోకి లాగొద్దని కోరారు. మీడియాతో మాట్లాడిన మాధురి.. శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు.
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలనంగా మారారు. గతంలో రాజకీయాల్లోనూ, ఇప్పుడు కుటుంబ వ్యవహారాల్లోనూ ఆయన వ్యవహారికశైలి కొంత వివాదస్పదంగానూ, మరికొంత సంచలనంగా ఉంటుంది. గతంలో రాజకీయాల్లో టీడీపీ నేతలను ఎదురించి నిలబడిన వ్యక్తిగా పేరొందిన దువ్వాడను… ఇప్పుడు కుటుంబ సమస్యలు చుట్టేశాయి.
ఎన్నికలకు ముందు ప్రారంభమైన ఈ కుటుంబ సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందే దువ్వాడ శ్రీనివాస్‌పై స్వతంత్ర అభ్యర్థిగా ఆయన ఆయన భార్య వాణి రంగంలోకి దిగారు. అప్పుడు వైసీపీ పెద్దలు సముదాయించడంతో ఆమె కాస్తా వెనక్కి తగ్గారు. అయితే ఆ ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ ఓటమి చెందారు. వైసీపీ పార్టీ కూడా ఓటమి చెందింది. దీంతో మళ్లీ ఇప్పుడు కుటుంబ సమస్యలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.
మా నాన్న వేరొక మహిళతో సహజీవనం చేస్తున్నారని, ఆయన ఇంటికి రావడం లేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు గురువారం రాత్రి దివ్వల మాధురి ఇంటికి వెళ్లారు. ఆ ఇల్లు మా నాన్నే కట్టించారని, మా నాన్న కోసమే తాము వెళ్లామని అన్నారు. తన భర్తను దివ్వల మాధురి ట్రాప్ చేసిందని దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో దువ్వాడ వాణి ఆరోపణలపై దివ్వల మాధురి మీడియా సమావేశం పెట్టి వాణిపైనే ఆరోపణలు చేశారు. ఆమె భర్త వద్దు, కేవలం ఎమ్మెల్యే టిక్కెట్టు చాలు అనుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇబ్బందులతో సూసైడ్ చేసుకోవాలనుకున్న సమయంలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా నిలిచారని చెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు ఒక మంచి స్నేహితుడని, నిజాయితీపరుడని చెబుతూ తమ మధ్య సంబంధాన్ని వివరించారు.
దువ్వాడ శ్రీనివాస్‌ను ట్రాప్ చేయడానికి ఆయన వద్దేమీ ఆస్తులు లేవని, ఉన్న ఆస్తులన్నీ కుటుంబ సభ్యులకే రాసిచ్చేశారని పేర్కొన్నారు. ఆయన దగ్గర ఏముందని ఆశించి ట్రాప్ చేస్తానని మాధురి ఎదురు ప్రశ్న వేశారు. ఇంకా తానే దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశానని… అది వైసీపీ కార్యకర్తలందరికీ తెలుసని పేర్కొన్నారు.
తమది అక్రమ సంబంధం కాదని, ఎవరితో ఎవరైనా కలిసి ఉండే హక్కు ఉందని దివ్వల మాధురి పేర్కొన్నారు. దువ్వాడ వాణి తమపై ఆరోపణలు చేయకుండా, తన కుటుంబంలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలని హితువు పలికారు. వారి సమస్యల్లోకి తనను లాగొద్దని… తనపై ఆరోపణలు చేయకూడదని పేర్కొన్నారు.
తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆరోపణలు చేయడం వల్లనే తాను మీడియా ముందుకు వచ్చానని మాధురి స్పష్టం చేశారు. తన క్యారెక్టర్‌పై ఆరోపణలు చేస్తే బాగోదని, తనకు ఎటువంటి సంబంధం లేని దానిలో తనను లాగొద్దని హితవు పలికారు. దువ్వాడ వాణి ఎలాంటి వారో అందరి తెలుసని, టెక్కలిలో ఎవరిని అడిగిన చెబుతారని అన్నారు.
ఎలాగూ తప్పుడు ప్రచారం చేశారు కదా… తాను ఇకపై దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానని వెల్లడించారు. ఒక స్నేహితురాలిగా ఉంటానని, స్నేహితులు కలిసి ఉండకూడదా? అని ఆమె ప్రశ్నించారు. తనకు ఇంకా విడాకులు అవ్వలేదని మాధురి వివరించారు. ఈ వ్యవహరం ప్రస్తుతం శ్రీకాకుళంలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతోన్నాయి. దివ్వల మాధురి కూడా వైసీపీలోనే ఉన్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌పై దువ్వాడ శ్రీనివాస్ స్పందించలేదు.
రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం