Kurnool District : పొలం వివాదం - దళిత మహిళపైకి ట్రాక్టర్ ఎక్కించి, కర్రలతో దాడి చేసి హత్య
Kurnool District News : కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. దళిత మహిళపైకి ట్రాక్టర్ ఎక్కించటంతో పాటు కర్రలతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో దళిత మహిళ కొనుగోలు చేసిన భూమిలో తమకు వాటా ఉందంటూ దౌర్జన్యానికి దిగిన ఒక వ్యక్తి..,, ఆ మహిళపైకి ఏకంగా ట్రాక్టర్ ఎక్కించాడు. ఆపై మరొకరు కర్రలతో దాడి చేశాడు. దీంతో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

ఆమెకు సహాయంగా వెళ్లిన మరో వ్యక్తిపై కూడా దాడి చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ డిమాండ్ చేస్తోంది.
శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహళ్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆ గ్రామంలోని దళిత మహిళ గుండమ్మ (49) నివాసం ఉంటుంది. కొంత కాలం క్రితం అదే గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిల పినతల్లి తిరుపతమ్మ వద్ద గుండమ్మ నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసినప్పుడు ఏమీ అనకుండా ఇటీవలి గుండమ్మను రాఘప్ప రెడ్డి, కుమారుడు శ్రీధర్ రెడ్డిలు వేధించడం మొదలు పెట్టారు. ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ భూమిలో తమకు వాటా ఉందంటూ కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ భూమి వివాదం న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ దౌర్జన్యంగా రాఘప్ప రెడ్డి, శ్రీధర్ రెడ్డి మరో నలుగురుతో కలిసి ట్రాక్టర్ తీసుకొని భూమి మీదకు వెళ్లారు. పొలం దున్నేందుకు ప్రయత్నించారు. దీంతో విషయం తెలుసుకున్న గుండమ్మ అక్కడకు చేరుకుని, పొలం దున్న కుండా అడ్డుకున్నారు. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇలా వాగ్వాదం కొద్ది సేపు జరిగింది. అనంతరం రాఘప్ప రెడ్డి, శ్రీధర్ రెడ్డి పొలం దున్నడానికి తీసుకొచ్చిన ట్రాక్టర్‌ను గుండమ్మపైకి ఎక్కించారు. ఆ తరువాత ఆమెపై కర్రలతో దాడి చేశారు. దీంతో గుండమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే గుండమ్మకు తోడుగా వెళ్లిన ఆదోని పట్టణంలోని కల్లుబావికి చెందిన పురుషోత్తంరెడ్డిపై రాఘవేంద్ర రెడ్డి, శ్రీధర్ రెడ్డి అనుచరులతో దాడి చేశారు. కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో పురుషోత్తం రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న గుండమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు అక్కడి చేరుకుంటున్నారని తెలిసి, నిందితులు రాఘప్ప రెడ్డి, శ్రీధర్ రెడ్డి అక్కడి నుంచి పరారయ్యారు.
చనిపోయిన గుండమ్మను పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడిన పురుషోత్తం రెడ్డిని కూడా చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గుండమ్మ బంధువులకు వైద్యులు అప్పగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ స్థానికులను అడిగి వివరాలు సేకరించారు.
రాఘప్ప రెడ్డి, శ్రీధర్ రెడ్డితో పాటు మరో నలుగురు సోమశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామకృష్ణ, గోవిందులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అతి త్వరగానే నిందితులను అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అలాగే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్తతలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబాన్ని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కలిశారు.