Atchutapuram incident: అచ్యుతాపురం ప్రమాదం.. థర్డ్ పార్టీ నివేదిక ఏం చెప్పింది.. టీడీపీ, వైసీపీ ఏమంటున్నాయి?
Atchutapuram incident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మంది వరకు గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి తాజాగా థర్డ్ పార్టీ నివేదికపై రాజకీయ రచ్చ జరుగుతోంది.
అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపై టీడీపీ, వైసీపీ మధ్య వార్ జరుగుతోంది. ఈ విషాద ఘటనకు కారణం కూటమి ప్రభుత్వమే అని వైసీపీ ఆరోపిస్తుంటే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో అసలు థర్డ్ పార్టీ నివేదిక ఏం చెప్పింది.. టీడీపీ ఏమంటోంది.. వైసీపీ ఏం చెబుతోందనే చర్చ జరుగుతోంది.
టీడీపీ వెర్షన్..
'అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాదంపై థర్డ్ పార్టీ కీలక నివేదికలో బయటపడ్డ గత ప్రభుత్వ అలసత్వం. ప్రమాదం వెనుక యాజమాన్యం, నాటి అధికారుల నిర్లక్ష్యం స్పష్టం. గత ఏడాది ఇచ్చిన రిపోర్ట్ లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఉన్న అనేక లోపాలను ఎత్తి చూపిన థర్డ్ పార్టీ నివేదిక. కంపెనీలోని పైప్‍లైన్‍ను తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఏర్పాటు చేయాలని నివేదిక. పైప్‍లైన్ నుంచి రియాక్టర్‌కు వెళ్లే సాల్వెంట్ లీక్ అయితే.. దీనికి పెట్రోల్ కంటే మండే శక్తి ఎక్కువుగా ఉంటుందని.. ప్రమాదం జరగవచ్చని హెచ్చరించింది. పైప్‍లైన్‍ను తనిఖీ చేసే సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలని థర్డ్ పార్టీ ఇచ్చిన నివేదికని పట్టించుకోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ. పైప్‍లైన్‍ను తనిఖీ చేసే సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయాలని ఎసెన్షియా ఫార్మా కంపెనీ యాజమాన్యం పై ఒత్తిడి చేయని నాటి జగన్ ప్రభుత్వం. నేడు అదే విధంగా సాల్వెంట్ లీక్ అయి.. రియాక్టర్ పేలి ఇంత ప్రమాదం జరిగింది. థర్డ్ పార్టీ రిపోర్ట్‌లో లోపాలు స్పష్టంగా ఉన్నా.. నాటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?' అని తెలుగుదేశం పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
వైసీపీ వెర్షన్ ఎంటీ..
'మీ కార్మిక శాఖ మంత్రి సుభాష్ థర్డ్ పార్టీ ఏజెన్సీతో ఆడిట్ చేయడంలో అవకతవకలు జరిగాయంటాడు. సీఎం చంద్రబాబు రిపోర్టు వచ్చినా ఎగ్జిక్యూషన్ సరిగ్గాలేదని ఆక్షేపిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆడిట్ చేయిస్తే పారిశ్రామిక వేత్తలు ఇబ్బందిగా ఫీలవుతున్నారని, పెట్టుబడుల వాతావరణం దెబ్బతింటుందని అంటారు. మీ సోషల్ మీడియా అధికారిక ఖాతాలో ఉదయం గత ప్రభుత్వం లంచాలు తీసుకుని అసలు ఆడిట్ చేయలేదని.. మళ్లీ ఇప్పుడేమో గత ప్రభుత్వం చేసిన ఆడిట్ రిపోర్ట్‌ను సర్టిఫై చేస్తారు. ముందు మీరు ఏదొకటి ఖారారు చేసుకుని మీ వైఖరేంటో స్పష్టం చేయండి' అని వైసీపీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
కోటి రూపాయలు పరిహారం..
మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఆరోపించారు. దాని పర్యవసానమే ఈ ప్రమాదం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.