Attack on TDP Office: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం.. 85 మంది వైసీపీ నేతలకు నోటీసులు
Attack on TDP Office: ఆంధ్రా రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. 85 మంది వైఎస్సార్సీపీ నేతలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ ఇష్యూ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వీరికి నోటీసులు ఇచ్చారు. కొంత మంది కీలక నేతలపై ఫోకస్ పెట్టారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు 85 మంది వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచనలతో మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో 105 మందిపై కేసు నమోదు అయ్యింది. వీరిలో 25 మంది మాత్రమే పోలీసుల విచారణకు హాజరయ్యారు. మిగతా వారు రాలేదు. ఆగస్టు 21న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
అయినా విచారణకు రాకపోవడంతో.. ఉన్నతాధికారుల సూచనలతో తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో భాగంగా ఇప్పటికే కొంతమంది వైసీపీ కీలక నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అటు మరికొంత మంది నోటీసులు అందుకోకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. వారిపైనా నిఘా కొనసాగుతోంది. ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలక నేతల గన్‌మెన్‌ల వాంగ్మూలాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు.
సీసీ ఫుటేజీ ఇవ్వండి..
ఇదిలా ఉండగా.. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీటీవీ రికార్డులను సమర్పించాలని వైసీపీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత వారం పార్టీ కార్యాలయం గోడకు ఈ నోటీసును అంటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. వైసీపీ యువనేత దేవినేని అవినాష్ పేరును కూడా పోలీసులు ఈ కేసులో చేర్చారని తెలిసింది. ఈ నోటీసులపై వైసీపీ స్పందిస్తూ.. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ కేసులో ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే వైసీపీ నేతల పేర్లు పెడుతుందని విమర్శించింది.
రాడ్లు.. రాళ్లు.. కర్రలతో..
2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై రాడ్లు, కర్రలు, రాళ్లతో కొందరు దాడి చేశారు. అయితే.. ఆ దాడి వెనక గత ప్రభుత్వంలో కీలక నేతలు ఉన్నట్టు టీడీపీ ఆరోపించింది. దాడి కుట్ర వైసీపీ ఆఫీసులోనే జరిగిందని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ముఖ్యంగా దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ దాడి కేసులో గత నెలలో ముగ్గురిని అరెస్టు చేశారు. జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.