CBN Cateract Issue: చంద్రబాబు కంటి శస్త్ర చికిత్సకు అనుమతి లభించేనా?
CBN Cateract Issue: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కంటికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నందున మధ్యంతర బెయిల్ దాఖలు చేయాలని హైకోర్టు వెకేషన్ బెంచ్‌ను ఆశ్రయించారు. చంద్రబాబు కుడికంటికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నందున మధ్యంతర బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరుపనుంది.
CBN Cateract Issue: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం జైల్లో అధికఉష్ణోగ్రతలతో చంద్రబాబుకు ఒంటిపై దద్దుర్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేయడంతో ఏసీబీ ప్రత్యేక కోర్టు చంద్రబాబు బ్యారక్‌లో ప్రత్యేకంగా టవర్ ఏసీ ఉంచేందుకు అనుమతించింది. ఆ తర్వాత కూడా బాబుకు అనారోగ్య సమస్యలు కొనసాగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు బెయిల్ కోసమే వైద్య సమస్యల్ని తెరపైకి తెస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
74ఏళ్ల వయసులో చంద్రబాబు తీవ్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని మధ్యంతర బెయిల్ కావాలని గురువారం బాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు.బాబు కుడి కంటికి అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరం ఉందని, వ్యక్తిగత వైద్యుల ద్వారా చికిత్స తీసుకోవాల్సి ఉన్నందున మధ్యంతర బెయిలు మంజూరు చేయాలనికోరుతూ హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది.
బాబు పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు సైతం నివేదికలు ఇచ్చారని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికను జత చేశారు.
ఈ ఏడాది జూన్‌లో ఎడమ కంటి శుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు. సెప్టెంబరులోపు కుడి కంటికి సైతం చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం కుడి కంటి చూపు మందగించిన కారణంగా అత్యవసరంగా శస్త్ర చికిత్స అవసరమని వివరించారు. జాప్యం చేస్తే చూపు పూర్తిగా మందగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీనిపై ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిపుణులు అక్టోబర్ 21న ఇచ్చిన నివేదికను కోర్టు ముందు ఉంచారు.
మరోవైపు బాబు పిటిషన్ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని జిల్లా మెడికల్ బోర్డుకు సిఫార్సు చేయాలని సిఐడి కోరే అవకాశాలు ఉన్నాయి. రిమాండ్ ఖైదీల అత్యవసర చికిత్సల విషయంలో సాధారణ ఖైదీలకు వర్తించే నిబంధనలే ఎవరికైనా వర్తిస్తాయని బాబుకు కూడా మెడికల్ బోర్డు సిఫార్సు చేస్తే ప్రభుత్వమే శస్త్ర చికిత్సలు చేయించే అవకాశాలు ఉన్నాయి. సాధారణ ఖైదీలకు భిన్నంగా రిమాండ్‌లో ఉండగా సొంత వైద్యానికి అనుమతించే అవకాశాలు ఉండవని న్యాయవాదులు చెబుతున్నారు. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు కొనసాగుతున్నందున రెగ్యులర్ బెంచ్ విచారించే వరకు వేచి ఉండాలని కోరే అవకాశాలు లేకపోలేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వరవరరావు కేసులో రెండేళ్ల విచారణ...
ఎల్గార్ పరిషత్ కేసులో మహారాష్ట్ర జైల్లో ఉన్న 84ఏళ్ల విప్లవకవి వరవరరావు కంటి చూపుకు శస్త్ర చికిత్స కోసం రెండేళ్ల న్యాయపోరాటం చేశారు. ముంబై ఆస్పత్రుల్లో చికిత్సను భరించలేనని, తెలంగాణ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయించుకుంటానని చేసిన విజ్ఞప్తిపై ఎన్‌ఐఏ కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు దాదాపు రెండేళ్ల పాటు విచారణ సాగినట్టు న్యాయనిపుణులు గుర్తు చేస్తున్నారు.
ఏదైనా కేసు విచారణలో ఉండగా ఖైదీలకు ప్రత్యేక మినహాయింపులు ఉండవని, సొంత వైద్యానికి అనుమతించరని చెబుతున్నారు. వరవరరావుకు ప్రత్యేక పరిస్థితుల్లో సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత హైదరాబాద్‌లో శస్త్ర చికిత్సకు అనుమతించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుతో పోలిస్తే వరవరరావు వయసులో కూడా పెద్దవారని చెబుతున్నారు.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన ప్రధాన బెయిలు పిటిషన్, మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ శుక్రవారం విచారణ జరపనుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణ జరుగనుంది.